ఒక్కోసారి భలే చిత్రాలు జరుగుతుంటాయ్. ఒక కథను చాలా మంది వద్దనుకుంటారు. ఎవరో టేకప్ చేస్తారు. అది హిట్ అయిపోతుంది. ఇటీవల తమిళంలో విడుదలయిన మానాడు సినిమా వ్యవహారం అలాంటిదే.
హీరో శింబుకు చాలా కాలం తరువాత హిట్ ఇచ్చి, కెరీర్ కు ఊపిరి ఊదిన సినిమా అది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అది అవుతుందా? కాదా అన్న సంగతి అలా వుంచితే, అసలు ఆ కథ తెలుగు నుంచే తమిళంలోకి వెళ్లింది అన్నది అసలు ట్విస్ట్.
మానాడు దర్శకుడు వెంకట్ ప్రభు ఈ కథను తెలుగు హీరోలకే ముందు చెప్పాడు. నితిన్, సాయి తేజ్, ఇంకా మరో ఒకరిద్దరు హీరోలు ఈ కథ విని, అంతగా సూట్ అవుతుందా? అని అనుమాన పడి, ఆఖరికి వదిలేసారు. అది కాస్తా తమిళ్ లో శింబు దగ్గరకు వెళ్లడం, సినిమా రెడీ కావడం, హిట్ కావడం తెలిసిందే.
నిజానికి ఈ సబ్ఙెక్ట్ ను మన హీరోలు అనుమానించడం కాస్త సబబే. కథలో వెరైటీ వుంది కానీ, అది వన్స్ సిన్మా మొదలైన తరుువాత రొటీన్ గా మారిపోతుంది. అందుకే మనవాళ్లు జంకారు. ఇప్పుడు దీన్ని తెలుగులోకి తేవాలనుకుంటున్నారు. ఎవరు ఊ అంటారో చూడాలి.