cloudfront

Advertisement


Home > Movies - Movie News

మన కుల సినిమా కాదు కదా?

మన కుల సినిమా కాదు కదా?

బాహుబలికి ముందు సినిమా లేదు - బాహుబలి తరువాత సినిమా ఉండదు. వంచిన రామోజీ ఫిలింసిటీ ఈత చెట్ల విల్లుకు సంధించిన మానవసైన్య బాణ సంచయ సంఘాతానికి శతృ దుర్భేద్యమయిన రికార్డుల కోటలు పెళ్లలు పెళ్లలుగా విరిగిపడ్డాయి. అమరేంద్ర బాహుబలి ముని వేళ్లమీదుగా వదిలిన విల్లులు ఒకటి వేలుగా విస్ఫూ లింగాలై ప్రపంచ ప్రేక్షకుల గుండెలను తగిలాయి. రాజధర్మానికి కొడుకునే చంపిన తల్లి, ప్రభువు ఆదేశానికి వెన్నుపోటు అయినా వెన్నపూసగా వెనకనుండీ కత్తిదించిన కట్టప్ప కర్తవ్యదీక్ష, దూకే జలపాతాలకు ఎదురు ఎగబాకే బాహుబలి గాలిలోనే సంధించే బాణ విన్యాసాలు... ఇలా బాహుబలి లీలావినోదాలను మన అనుకుల మీడియా రామాయణ, భారతాలకన్నా పవిత్రమయినవిగా పొగిడాయి.

మనం ఆ వార్తల్లో తడిసి ముద్దయి, గోదావరి పుష్కరాల్లో మునగకపోయినా, బాహుబలి చూడకపోయినా నరకం తప్పదన్న తెలివిడితో - గంగలో మునిగాం, బహుబాలి జ్ఞాన గంగలోనూ మునిగాం, ఎప్పటికి తేలుతామో సినిమాకుల ప్రవచనకారులు సెలవివ్వాలి. ఇప్పుడు యుగ విభజన ప్రమాణాలు కూడా మారాయి. బాహుబలికి ముందుది పాత రాతియుగం, తరువాతది హరప్పా మోహంజదారో నవనాగరిక వికసిత విచలిత విస్మిత విద్యుల్లతాలింగిత నాగరికత. కిలికిలి గిలిగిలిగా కులికిన కొత్త పలుకుల భాషనే పుట్టించిన సినిమా బాహుబలి.

అయితే దేనికయినా ఒక హద్దు, ఒక పధ్ధతి ఉండాలి. అనుకుల సినిమా అయితే గౌతమీపుత్ర కర్ణాకర్ణి అయినా, దేవుడే సిగ్గుపడి తలదించుకోవాల్సిన అకథానాయకుడయినా సినిమాకుల పలుగాకుల లోకం మొదటి ఆటకే ట్విట్టి, మొదటి ఫ్రేముకే మొక్కి, ఆనందం ఆర్ణవమై, అనురాగం అంబరమై, అనుబంధం కళ్ళల్లో రక్తమై ఆనంద బాష్పాలుగా కంటికి మంటికి ఏకధార కడుతుంది. మీడియా పేరంటాల భజనగీతాలు, సక్సెస్ మీట్ల బస్సుయాత్రల దండ యాత్రలు, సిగ్గుపడిన రికార్డులు సిగ్గువిడిచి పాడే జయజయధ్వానాలు -కథానాయకుల సకుటుంబ సాంస్కృతిక కదంబ వీర విహారాలు - టీవీ తెరలు మూసినా ప్రత్యక్ష ప్రసారాలుగా, ప్రత్యేక కార్యక్రమ విభూతులుగా, సామాజిక మాధ్యమ విజృంభణలుగా వైనవైనాలుగా కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి.

యాత్ర ఒక సినిమా. యాత్ర ఒక బయోపిక్ కాని బయోపిక్. యాత్రలో ఏముందో? యాత్ర ఎలా ఉందో? యాత్ర బాగుందో? బాగాలేదో కూడా సినిమాకుల పెద్దలు ఎవ్వరూ మాట్లాడరు. మాట్లాడకూడదు. ఎందుకంటే యాత్ర వారికి అంటరానిది. చూడరానిది. మాట్లాడకూడనిది. స్లాబులు ఎత్తేసి వైఎస్ ఆర్ సినిమాకు మేలుచేసి ఉండవచ్చు - కానీ  వైఎస్ సినిమాకులంవాడు కాదుకదా? వైఎస్ వల్ల వేల ఎకరాలు రెగ్యులర్ అయి వేలకోట్లకు పడగలెత్తి ఉండవచ్చు - కానీ వైఎస్ సినిమా కులంవాడు కాదు కదా?

యాత్రలో పాటలు బాగుండి ఉండవచ్చు - కానీ మాట్లాడకూడదు.
యాత్రలో మాటలు బాగుండి ఉండవచ్చు - కానీ మాట్లాడకూడదు.
యాత్రలో కన్నీళ్లు తెప్పించేంత విషాదం ఉండి ఉండవచ్చు - కానీ మాట్లాడకూడదు.

అసలు యాత్ర సినిమానే గుర్తించకూడదు -ఎందుకంటే అది మన అనుకుల కులసినిమా కాదు.
మహి మహిమకు, నిర్మాతల ధైర్యానికి, వైఎస్ ను ఆవాహనచేసుకున్న మమ్ముట్టికి, గుండెలు పిండిన కె సంగీతానికి, మొత్తంగా సినిమాలో పనిచేసిన అందరికీ... అభినందనలు, కృతఙ్ఞతలు.

-ఒక వైఎస్ అభిమాని

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు