Advertisement

Advertisement


Home > Movies - Movie News

మంచు విష్ణు, మనోజ్ గొడవ.. మైక్ లాక్కున్న స్టాఫ్

మంచు విష్ణు, మనోజ్ గొడవ.. మైక్ లాక్కున్న స్టాఫ్

లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మీడియా ముందుకొచ్చాడు. ఓ టీవీ షో నిర్వహించబోతున్న ఈ హీరో, దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు. మైక్ అందుకున్న మీడియా ప్రతినిధి గతంలో మంచు విష్ణుతో జరిగిన గొడవపై ప్రశ్నించబోయాడు. అంతే, ఒక్కసారిగా వెనక నుంచి స్టాఫ్ దూసుకొచ్చాడు. జర్నలిస్ట్ చేతిలోంచి మైక్ లాక్కున్నాడు.

అప్పటికీ తను వివాదం గురించి ప్రశ్నించడం లేదని, ప్రశ్న పూర్తయ్యేవరకు ఆగాలని జర్నలిస్ట్ కోరాడు. కానీ సదరు పీఆర్వో మాత్రం అస్సలు తగ్గలేదు. నిర్దాక్షిణ్యంగా మైక్ లాక్కున్నాడు. మంచు విష్ణుతో జరిగిన గొడవపై మంచు మనోజ్ కు స్పందించాలని ఉన్నప్పటికీ, స్టాఫ్ కు మాత్రం ఇష్టం లేనట్టుందని, మనోజ్ కంటే ముందు వీళ్లే ఎక్కువ ఫీల్ అయ్యారంటూ మీడియా జనాలు గుసగుసలాడుకొని తమలో తాము నవ్వుకున్నారు.

మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య అభిప్రాయబేధాలున్న సంగతి తెలిసిందే. ఒక దశలో మంచు మనోజ్ కు చెందిన మనుషులపై మంచు విష్ణు దాడికి దిగాడు. ఆ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు కూడా. అయితే తండ్రి మోహన్ బాబు చొరవతో వెంటనే ఆ వీడియోను తొలిగించాడు.

ఆ తర్వాత ఇదే విషయంపై మంచు విష్ణును ప్రశ్నించింది మీడియా. దాన్ని అతడు లైట్ గా తీసిపారేశాడు. దాదాపు అలాంటి స్పందననే ఈరోజు మంచు మనోజ్ కూడా ఇచ్చాడు. ఆ గొడవపై తను స్పందించలేనని, వాళ్లనే అడగాలంటూ సున్నితంగా తప్పించుకున్నాడు. మధ్యలో స్టాఫ్ మాత్రం అత్యుత్సాహం చూపించారు.

అయితే మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవ మాత్రం చాలా పెద్దదనే టాక్ నడుస్తోంది. ఒక దశలో ఇది ఆస్తి పంపకాల వరకు వెళ్లిందనేది ఇంటర్నల్ టాక్. ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, మోహన్ బాబు సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ లో కనిపించడం, మీడియా కనిపించగానే చిర్రుబుర్రులాడడం చూశాం.

సో.. ఇది వాళ్ల కుటుంబ వ్యవహారం అయినప్పటికీ మంచు మనోజ్ పెట్టిన వీడియో, ఆ తర్వాత జరిగిన ఘటనల కారణంగా మీడియా ఎటెన్షన్ కూడా పడింది. కాబట్టి కచ్చితంగా మీడియా నుంచి ప్రశ్నలొస్తాయి, ఇష్టం లేకపోతే 'నో కామెంట్' అని చెప్పి ఊరుకోవచ్చు. ఇలా మైక్ లాక్కోవడం మాత్రం పద్ధతి కాదని అంటున్నారు మీడియా జనం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?