మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' అధ్యక్ష పదవి ఆశిస్తున్న మంచు విష్ణు, ఏ మహూర్తాన టీవీ9 రజనీకాంత్ ఇంటర్వ్యూకి వెళ్లారో కానీ 'తంగుతూరి వీరేహం ప్రకాహం పంతులుగారు' అనే ఆణిముత్యాన్ని వదిలారు. అది వైరల్ గా మారి చివరకు విష్ణు టాలెంట్ ఏంటో బయటపెట్టింది. అందులోనూ ప్రకాష్ రాజ్ కి ఉన్న నాలెడ్జ్ శూన్యం.. శూన్యం.. అంటూ విష్ణు ఇలా తన ''తెలుగు'' మొత్తం బయటపెట్టే సరికి అదో పెద్ద రచ్చగా మారింది.
తాజాగా నాగబాబు లోకల్-నాన్ లోకల్ అనే విషయంపై స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ ని తెలుగోడంటారని, విష్ణుని తెలుగు నేర్చుకొమ్మంటారని చెప్పి దీన్ని మరోసారి టచ్ చేసి వదిలారు. ఇప్పటికే సోషల్ మీడియా మీమ్స్ తో విష్ణుపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. లోకల్-నాన్ లోకల్ అంటూ మొదలైన ఈ వ్యవహారం.. చివరకు తెలుగు-టెల్గు అనే దగ్గరకు వచ్చి చేరింది.
ఏపీలో పుడితే లోకలా.. తెలుగు మాట్లాడితే లోకలా..
తెలంగాణలో ఉంటూ, తెలుగు సినీ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ ని ఎప్పుడు బయటపెట్టారో అప్పుడే మోరల్ గా సదరు ఫీలింగ్ ని బయటకు తెచ్చిన ప్యానల్ ఓడినట్టు. అయితే చివరిగా ఓట్లు తెచ్చుకున్నవారే విజేతలు కాబట్టి.. సినిమావాళ్ల ఫీలింగ్ ల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
లోకల్ అని చెప్పుకుంటున్న మీరు తెలుగే సరిగా మాట్లాడలేరు కదా అనేది నాగబాబు ప్రశ్న. తెలుగులో పరీక్ష పెడితే ప్రకాష్ రాజ్ కి మంచి మార్కులొస్తాయని, విష్ణు పాస్ కాలేరని ఎద్దేవా చేశారు. మంచు విష్ణు అమ్మా నాన్నలు మాత్రమే తెలుగు వాళ్లని, అసలు విష్ణు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారని ప్రశ్నించారు నాగబాబు.
మొత్తమ్మీద మంచు విష్ణు అనవసరంగా తన తెలుగు పాండిత్యాన్ని బయటపెట్టి లోకల్-నాన్ లోకల్ ఫైట్ కి మాంచి మసాలా అందించాడు. కృష్ణ, బాలకృష్ణ, కృష్ణంరాజు.. ఇలా అందరినీ కలసి ఫొటోలు మీడియాకి రిలీజ్ చేసి సరిపెట్టుకుంటే బాగుండేది.. ఛాన్స్ దొరికింది కదా అని పిలిచిన టీవీ ఛానెల్ కల్లా వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇస్తే నెగెటివ్ పబ్లిసిటీ కోరి తెచ్చుకున్నట్టే. విష్ణు విషయంలో ఇది మరోసారి రుజువైంది.
అనవసరంగా ఇంటర్వ్యూలిచ్చి ట్రోలింగ్ ఎదుర్కొంటున్న విష్ణు.. ఇప్పుడు తెలుగు వారు 'మా' అధ్యక్షుడు కావాలా, తెలుగు తెలిసినవారు 'మా' అధ్యక్షుడు కావాలా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నారు. నాగబాబు తన సెటైర్లతో ఈ మంటని ఇంకాస్త ఎగదోస్తున్నారు.