కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి నగదు లాక్కున్నాడని ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓపై ఓ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2018 లో గాంధీబజార్ కాఫీడేకు వెళ్లిన సమయంలో నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓనని చెప్పిన ఆ వ్యక్తి.. ఆ సినీ నటిని కంపెనీ ప్రచార రాయభారిగా నియమించుకున్నాడు.
2019 జనవరి 15న గోవాకు తీసుకెళ్లి ఫొటోషూట్ చేశాడు. కంపెనీలో ఆర్థిక సమస్యలంటూ రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. గత ఏడాది జూన్ 22న నటి ఇంట్లోనే తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు.
మరుసటి రోజు నటి పుట్టినరోజు కావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం నటికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు.
జూన్ 24న వీడియోను ఆమెకు చూపించి డబ్బు ఇవ్వాలని, లేకపోతే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ నటి రూ.11 లక్షలు సమర్పించుకుంది. అనంతరం మళ్లీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి రూ.9 లక్షలు లాగాడు. మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మోహిత్, అతడి తండ్రి మహదేవ్, తల్లి నాగవేణి, రాహుల్ అనే వారిపై కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు.