జరిగిన దాంట్లో తప్పెవరిదీ.. అనే శూలశోధన కాదు ఇది. ఎంతో చతురతను ప్రదర్శించే గరికిపాటి ఆ ఫొటోల వ్యవహారంపై కూడా.. అదే వ్యంగాన్ని కాస్త ప్రదర్శించి ఉంటే పోయేది! ఫొటోలు ఆపాకా ప్రవచనం సాగించుకుందామంటూ.. మధ్యలో కాసేపు ఆపేసి వేచి చూసి ఉంటే, వ్యవహరం ఇంత వరకూ వచ్చేది కాదు. ఎన్నో సరదా సంభాషణలు చెప్పే ఆయన ట్రాక్ రికార్డులో అదీ ఒక హాస్యంగా నిలిచిపోయేది. సరే జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఎన్నైనా చెప్పొచ్చు.
ఆ సంగతలా ఉంటే… గరికిపాటిపై మెగామూకదాడి కొనసాగుతూ ఉంది. మెగా సినిమా వేదిక నుంచి ఆయన సినిమాకు పని చేసిన వారు, ఆయన సన్నిహితులైన గేయ రచయిత, దర్శకుడు, నిర్మాత వీళ్ల వచనాలే కాదు, అంతకు మించి యూట్యూబ్, ఫేస్ బుక్ లలో పోస్టు మార్టాలు కొనసాగుతూ ఉన్నాయి ఆ వ్యవహారంపై! తమ వయసు, స్థాయి గరికిపాటికి ప్రవచనాలు చెప్పేంతది కాకపోయినా.. లెక్కలేనంత మంది ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు!
ఈ స్పందనల్లో ఎలాంటి నిజాయితీ లేదు. ఉన్నదల్లా దురాభిమానమే. గరికిపాటి చేసింది ముమ్మాటికీ తప్పంటూ ఒకటికి వంద సార్లు, వంద రకాల లాజిక్కులతో వీరు విరుచుకుపడుతూ ఉన్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అటు యాంకరూ, ఇటు విశ్లేషించే వ్యక్తి.. సామూహికంగా గరికిపాటిపై విరుచుకుపడుతున్నారు. వీళ్లేదో దిగొచ్చినట్టుగా, వ్యక్తిగత ప్రవర్తన గురించి హద్దుల్లేని సూక్తులు వీరు చెబుతూ ఉన్నారు.
ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉంటాయి.. అన్నట్టుగా వీళ్ల నీతుల ప్రవచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం వాదన తరహాలో కూడా ఉండటం ఇవి. ఏకగ్రీవంగా గరికిపాటి చేసింది తప్పు అని చెప్పడానికి మరీ ఇంత ప్రయాస అక్కర్లేదు! వన్ సైడెడ్ గా విరుచుకుపడటం ఏమిటో మరి!
వీరి అతి ఎంత వరకూ వెళ్తోందంటే.. ఇవన్నీ చూశాకా.. గరికిపాటి చేసింది నిజంగా అంత పెద్ద తప్పా! అనే సందేహం తలెత్తుతోంది. ఆయన తొందరపడ్డాడు అని అనుకున్న వాళ్లు కూడా.. ఇవన్నీ చూశాకా, విన్నాకా.. మరీ ఇంత అతి అవసరమా! అనుకోవాల్సి వస్తోంది. ఈ మూకదాడి వల్ల గరికిపాటిది పొరపాటు అనుకుంటే, వీరిది తప్పు అవుతోంది! ఈ టాపిక్ గురించి చిరంజీవిని పొగుడుతూ, గరికిపాటిని తిడితే.. బోలెడన్ని వ్యూస్!
చిరంజీవి వయసుకు ఆయన 20 యేళ్ల హీరోయిన్లతో చిందులు వేయడం ఆయన డెడికేషన్ అట, ఆయన గొప్పదనానికి ఇది నిదర్శనమట. ఇలాంటి చిరంజీవిని గరికిపాటి అవమానించారట! ఈ వాదనలు వింటే.. వాంతులు మొదలయ్యేట్టుగా ఉన్నాయి జనాలకు. మరి మెగామూకదాడి ఇంకా ఏ స్థాయిలో సాగుతుందో, ఇన్నాళ్లు సాగుతుందో!