రీమేక్ చేస్తున్నప్పుడు పెద్దగా క్రియేటివ్ ఇబ్బందులు ఉండవు. ఆల్రెడీ కళ్లముందు సినిమా ఉంటుంది కాబట్టి, నేటివిటీకి తగ్గట్టు చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ సినిమా పూర్తిచేయడమే. హీరో నుంచి డైరక్టర్ వరకు అందరికీ రీమేక్ చేయడం ఈజీ. ఎందుకంటే, రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. అలాంటి రీమేక్ సబ్జెక్ట్ పై కూడా ఏడాదిన్నర వర్క్ చేశామంటున్నాడు దర్శకుడు మెహర్ రమేష్.
చిరంజీవి హీరోగా భోళాశంకర్ సినిమా స్టార్ట్ చేశాడు మెహర్. ఈరోజు ఈ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇదొక రీమేక్ సబ్జెక్ట్. అయినప్పటికీ ఈ స్క్రిప్ట్ పై తను ఏడాదిన్నర కష్టపడినట్టు తెలిపాడు. తన రైటింగ్ డిపార్ట్ మెంట్ తో కలిసి కూర్చొని, చిరంజీవి ఇమేజ్, ఆయన అభిమానుల అంచనాలకు తగ్గట్టు ప్రతి సన్నివేశాన్ని మార్చానంటున్నాడు.
భోళాశంకర్ రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం సీనియర్ రచయిత సత్యానంద్ ఆధ్వర్యంలో చేశాడట మెహర్. ప్రతి సన్నివేశాన్ని ముందుగా సత్యానంద్ కు చెప్పి, అక్కడ ఫిల్టర్ అయిన తర్వాతే చిరంజీవికి వినిపించాడట. అలా భోళాశంకర్ సినిమా ఓ కొత్త సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది తప్ప, రీమేక్ అనిపించదని అంటున్నాడు.
ఈరోజు ప్రారంభమైన ఈ సినిమాకు రాఘవేంద్రరావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. చిరంజీవిపై తీసిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలో 90శాతం షూటింగ్ ను సెట్స్ లోనే పూర్తిచేయబోతున్నారు. దీనికి సంబంధించి చాలా సెట్లు నిర్మిస్తున్నారు. వాటిలో ఒక సెట్ లో ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
తమన్న హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటించనుంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.