cloudfront

Advertisement


Home > Movies - Movie News

మోహన్‌బాబు గట్స్ ను మెచ్చుకోవాల్సిందే!

మోహన్‌బాబు గట్స్ ను మెచ్చుకోవాల్సిందే!

సమకాలీన అంశాలపై సెటైర్లు వేయగల సినీ మొనగాళ్ల సంఖ్య చాలా చాలా తక్కువ. ప్రత్యేకించి కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాకా, తెలంగాణలో కేసీఆర్ సర్కారు, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాకా.. ప్రభుత్వాలపై, ప్రభుత్వాల దాష్టీకాలపై స్పందించే దమ్మున్న మూవీ మేకర్ ఎవరూ లేకుండా పోయారు. అధికార పార్టీల భజనలు చేయడం తప్ప ఇంకేం చేయలేం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సినిమా వాళ్లు.

ఆఫ్ లైన్లోనూ అదే పనే, సినిమాల్లోనూ అదే పనే. ఇప్పటికే టీవీ చానళ్లు అన్నీ కట్టేసుకుని కూర్చున్నాయి. ప్రభుత్వాల వైఫల్యాలను, డొల్లతనాలను ప్రశ్నించడం మానేసి.. ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవడమే మీడియా పని అన్నట్టుగా మారిపోయింది. ప్రజలను మోసం చేస్తూ... తమ ప్రభుత్వాలను కాపాడుకొంటూ ఉన్నాయి... మీడియా వర్గాలు.

ఇలాంటి నేపథ్యంలో.. ఏ ప్రభుత్వం మీదనైతేనేమీ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సినిమాలో గట్టి సెటైర్లే వేశాడు. అల్లాటప్పాగా కాదు, స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మీదే మోహన్ బాబు సెటైర్లు సాగడం విశేషం. ఈ హీరో తాజా సినిమా ‘గాయత్రి’లో ఉన్న పవర్ ఫుల్ డైలాగులు ఆసక్తిదాయకంగా మారాయి.

‘బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివానని ఒకడు.. బీఎస్సీలో హెచ్‌ఈసీ చదివానని ఇంకొకడు.. నేనిచ్చిన పెన్షన్‌ తీసుకుంటూ.. నేనేసిన రోడ్ల మీద నడుస్తూ.. నాకే ఓటు ఎందుకు వేయరని అడిగేవాడు ఇంకొకడు.. భారతదేశ సార్వభౌమధికారం అని పలుకడం చేతకాక.. సార్వబౌబౌ అనేవాడు ఇంకోడు.. మీరందరూ మంత్రులూ.. మీకు మేం ఓట్లేసి గెలిపించాం..’ అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగులకు సినిమా హాళ్లు దద్దరిల్లిపోతూ ఉన్నాయి.

డైరెక్టుగా చంద్రబాబును, లోకేష్ బాబును, ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు ఈ డైలాగుతో అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఈ డైలాగుతో మోహన్ బాబుకు రాజకీయ ఉద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. ఆయన వైకాపాలో చేరతాడని అంటున్నారు. ఆ సంగతులన్నీ ఎలా ఉన్నా.. రాజకీయ నేత డొల్ల మాటలపై ఘాటుగా స్పందించిన మోహన్ బాబు గట్స్ ను మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.