ఆ సినిమా ఆగిపోయిందని కొందరంటారు, లేదు ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉందని మరికొందరు అంటారు. కొన్ని రోజులు ఆ ప్రాజెక్టు ఆగిపోతుంది, మరికొన్ని రోజులు యాక్టివ్ అవుతుంది. అదే రవితేజ-త్రినాథరావు నక్కిన సినిమా. మొన్నటివరకు ఆగిపోయిందనుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. సినిమా ఆగిపోలేదంట.
తాజాగా ఈ సినిమా స్టేటస్ పై అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఎన్నో సిట్టింగ్స్ తర్వాత ఈ సినిమా కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. టోటల్ స్క్రీన్ ప్లే రెడీ అయిందని, వీలైతే అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్ పైకి వచ్చేస్తామని అంటున్నాడు.
ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఈ సినిమా ఆగిపోయినట్టు.. ఇదే కథతో ప్రసన్నకుమార్-త్రినాథరావు వెళ్లి, వరుణ్ తేజ్ కు కథ వినిపించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఇదే కథతో రవితేజ హీరోగా సినిమా పట్టాలపైకి వస్తుందంటున్నాడు నక్కిన.
ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న పెళ్లిసందD సినిమాలో ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.