Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్నో భావోద్వేగాల‌కు వేదిక 'ది టెర్మిన‌ల్'

ఎన్నో భావోద్వేగాల‌కు వేదిక 'ది టెర్మిన‌ల్'

ఈ ప్ర‌పంచం ఇంత చెడ్డ‌దా అనిపిస్తుంది ఒక్కోసారి, కాదు ప్ర‌పంచంలో అపార‌మైన‌ మాన‌వ‌త్వం బతికే ఉంద‌నే ఉద్వేగం ఒక్కోసారి మ‌నసును పుల‌కింప‌జేస్తూ ఉంటుంది. నిజ‌జీవితంలో అలాంటి అనుభ‌వాలు ఎన్ని సార్లు క‌లుగుతాయో కానీ, కొన్ని సినిమాలు భావోద్వేగాలు అనే విశ్వ‌భాష‌లో రూపొంది ఉంటాయి. సంస్కృతి, భాష వంటి వాటితో సంబంధం లేకుండా ఆ సినిమాలు గుండెకు హ‌త్తుకుంటాయి.

అలా హ‌త్తుకుపోయే సినిమా 'ది టెర్మిన‌ల్'. ఒక విమానాశ్ర‌యం టెర్మినల్ లో క‌నిపించే విభిన్న‌మైన వ్య‌క్తుల ప‌రిస్థితుల గురించి, వారి మ‌న‌స్త‌త్వాల గురించి ఆవిష్కృత‌మైన సినిమా ఇది. ఇలాంటి సబ్జెక్ట్ స్టీవెన్ స్పిల్ బ‌ర్గ్ వంటి ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డింది. ఆయ‌న చెల‌రేగిపోయాడు. ఒక నిపుణుడైన పెయింట‌ర్ అంద‌మైన పెయింటింగ్ ను మ‌న ఎదురుగా గీస్తుంటే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో.. 'ది టెర్మిన‌ల్' సినిమాను చూస్తున్నంత సేపూ అలాంటి అనుభ‌వ‌మే క‌లుగుతుంది. ఒక్కోసారి గుండెను తాకే బాధ‌, మ‌రోసారి మ‌నుసును పుల‌క‌రింప‌జేసే సంతోషం.. ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు తెర‌పై పండిన అద్భుత సినిమా 'ది టెర్మిన‌ల్'

'క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్' సినిమా త‌ర్వాత స్పిల్ బ‌ర్గ్ నుంచి వ‌చ్చిన మాస్ట‌ర్ పీస్ 'ది టెర్మిన‌ల్'. ఒక క్రిమిన‌ల్ మైండ్ సెట్ ఉన్న యువ‌కుడు తెలివిగా ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డుతూ, దమ్ముంటే త‌న‌ను ప‌ట్టుకోమ‌న్న‌ట్టుగా వివిధ దేశాల వారికి స‌వాల్ విసురుతూ సాగే క‌థ క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. అందుకు పూర్తి విరుద్ధ‌మైన ఒక మ‌ర్యాద రామ‌న్న క‌థ 'ది టెర్మిన‌ల్'. ఈ రెండు సినిమాల‌కూ వాస్త‌వ ఘ‌ట‌న‌లే ఆధారం.

చెక్ ల‌లో మోసాలు చేయ‌డంలో పండిపోయిన ఒక యువ‌కుడి క‌థ ఆధారంగా క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ రూపొంద‌గా, అనుకోని ప‌రిస్థితుల్లో పారిస్ లోని చార్లెస్ డిగాల్ ఎయిర్ పోర్టులో ఎనిమిది సంవ‌త్స‌రాల పాటు నిలిచిపోయిన ఒక వ్య‌క్తి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పూర్తి క‌ల్పిత క‌థ‌తో 'ది టెర్మిన‌ల్' రూపొందింది.

ఈ సినిమా మొద‌లైన మొద‌టి ఇర‌వై నిమిషాలూ కాస్త భారంగానే గ‌డుస్తాయి. బహుశా సినిమాకు సంబంధించి ఏదైనా నెగిటివ్ గా చెప్ప‌ద‌గిన అంశం ఉందంటే అదొక్క‌టే. ఒక్కో పాత్రా ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం అయ్యే ప్ర‌క్రియ కాస్త నెమ్మ‌దిగా సాగుతుంది. బ‌హుశా ఐఎండీబీలో ఈ సినిమాకు ఎనిమిది పాయింట్ల క‌న్నా కాస్త త‌క్కువ రేటింగ్ ఉందంటే.. ఆరంభం కాస్త మంద‌కొడిగా ఉండ‌ట‌మే కార‌ణం కావొచ్చు! ఒక్క‌సారి అస‌లు క‌థ ప్రారంభం అయ్యాకా.. సినిమా ప్రేక్ష‌కుడి దృష్టిలో క్ర‌మ‌క్ర‌మంగా త‌న స్థాయిని పెంచుకుంటూ పోతుంది.

అనూహ్యంగా న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్ పోర్టులో కొన్ని నెల‌ల పాటు బంధీ అయ్యే ఒక వ్య‌క్తి క‌థ ఇది. బంధీ అంటే అత‌డు న్యూయార్క్ లో అగుడుపెట్ట‌లేడు, అలాగ‌ని త‌న సొంత దేశానికి వెనుదిరిగిపోలేడు. అత‌డి పేరు విక్ట‌ర్ నొవోర్స్కీ. క్ర‌కోజియా అనే ఒక క‌ల్పిత దేశం నుంచి అతడు న్యూయార్క్ వ‌చ్చిన‌ట్టుగా చూపించారు. క్ర‌కోజియా నుంచి అత‌డు న్యూయార్క్ చేరుకునే స‌రికి అత‌డి స్వ‌దేశంలో మిల‌ట‌రీ తిరుగుబాటు చెల‌రేగి ఉంటుంది.

ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి సైన్యం-మిలిటెంట్లు అధికారాన్ని హ‌స్త‌గతం చేసుకుని ఉంటారు. ఇత‌డు జేఎఫ్కే లో ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి అమెరికా క్ర‌కోజియా ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఆ దేశానికి త‌న గుర్తింపును ర‌ద్దు చేసి ఉంటుంది. అక్క‌డి పాస్ పోర్టులు అమెరిక‌న్ డాటాబేస్ లో చెల్ల‌వు. పాస్ పోర్టే చెల్ల‌ని వ్య‌క్తికి వీసా ఆన్ అరైవ‌ల్ ల‌భించ‌దు. దీంతో విక్ట‌ర్ న్యూయార్క్ ఎయిర్ పోర్టులో దిగినా, ఎయిర్ పోర్టు గేటు దాటి న‌గ‌రంలోకి అడుగుపెట్ట‌లేడు.

తూర్పు ఆసియా దేశం నుంచి వ‌చ్చిన విక్ట‌ర్ కు ఇంగ్లిష్ రాదు. టీవీల్లో త‌న దేశ ప‌రిణామాల‌ను గ‌మ‌నించి విక్ట‌ర్ నివ్వెర‌పోతాడు. త‌న‌కు న్యూయార్క్ లో కాస్త ప‌ని ఉంద‌ని, ఆ ప‌ని చూసుకుని త‌ను త‌న దేశానికి వెళ్లిపోతానంటూ అధికారుల‌ను అత‌డు ప్రాధేయ‌ప‌డ‌తాడు. అతడి విన్న‌పాల ప‌ట్ల స‌గ‌టు అమెరిక‌న్ లా రియాక్ట్ అయ్యి, వారు సున్నితంగా తిర‌స్క‌రిస్తారు.

విక్ట‌ర్ త‌ల‌నొప్పిని వ‌దిలించుకోవ‌డానికి విమానాశ్ర‌య ప్ర‌ధాన అధికారి, త‌న క‌న్నింగ్ మైండ్ సెట్ తో అత‌డిని పోలీసుల‌కు ప‌ట్టించేసి, ఏ రెఫ్యూజీ క్యాంప్ కో పంపించేయాల‌ని ప్లాన్ వేస్తాడు. విమానాశ్ర‌య ప్ర‌ధాన ద్వారానికి సెక్యూరిటీ మార్చే గ్యాప్ లో న్యూయార్క్ లోప‌ల‌కు పారిపోవాల‌ని స‌ల‌హా ఇస్తాడు. అలా పారిపోతుండ‌గా సెక్యూరిటీ వ‌చ్చి ప‌ట్టుకుంటే..అక్ర‌మ వ‌ల‌స‌దారుగా విక్ట‌ర్ ను న్యూయార్క్ పోలీసులు చూసుకుంటారు. అంత‌టితో త‌న త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంద‌నేది విమానాశ్ర‌యం ప్ర‌ధానాధికారి ప్లాన్. అయితే అక్క‌డ సీసీ కెమెరాలు ఉంటాయ‌నే విష‌యాన్ని గ్ర‌హించిన విక్ట‌ర్ గేట్ వ‌ర‌కూ వెళ్లి.. వెన‌క్కు వ‌చ్చి క‌న్నింగ్ ప్లానేసిన అధికారికి షాక్ ఇస్తాడు.

అక్క‌డ నుంచి విమానాశ్ర‌యంలో ప‌ని చేసే ఒక్కొక్క‌రి చూపూ అత‌డి మీద ప‌డుతూ ఉంటుంది. రేయీప‌గ‌లూ అక్క‌డే. చేతిలో ఉన్న ఫుడ్ కూప‌న్లు పోతాయి. ఆక‌లి.. ఆ విమానాశ్ర‌యానికి వ‌చ్చే ప్ర‌యాణికులు ట్రాలీలను వాడి ఎక్క‌డంటే అక్క‌డ వ‌దిలేసి వెళ్లిపోతుంటారు.

ఆ ట్రాలీల‌ను స‌రిగా స్టాండ్ లోకి చేరిస్తే కాయిన్స్ ప‌డ‌తాయి. ఆ విష‌యం తెలుసుకుని.. ట్రాలీల‌న్నింటినీ ఒక చోట‌కు చేర్చి వ‌చ్చే కాయిన్స్ తో బ‌ర్గ‌ర్ కొని ఆక‌లి తీర్చుకుంటాడు విక్ట‌ర్. దీన్నంత‌టినీ గ‌మ‌నించిన అధికారి.. విమానాశ్ర‌యంలో అలా కాయిన్స్ సంపాదించుకునే అవ‌కాశాన్నే ర‌ద్దు చేస్తాడు!

విక్ట‌ర్ బ‌హుశా సీఐఏ ఏజెంట్ అయి ఉండ‌చ్చ‌ని, విమానాశ్ర‌యంలో స్టాఫ్ చేసే అనుచిత‌మైన ప‌నుల‌ను క‌నిపెట్టేందుకు అత‌డు రంగంలోకి దిగాడ‌ని అనుమానిస్తాడు అక్క‌డ ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఒక భార‌తీయుడు. ఆ విష‌యాన్నే త‌న ఫ్రెండ్స్ అయిన ఒక న‌ల్ల‌జాతి యువ‌కుడితో, మ‌రో అమెరిక‌న్ యువ‌కుడితో చెబుతాడు. అయితే వాళ్లు ఆ సందేహాన్ని కొట్టిపారేస్తారు.

ప్ర‌తి రోజూ ఫామ్ ఫిల్ చేయ‌డం, చెక్ ఇన్ క్యూలో నిల్చోవ‌డం, రిజెక్ట్ ముద్ర ప‌డ‌టంతో వెనుదిర‌గ‌డం, ఇదే విక్ట‌ర్ దిన చ‌ర్య అవుతుంది. అక్క‌డ ఒక న‌ల్ల‌జాతి అమ్మాయి ఉంటుంది. ఒక‌సారి అమె అడుగుతుంది.. ఎందుకు ప్ర‌తిరోజూ ఈ ప‌ని? అని, 'నీ చేతిలో రెండు స్టాంప్ లున్నాయి.. ఒక‌టి న్యూయార్క్ న‌గ‌రంలోకి ప్ర‌వేశానికి అనుమ‌తి సీల్ వేసేది, రెండోది రిజెక్ట్ చేసే సీల్..నేను ఇచ్చే ఫామ్ లో దేని ముద్ర అయినా ప‌డొచ్చు. అంటే ఫిఫ్టీ-ఫిప్టీ ఛాన్స్ స్ ఉన్న‌ట్టే క‌దా.. ' అని విక్ట‌ర్ స‌మాధానాన్ని విని ముచ్చ‌ట ప‌డే ఆమె మ‌రోసారి రిజెక్ట్ సీల్ కొట్టించి పంపుతుంది!

ఆ అమెరిక‌న్ న‌ల్ల‌మ్మాయికి లైన్ వేస్తూ ఉంటాడు విమానాశ్రయంలోనే ప‌ని చేసే ఒక క్యాంటీన్ ట్రాలీ డ్రైవ‌ర్. ఆ కుర్రాడికి ఆ అమ్మాయితో మాట్లాడేంత ధైర్యం ఉండ‌దు. ఆమె గురించి తెలుసుకోవాల‌ని ఉంటుంది. దీని కోసం విక్ట‌ర్ ను ఉప‌యోగించుకుంటాడు. విక్ట‌ర్ కు ప్ర‌తి రోజూ త‌ను ప‌నిచేసే క్యాంటీన్ నుంచి భోజ‌నం ఏర్పాట్లు చేస్తాడు ఆ కుర్రాడు. అందుకు ప్ర‌తిగా ఆ న‌ల్ల‌మ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ల‌వ్ మీద ఇంట్ర‌స్ట్ ఉందా, అనే విష‌యాల‌ను క‌నుక్కోవ‌డంతో పాటు.. విక్ట‌ర్ ద్వారా ఆమెకు త‌న ప్రేమ విష‌యాన్ని కూడా ఆమెకు తెలిసే ఏర్పాట్లు చేసుకుంటాడు ఆ కుర్రాడు.

చెన్నైలో ఒక హ‌త్య కేసులో నిందితుడు అయిన ఒక ఇండియ‌న్ ఎలాగో అమెరికాకు పారిపోయి ఆ ఎయిర్ పోర్టులోనే ప‌ని చేస్తూ ఉంటాడు. జీవితంలో ఏ వినోదం లేక‌.. ఎయిర్ పోర్టులో త‌ను క్లీన్ చేయ‌గా, త‌డి అయిన ఫ్లోర్ మీద జ‌నాలు జారిప‌డుతుంటే దాన్నే వినోదంగా తీసుకుంటుంటాడు. ఇత‌డే విక్ట‌ర్ ను సీఐఏ ఏజెంట్ అని అనుమానిస్తాడు. త‌ర్వాత అలాంటిదేం లేద‌ని తెలుసుకుని ఫ్రెండ్ అవుతాడు. 'వెట్ ఫ్లోర్' అంటూ బోర్డులు పెట్టినా అమెరిక‌న్లు వాటిని చ‌ద‌వ‌ర‌ని.. ఆ ఇండియ‌న్ వ్యంగ్యంగా స్పందించే సీన్ హ్యూమ‌ర‌స్ గా సాగుతుంది.

అలా వెట్ ఫ్లోర్ పై జారిపడే ఒక ఎయిర్ హోస్టెస్ ను అల‌ర్ట్ చేస్తూ ఆమెకు ఫ్రెండ్ అవుతాడు విక్ట‌ర్. అత‌డు ఎవ‌రో వ్యాపార‌వేత్త అని, అందుకే విమానాశ్ర‌యంలో త‌న‌కు త‌ర‌చూ క‌నిపిస్తాడ‌ని ఆమె అనుకుంటుంది. ఆమె ఒక వివాహితుడిని ప్రేమిస్తూ ఉంటుంది. త‌న‌ను ప్రేమిస్తున్న‌ట్టుగా చెప్పే ఆ వివాహితుడు త‌న‌ను వాడుకుంటున్నాడో, లేక నిజంగానే ప్రేమిస్తున్నాడో అర్థం కాక స‌త‌మ‌త‌మ‌య్యే ఆమెకు.. విక్ట‌ర్ రిలేష‌న్షిప్ కు సంబంధించిన గైడ్ గా మారతాడు.

అక్క‌డ ఉన్న బోలెడంత షాపింగ్ ఏరియాలో ఉద్యోగం కోసం విక్ట‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తాడు. ప‌ర్మినెంట్ అడ్ర‌స్, ఫోన్ నంబ‌ర్ అవ‌స‌రం అని వాళ్లు చెబితే..విమానాశ్ర‌యంలోని ఆ షాప్ కు ఎదురుగా ఉన్న కాయిన్ బాక్స్ నంబ‌ర్ ఇస్తాడు! ఆ నంబ‌ర్ కే ఫోన్ చేసి.. ఉద్యోగం కోసం పెట్టుకున్న అప్లికేషన్  రిజెక్ట్ అయినట్టుగా ఒక షాప్ య‌జ‌మాని చెబుతాడు.

ఒక రాత్రి ఉండ‌బ‌ట్ట‌లేక ఎవ‌రో స‌గం చేసి వెళ్లిన పెయింటింగ్ ప‌నిని విక్ట‌ర్ పూర్తి చేస్తాడు. ఉద‌యాన్ని వ‌చ్చిన పెయింట‌ర్లు విక్ట‌ర్ ప‌ని తీరుకు ఆశ్చ‌ర్య‌పోయి అత‌డిని త‌మ‌లో చేర్చుకుంటారు. విక్ట‌ర్ తో తాము ధీటుగా ప‌ని చేయ‌లేక అత‌డేం చేసినా వారు మారు మాట్లాడ‌కుండా ఉంటారు. అలా విమానాశ్ర‌యంలోనే అత‌డికి ఉపాధి దొరుకుతుంది!

రోజులు అలా గ‌డుస్తూ ఉండ‌గా.. విమానాశ్ర‌యంలోనే విక్ట‌ర్ ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు, ద్వేషించే వాళ్లు.. అంతా త‌యార‌వుతారు. అంద‌రిలోనూ అత‌డి దిన‌చ‌ర్య‌పై ఒక క్యూరియాసిటీ...విమానాశ్ర‌య ప్ర‌ధాన అధికారికి మాత్రం విక్ట‌ర్ ను ఎలా బ‌య‌ట‌కు పంపించాల‌నేది అంతుబ‌ట్ట‌నిదిగా మారుతుంది.

ఒక‌సారి అత‌డిని పిలిపించుకుని మాట్లాడ‌తాడు. ఒకే ఒక మాట చెప్ప‌మంటాడు..అలా చెబితే  త‌ను అత‌డిని న్యూయార్క్ న‌గ‌రంలోకి పంపిస్తానంటూ హామీ ఇస్తాడు. సొంత దేశం క్ర‌కోజియా అంటే భ‌యం అని, అదొక్క‌టీ చెబితే.. రెఫ్యూజీగా అమెరికాలో నివ‌సించే అవ‌కాశ‌మే వ‌స్తుంద‌ని ఆశ చూపిస్తాడు.

తన‌కు చీక‌టి గ‌ది అంటే భ‌య‌మ‌ని, దెయ్యాలంటే  భ‌య‌మ‌ని చెప్పే విక్ట‌ర్.. త‌న మాతృభూమి అంటే మాత్రం ఎలాంటి భ‌యం లేద‌ని చెప్పే సీన్ అద్భుత‌మైన రీతిలో పండుతుంది. త‌న దేశంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు బాగాలేనంత మాత్రాన.. ఆ దేశ‌మంటే భ‌య‌మ‌ని చెప్పి అమెరికాలో ఉండాల‌నే ఉద్దేశం త‌న‌కు లేద‌ని త‌న‌దైన అమాయ‌క‌త్వంతో విక్ట‌ర్ చెప్పిన‌ట్టుగా, ఆ సీన్ ను పండించిన టామ్ హాంక్స్ త‌నెందుకు ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ న‌టుల్లో ఒక‌డినో చాటుకున్నాడు.

ఒక తూర్పు ఆసియా దేశం నుంచినే మ‌రో వ్య‌క్తి ఎయిర్ పోర్టుకు వ‌స్తాడు. అత‌డి వెంట కొన్ని మందులుంటాయి. అత‌డు వేరే దేశానికి వెళ్తూ మార్గ‌మ‌ధ్యంలో జేఎఫ్కే లో దిగుతాడు. సెక్యూరిటీ చెక‌ప్ లో అత‌డి ద‌గ్గ‌ర అమెరికాలో నిషేధితం అయిన మందులున్నాయ‌ని అధికారులు గుర్తిస్తారు. అత‌డిని అదుపులోకి తీసుకుంటారు. అత‌డు మాట్లాడే భాష అర్థం కాక‌.. విమానాశ్ర‌యంలో తిరుగుతున్న విక్ట‌ర్ ను ట్రాన్స్ లేట‌ర్ గా ఉప‌యోగించుకుంటారు.

రూల్స్ త‌ప్ప‌కూడ‌ద‌నే విమానాశ్ర‌య ప్ర‌ధాన అధికారి ఆ మందులు  నిషేధం అని, వాటిని తీసుకెళ్ల‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేస్తాడు. ఆ విదేశీయుడు కాళ్లు ప‌ట్టుకుని బ‌తిమాలినా ఉప‌యోగం ఉండదు. విష‌యాన్ని అర్థం చేసుకున్న విక్ట‌ర్.. త‌ను మొద‌ట్లో అత‌డు చెప్పిన దాన్ని త‌ప్పుగా అనువ‌దించిన‌ట్టుగా, ఆ మందులు ఆ విదేశీయుడి తండ్రి కోసం కాద‌ని, అత‌డి పెంపుడు జంతువుకోస‌మ‌ని.. అబ‌ద్ధం ఆడ‌తాడు. విక్ట‌ర్ అబ‌ద్ధ‌మాడుతున్నాడ‌ని తెలిసి.. ఎయిర్ పోర్ట్ అధికారి అత‌డిపై మ‌రింత క‌క్ష పెంచుకుంటాడు. మాన‌వ‌తాదృక్ఫ‌థంతో అబ‌ద్ధ‌మాడినా త‌ప్పులేద‌ని విక్ట‌ర్ ఆ అబ‌ద్దం ద్వారా స‌ద‌రు విదేశీయుడు త‌న‌ వెంట ఆ మందులు తీసుకెళ్లడానికి అనుకూల‌మైన ప‌రిస్థితిని క‌ల్పిస్తాడు.

ఈ తీరుతో విక్ట‌ర్ పై విసిగెత్తిపోయిన అధికారి.. ఫైన‌ల్ వార్నింగ్ జారీ చేస్తాడు. విమానాశ్ర‌యంలో విక్ట‌ర్ స‌న్నిహితులు అంద‌రి గ‌త జీవితాల్లోనూ చేదు అనుభ‌వాలున్నాయి. ఇండియ‌న్ ఏమో చెన్నైలో ఒక వ్య‌క్తిని హ‌త్య చేసి అమెరికాలో ఇర‌వై యేళ్లుగా ఉంటున్నాడు. న‌ల్ల జాతి యువ‌కుడేమో డ్ర‌గ్స్ స్కాండల్ లో ప్ర‌మేయాన్ని క‌లిగి ఉన్నాడు. త‌ను చెప్పిన‌ట్టుగా  మ‌ర్యాద‌గా ఎయిర్ పోర్టును ఖాళీ చేసి తిరుగు విమానాన్ని ఎక్కి వెళ్లిపోక‌పోతే.. నీ స్నేహితులంద‌రినీ పోలీసులకు ప‌ట్టించేస్తా.. అని ఆ అధికారి బ్లాక్ మెయిలింగ్ కు దిగుతాడు.

త‌ను తిరిగి వెళ్లిపోవ‌డ‌మా, లేక త‌న‌కు మాన‌వ‌త్వంతో సాయంగా నిలిచిన వారిని జైలుకు వెళ్లేలా చేయ‌డ‌మే.. అనే ఛాయిస్ విక్ట‌ర్ ముందు మిగులుతుంది. ఇదే విష‌యం అత‌డి స్నేహితులంద‌రికీ అర్థం అవుతుంది. విక్ట‌ర్ కోసం వాళ్లంతా తెగిస్తారు. స్వ‌దేశానికి తిరిగి వెళ్లిపోవ‌డానికి రెడీ అయిన విక్ట‌ర్ ను ఆ ఆలోచ‌న వ‌ద్ద‌ని, న్యూయార్క్ వెళ్లి త‌న ప‌ని పూర్తి చేసుకోమ‌ని వారు ఒత్తిడి చేస్తారు.  అత‌డు ఎక్కాల్సిన విమానం టెర్మిన‌ల్ లోకి రాగా దానికి అడ్డుగా వెళ్తాడు భార‌తీయుడు.

సెక్యూరీటీలో కీల‌క అధికారులు.. ప్ర‌ధాన అధికారి ఆదేశాల‌ను ఉల్లంఘించి.. విక్ట‌ర్ న్యూయార్క్ లోకి వెళ్లేందుకు దారి ఇస్తారు. విమానాశ్ర‌యంలోని అంద‌రూ వెంట వ‌చ్చి విక్ట‌ర్ కు వెల్ విషెస్ ప‌లుకుతూ ఉండగా.. అత‌డు న్యూయార్క్ న‌గ‌రంలో అడుగుపెడ‌తాడు! విక్ట‌ర్ కు అలాంటి అవ‌కాశం ఇస్తే అంద‌రి అంతూ చూస్తాన‌న్న విమానాశ్ర‌య ప్ర‌ధాన అధికారి.. విక్ట‌ర్ సేఫ్ గా న్యూయార్క్ నుంచి వ‌చ్చాకా, అత‌డిని అంతే జాగ్ర‌త్త‌గా అత‌డి స్వ‌దేశం పంపించ‌మ‌ని సెక్యూరిటీ స్టాఫ్ ను ఆదేశించి వెళ్లిపోతాడు! ఆ క‌ఠినాత్ముడిని కూడా అలా కరిగించేశాడు  విక్ట‌ర్!

ఇంత‌కీ విక్ట‌ర్ న్యూయార్క్ ఎందుకు వ‌చ్చాడ‌నేది మ‌రింత భావోద్వేగ‌భ‌రితైమ‌న ట్విస్ట్. విక్ట‌ర్ తండ్రి ఒక సంగీత ప్రియుడు. 1958లో ఒక హంగేరియ‌న్ న్యూస్ పేప‌ర్ లో 57 మంది ప్ర‌ముఖ సంగీత వాయిద్య కారుల‌తో కూడిన ఒక ఫోటో ప్ర‌చురితం అయి ఉంటుంది.  ఆ బృందంలోని 56 మందితో విక్ట‌ర్ తండ్రి ఆటోగ్రాఫ్స్ తీసుకుని ఉంటాడు. చివ‌ర‌గా ఒక జాజ్ ప్లేయ‌ర్ ఆటోగ్రాఫ్ తీసుకునే త‌ప‌న‌తో ఉండ‌గా ఆయ‌న మ‌ర‌ణించి ఉంటాడు.

త‌న తండ్రి కోరిక‌ను తీర్చి ఆ జాజ్ ప్లేయ‌ర్ ఆటోగ్రాఫ్ తీసుకుని, అంద‌రి ఆటోగ్రాఫ్ పేప‌ర్ల‌తో పాటు ఆ జాజ్ ప్లేయర్ ఆటోగ్రాఫ్ ను క‌ల‌ప‌డానికి విక్ట‌ర్ న్యూయార్క్ వ‌చ్చి ఉంటాడు. మ‌ర‌ణించిన త‌న తండ్రి ఆస‌క్తి, ఆయ‌న చిర‌కాల కోరిక‌ను తీర్చ‌డానికి విక్ట‌ర్ ఎయిర్ పోర్టులో అన్ని క‌ష్టాల‌నూ ఓర్చి వేచి చూస్తాడు.

ఎయిర్ హోస్టెస్ ద్వారా స‌ద‌రు జాజ్ ప్లేయ‌ర్ ఎక్క‌డ ఉండాటో తెలుస్తుంది. ఒక క్ల‌బ్ లో మ్యూజిక్ షో చేస్తున్న అత‌డు త‌న తండ్రి కోరిక మేర‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వాల‌న్న విక్ట‌ర్ విన్న‌పాన్ని మ‌న్నించ‌డం, తిరిగి విక్ట‌ర్ క్యాబ్ ఎక్కి టెర్మిన‌ల్ కు రిట‌ర్న్ కావ‌డంతో సినిమా ముగుస్తుంది! సినిమా చూసిన కొన్ని రోజుల పాటు ఇందులోని పాత్ర‌ల మ‌ధ్య‌న పండిన అద్భుత భావోద్వేగాలు, సినిమా ఆసాంతం బీజీఎంగా ప్లే అయ్యే మ్యూజిక్ వెంటాడుతుంది. విక్ట‌ర్ గా టామ్ హాంక్స్ న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే!

-జీవ‌న్ రెడ్డి.బి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?