Advertisement


Home > Movies - Movie News
ఫెయిల్ అయినా సంతోషమే

నా పేరు సూర్య ఫెయిల్ అయిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు అల్లు అర్జున్. తన సినిమా సరిగ్గా ఆడడం లేదనే విషయాన్ని మనసులో ఒప్పుకున్న బన్నీ.. తనకు సినిమా ఫెయిల్ అయినా సంతోషమే అంటున్నాడు.

"నమ్మింది చేయాలనేది నా ఫిలాసఫీ. ఎవరో చెప్పింది విని సక్సెస్ అవ్వడం కంటే, మనం నమ్ముకున్న దాంట్లో ఫెయిల్ అయినా సంతోషంగా ఉంటుంది."

ఇలా తన మనసులో మాట బయటపెట్టాడు అల్లు అర్జున్. బిగినింగ్ లో వచ్చే ఫెయిల్యూర్స్ ని తొందరగా మరిచిపోయి.. గట్టిగా ప్రయత్నిస్తే ఎవరైనా సక్సెస్ అవుతారంటున్న బన్నీ.. కేవలం క్యారెక్టర్ చూసి మాత్రమే సినిమా ఒప్పుకుంటానని అంటున్నాడు.

"నిజం చెబుతున్నాను.. కథల్లో ఏది క్లిక్ అవుతుందో నాకు తెలీదు. దర్శకుడు కథ చెప్పేవరకు ఓపెన్ మైండ్ తో ఉంటాను. ఉదాహరణకు వక్కంతం కథ చెప్పేవరకు, ఆ స్టోరీలైన్ నాకు తెలీదు. ఎవరు కథ చెప్పినా క్యారక్టరైజేషన్ నచ్చితే ఓకే అంటాను. సరైనోడు సినిమా కేవలం హీరో బాడీ లాంగ్వేజ్ నచ్చి ఒప్పుకున్నాను. ఆ టైమ్ లో అలా అనిపించి అది చేశాను. ఇప్పుడు సూర్య పాత్ర నచ్చి నా పేరు సూర్య చేశాను. సక్సెస్, ఫెయిల్యూర్ అన్నది తర్వాత."

ఓ సినిమా ఎలా ఉంటుందనేది ట్రయిలర్ చూసి ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారని, కానీ ఓ కథ ఎలా ఉండబోతోందనే విషయంపై తనకు ఎలాంటి ట్రయిలర్స్ ఉండవని అంటున్నాడు బన్నీ. సక్సెస్, ఫెయిల్యూర్స్ ను ఒకేలా తీసుకుంటానని, ప్రతిది ట్రయిల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో సాగిపోతుందని చెప్పుకొచ్చాడు.