cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నలభై ఏళ్ల క్రితం ఓ సంక్రాంతి

నలభై ఏళ్ల క్రితం ఓ సంక్రాంతి

ఈ సంక్రాంతికి టాలీవుడ్, సినిమా అభిమానులు ఊగిపోతున్నారు. సినిమా లు తీసిన నిర్మాతలు, దర్శకులు, అందులో నటించిన హీరోలు ఏమాత్రం క్లెయిమ్ చేయకపోయినా, మా సినిమా గొప్ప..మా సినిమా గొప్ప అంటూ నానా హంగామా జరిగిపోతోంది. గత ఏడాది కూడా ఇంత హంగామా లేదు. బాబాయ్ అబ్బాయ్ ల సినిమాలు పోటీ పడ్డాయంతే. కానీ ఈసారి అలా కాదు, రాష్ట్రంలోని రెండు బలమైన వర్గాలు, ఇద్దరు బలమైన హీరోలు, వాళ్ల అభిమానులు ఇలా చాలా మంది పోటీ పడ్డట్లు కనిస్తోంది. ఈ హడావుడి అంతా చూస్తుంటే సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1977 సంక్రాంతికి జరిగిన పోటీ గుర్తుకు వస్తోంది.

ఆ సంక్రాంతికి ఎన్టీఆర్-కృష్ణ సినిమాలు పోటీ పడ్డాయి. అది కూడా చిత్రంగా ఒకే కథాంశంతో కూడిన రెండు సినిమాలు. ఒకటి దానవీరశూర కర్ణ, రెండవది కురుక్షేత్రం. రెండు సినిమాలు భారతగాథ ఆధారంగా తయారైన సినిమాలే. ఈ రెండు సినిమాలు మేకింగ్ దగ్గర నుంచి విడుదల వరకు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. పౌరాణిక సినిమాలన్నా, కృష్ణ, ధుర్యోధన పాత్రలన్నా ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమనుకునే రోజుల్లో హీరో కృష్ణ అత్యంత వ్యయ ప్రయాసలకు, ఛాలెంజ్ లకు ఓర్చుకుని కురుక్షేత్రం సినిమాను తీసారు. దానవీరశూరకర్ణ కు మూడు పాత్రలతో ఎన్టీఆర్ నే బలం. శకునిగా ధూళిపాళ కూడా మరో బలం. 

కానీ కురుక్షేత్రం పరిస్థితి..కృష్ణుడిగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణం రాజు, శకునిగా నాగభూషణం,అర్జునుడిగా కృష్ణ, దుర్యోధనుడిగా కైకాల సత్యనారాయణ లాంటి అతిరథమహారధులు కలిసారు. కురుక్షేత్రంలో దుర్యోధనుడు అయిన కైకాల సత్యనారాయణ, దానవీరశూరకర్ణలో భీముడిగా వేయడం విశేషం. క్యారెక్టర్ ఏక్టర్ చలపతిరావుకూడా ఎన్టీఆర్ తో సమానంగా దానవీర శూరకర్ణలో మూడు క్యారెక్టర్లు పోషించడం మరో విశేషం.

ఈ రెండు సినిమాలకు ఇద్దరు మహా రచయితలు పనిచేసారు. దానవీరశూరకర్ణ కోసం తొలిసారి కొండవీటి వెంకట కవి సినిమా రచయితగా మారారు. ఈయన ఈనాడు రామోజీకి అత్యంత ఆప్తుడు. ఈనాడులో చాలాకాలం కాలమిస్టుగా కూడా రాసారు. రామోజీ కుమారుడు సుమన్ ఈయన దగ్గర శిష్యరికం కూడా చేసారు. ఇక కృష్ణకు అల్లూరి సీతారామ రాజు వంటి సినిమాకు సంభాషణలు రాసిన త్రిపురనేని మహారథి కురుక్షేత్రం సినిమాకు పనిచేసారు. 

సంగీతం విషయంలో భలే గమ్మత్తు వుంది. కురుక్షేత్రం సినిమా కు సాలూరి రాజేశ్వరరావు పని చేసారు. దానవీరశూరకర్ణ సినిమాకు కూడా ప్రారంభంలో సాలూరి వారే పనిచేసారు. కొన్ని పాటలు ఆయన ట్యూన్ చేసారు. కానీ మిగిలిన పని అంతా పెండ్యాల నాగేశ్వరరావు ఫినిష్ చేసారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా వుంది. దానవీరశూరకర్ణలో ఘంటసాల ఆలపించిన విఖ్యాత భగవద్గీతలోని శ్లోకాలను వాడాలనుకున్నారు ఎన్టీఆర్. కానీ దాని హక్కుల విషయంలో సమస్య వచ్చింది. దాంతో సినారే చేత సింపుల్ ఫై చేయిచిన భగవద్గీత శ్లోకాలను రామకృష్ణ చేత గానం చేయించారు. 

బడ్జెట్ విషయంలో కురుక్షేత్రం బడ్జెట్ భారీ. కానీ దానవీరశూరకర్ణ బడ్జెట్ చాలా అంటే చాలా తక్కవ. టెక్నికల్ గా కురుక్షేత్రం చాలా హై గా వుంటుంది. కానీ డివిఎస్ కర్ణ అలా కాదు. సినిమాలో అక్కడక్కడ ట్రిక్ షాట్ ల కోసం కట్టిన వైర్లు కూడా కనిపించేస్తాయి. ఇప్పుడు శాతకర్ణి సినిమాకు డైలాగులు ఏ విధంగా బలంగా సమకూరాయో, కర్ణ సినిమాకు కొండవీటి వెంకట కవి మాటలు అలా సమకూరాయి. అవే ఆ సినిమా విజయం విషయంలో చాలా ప్రముఖ పాత్ర వహించాయి. ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ కురుక్షేత్రం సినిమా కోసం టైటిల్ సాంగ్ ను శ్రీశ్రీ రాయడం విశేషం. 

ఇంకోగమ్మత్తేమిటంటే, దానవీర శూర కర్ణలో ఎన్టీఆర్ కుటుంబ హీరోలు హరికృష్ణ, బాలకృష్ణ కూడా నటించారు. తొలిసారిగా ఎన్టీఆర్ కుమార్తెలు ఈ సినిమాలోని ఓ నాట్య సన్నివేశంలో కనిపిస్తారు. ఇన్ని విశేషాలున్న ఈ రెండుసినిమాలు సంక్రాంతికి పోటా పోటీగా విడుదలయ్యాయి. రాష్ట్రంలో కృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నడుమ అప్పట్లో ఉప్పు నిప్పు మాదిరిగా వుండేది. అలాంటి టైమ్ లో ఒకే సబ్జెక్ట్ తో కూడిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అంటే పరిస్థితి ఎలా వుండి వుంటుందోఊహించుకోవాల్సిందే.

విడుదలైన తరువాత దానవీరశూరకర్ణకు మాస్ జనాల నుంచి సైతం మంచి ఆదరణ లభిస్తే, కురుక్షేత్రం సినిమాకు క్రిటిక్స్ నుంచి, క్లాస్ జనాల నుంచి మంచి ప్రశంసలు అందాయి. టెక్నికల్ రీత్యా, ఖర్చు రీత్యా భారీ సినిమా అనిపించుకుంది కురుక్షేత్రం. కానీ ఎన్టీఆర్ వాచకం, కొండవీటిసంభాషణలు కలిసి, కర్ణకే ఎక్కువ విజయం దక్కేలా చేసాయి.