ఈమధ్య టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ పై జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. డైరక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తే.. లవ్ స్టోరీ సినిమా విడుదలకు పోటీగా సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని ఆ సినిమా నిర్మాతలు కూడా వ్యతిరేకించారు. అయితే నాని మాత్రం తగ్గలేదు. ఏదీ తన చేతిలో లేదంటూనే.. టక్ జగదీష్ ను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో టక్ జగదీష్ సినిమా వచ్చేనెల 10న డైరక్ట్ ఓటీటీ రిలీజ్ గా రాబోతుందనే విషయాన్ని నాని ప్రకటించాడు. “నాయుడుగారి చిన్నబ్బాయి టక్ జగదీశ్ చెబుతున్నాడు..మొదలెట్టండి” అనే డైలాగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశాడు. దీంతో ఇన్నాళ్లూ ఈ సినిమాపై నడిచిన వివాదానికి, ఊహాగానాలకు చెక్ పడినట్టయింది.
నాని నుంచి డైరక్ట్ ఓటీటీలో ఓ సినిమా రిలీజ్ అవ్వడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది నాని నటించిన V సినిమాను అమెజాన్ లోనే నేరుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు వరుసగా టక్ జగదీష్ కూడా అమెజాన్ లోనే రిలీజ్ అవుతోంది. తనకు ఇష్టం లేదంటూనే ఇలా తన రెండు సినిమాల్ని ఓటీటీకి అప్పగించేశాడు నాని.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. సెకెండ్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించగా.. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.