బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన నర్తనశాల కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ద్రౌపది పాత్ర పోషిస్తోన్న సౌందర్య ఫ్లయిట్ యాక్సిడెంట్‍లో మరణించడంతో పాటు బాలయ్యకు పర్సనల్‍గా కొన్ని అవాంతరాలు ఏర్పడడంతో ఆ చిత్రం అక్కడితో నిలిచిపోయింది.
ఇన్నేళ్ల తర్వాత బాలకృష్ణ ఆ చిత్రం కోసం చిత్రీకరించిన ఫుటేజీని విడుదల చేయడానికి శ్రేయాస్ సంస్థ ముందుకొచ్చింది. పదిహారు నిమిషాల నిడివి మాత్రమే వున్న సదరు షార్ట్ ఫిలిం క్లిప్పింగ్‍లో ఎంతో వుంటుందనుకోవడం అత్యాశే అవుతుంది.
యాభై రూపాయలు ప్లస్ టాక్సెస్ అంటూ ఛార్జ్ చేస్తోన్న సదరు షార్ట్ క్లిప్పింగ్‍లో కేవలం రెండే సన్నివేశాలు మాత్రం వున్నాయి. అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్లాల్సిన పాండవుల్లో ఎవరెవరు ఏ వేషాలు వేసుకోవాలి, ఏ విధంగా ఆ ఏడాది ఎవరి కంట పడకుండా వుండాలి అనేది చర్చించుకోవడమనేదే ఓ సుదీర్ఘ సన్నివేశం.
ఇక్కడితో సరిగ్గా ఎనిమిది నిమిషాల నిడివి వచ్చింది. బాలకృష్ణ ఈ చిత్రం కోసం డైరెక్ట్ చేసింది ఇంతవరకు మాత్రమే. పదహారు నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ వీడియో క్లిప్‍లో కనీసం అంతసేపు కూడా బాలయ్య దర్శకత్వ ప్రతిభ కానీ, ఆయన నటపటిమ కానీ చూసే వీల్లేదన్నమాట.
మరి మిగతా ఎనిమిది నిమిషాల సేపు ఏమి చూపించారంటారా? స్వర్గీయ ఎన్టీఆర్ చేసిన క్లాసిక్ నర్తనశాల చిత్రం నుంచి ‘‘నరవరా కురువరా’’ పాటను యథాతథంగా చూపించేసారు. అర్జునుడిని ఊర్వశి శపించే సన్నివేశం కూడా ఆ చిత్రంలోనిదే వాడేసారు.
ఇదే చీటింగ్ అనిపిస్తే… ఇక కొసమెరుపుగా బాలయ్యను బృహన్నల వేషంలో చూపించడానికి ‘టాప్ హీరో’లో ఒక పాటలో చేసిన చిన్న బిట్ కూడా జత చేసారు. కనీసం సి.జి.ఐ కేవలం బృహన్నలను మాత్రమే చూపించినా ఒక అర్థముండేది కానీ పక్కన రెగ్యులర్ బాలయ్య డాన్స్ చేస్తూ కనిపించడం నర్తనశాల సినిమాకోసం ఒక అమెచ్యూర్ ఎడిటర్ యూట్యూబ్‍లో చేసే ఫాన్ మేడ్ ట్రెయిలర్‍ని తలపిస్తుంది.
ఈ వీడియో క్లిప్ ద్వారా వచ్చిన మొత్తం చారిటీ కోసం వాడాలని తలపెట్టారు కానీ కనీసం పదహారు నిమిషాల నిడివిలో తమ వద్ద సగం కూడా అసలు ఫుటేజీ లేదని ముందే చెప్పినట్టయితే ఇలా మోసం చేసినట్టు కాకుండా కాస్త సమంజసం అనిపించేది. అసలంటూ ఈ ఫుటేజీని ఇలా నిర్ధిష్టమయిన ధర నిర్ణయించి విడుదల చేయకుండా, ఆ వీడియో బిట్ చూసిన వారినే తోచినంత విరాళం ఇచ్చి చారిటీకి సాయపడమని కోరితే మరింత బాగుండేది.
ఏదేమైనా సదరు ‘నర్తనశాల’ వీడియో క్లిప్పింగ్ యాడ్ ఫిలింకి ఎక్కువ, షార్ట్ ఫిలింకి తక్కువ అన్నట్టుంది. బాలకృష్ణ నోటివెంట ఆ తేట తెలుగు సంభాషణలు వినడానికి, సౌందర్య, శ్రీహరిని మరోసారి వీక్షించడానికి అవకాశం కల్పించిందనే కారణం మినహా ఈ వీడియో ఎవరినైనా నిరాశ పరుస్తుంది. కాకపోతే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలంటే మాత్రం బాలకృష్ణే సంకల్పించాలి, ఆయనకు మాత్రమే ఇది సాధ్యమని మాత్రం ఎవరైనా ఒప్పుకుని తీరాలి.