బ్యాలెట్ ఓట్లపై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు నేపథ్యంలో ‘మా’ ఎన్నికల అధికారి ట్విస్ట్ ఇచ్చారు. బ్యాలెట్ పేపర్‌కు నామినల్‌గా రూ.500 చెల్లించాలని, అయితే ఒకే వ్యక్తి అందరి డబ్బు చెల్లించటం నిబంధనలకు విరుద్ధమని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తేల్చి చెప్పారు. ఇదే సందర్భంలో పోస్టల్ బ్యాలెట్‌ను రద్దు చేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే…
కరోనాను దృష్టిలో పెట్టుకుని 60 ఏళ్లకు పైబడిన ‘మా’ సభ్యులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బ్యాలెట్ పేపర్‌కు నామినల్‌గా రూ.500 చెల్లించాలని నిర్ణయించారు. డబ్బు చెల్లించాల్సిన బ్యాంకు అకౌంట్ వివరాలు సభ్యులకు అందజేశారు. మొత్తం 125 మంది పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు. వీరిలో 56 మందికి సంబంధించి మంచు విష్ణు తరపున ఓ వ్యక్తి రూ.28 వేలు చెల్లించారు. దీంతో వీరందరి ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.
ఈ విషయమై ఎన్నికల అధికారికి తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత దిగజారుతారా? అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా? అని నిలదీశారు.
ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదుపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా తొలిసారి పోస్టల్ బ్యాలెట్ పెట్టామన్నారు. ‘మా’లో 60ఏళ్లు పైబడిన సభ్యులు 125మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకూ 60 మంది సభ్యులు పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగారని ఆయన చెప్పారు.
సాయంత్రం 60మందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్‌కు నామినల్‌గా చెల్లించాల్సిన విధానంపై సీనియర్ సభ్యులకు అవగాహన లేదన్నారు. నామినల్ సొమ్ము చెల్లింపుపై అవగాహన కోసం మంచు విష్ణుకు వాళ్లు ఫోన్ చేశారట అని ఆయన చెప్పారు.
దీంతో ఆయన తరపున ఒక వ్యక్తి వచ్చి ఆ మొత్తం డబ్బు చెల్లించారన్నారు. ఒకే వ్యక్తి డబ్బు చెల్లించటం నిబంధనలకు విరుద్ధ మని ఎన్నికల అధికారి చెప్పడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్‌కు చెల్లించిన రూ.28వేలు తిరిగి ఇచ్చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
ఒకవైపు నిబంధనలకు విరుద్ధమని చెబుతూనే, మరోవైపు ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగిస్తారని ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయం, అక్రమని వారు వాపోతున్నారు. దీనిపై ఎన్నికల అధికారి తుది నిర్ణయం ఎలా వుంటుందోననే ఉత్కంఠ నెలకుంది.