రజనీకాంత్.. తమిళ సూపర్ స్టార్ మాత్రమే కాదు, తమిళ రాజకీయాలకు ఆశాదీపం కూడా.! తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ అంశం గురించిన చర్చే జరుగుతోంది. రజనీకాంత్ తదుపరి సినిమా ఏంటి.? అందులో నటీనటులెవరు.? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు.? ఈ అంశాల కంటే ఎక్కువగా, జనం చర్చించుకుంటున్న అంశం రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించే. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా కాదనలేకపోతున్నారు.
'మేం మీ సినిమాల కోసం ఎదురుచూస్తున్నాం.. అంతకన్నా ఎక్కువగా మీ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నాం..' అని అభిమానులు, రజనీకాంత్‌తోనే తమ మనసులో మాట చెప్పేస్తున్నారు. అభిమానులతో గత రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్న రజనీకాంత్‌కి, పొలిటికల్ ఎంట్రీపై వారి నుంచి వస్తున్న ప్రశ్నలు ఇబ్బందికరంగా మారాయి.
'దేవుడు ఆదేశిస్తే..' అంటూ తొలిరోజు అభిమానులతో భేటీ అయిన సందర్భంగా రజనీకాంత్ వ్యాఖ్యానించినప్పటికీ, 'ఈ క్లారిటీ మాకు సరిపోదు..' అంటూ అభిమానులు, రజనీకాంత్‌పై ఒత్తిడిని తీవ్రతరం చేసేశారు. మరోపక్క, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలా తనపై ఒత్తిడి పెరుగుతున్నా, ప్రస్తుతానికి రాజకీయాలపై ఎలాంటి సానుకూల ప్రకటనా చేయకూడదని రజనీకాంత్ గట్టిగా నిర్ణయించుకున్నారనే విషయం ఆయన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది.
అయినాసరే, 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? మరోసారి తమిళనాడులో రాజకీయ శూన్యతని మేం ఆశించలేం.. ప్రస్తుత పరిస్థితుల కంటే అనువుగా, అనుకూలంగా రజనీకాంత్‌కి కలిసొస్తాయని అనుకోలేం.. ఇదే రజనీకాంత్‌కి చివరి అవకాశం..' అంటూ అభిమాన సంఘాల నేతలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు.