cloudfront

Advertisement


Home > Movies - Movie News

హరికృష్ణ కారుకు డ్రైవర్ ఎందుకు లేడు..?

హరికృష్ణ కారుకు డ్రైవర్ ఎందుకు లేడు..?

హైదరాబాద్ టు కావలి, దాదాపు 400 కిలోమీటర్ల ప్రయాణం. ఉదయాన్నే 4 గంటలకల్లా కారు బైటకు తీశారు హరికృష్ణ. లాంగ్ జర్నీ, ప్రయాణం చేసిన వెంటనే విశ్రాంతికి కూడా అవకాశం లేదు, ఉదయాన్నే జరిగే పెళ్లికి హాజరుకావాలి. స్నేహితులని ఎక్కించుకుని కారుని తానే డ్రైవింగ్ చేసుకుంటూ కావలి వెళ్లడానికి సిద్ధపడ్డారు హరికృష్ణ. ఎందుకంటే డ్రైవింగ్ అంటే హరికృష్ణకు అంత ఇష్టం. 

తండ్రి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కి హాజరయ్యే సమయంలో కూడా ఆయన కారుని హరికృష్ణే నడుపుకుంటూ వెళ్లేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రచార చైతన్య రథానికి సారథి కూడా హరికృష్ణే. వేల కిలోమీటర్ల దూరం చైతన్య రథాన్ని విసుగులేకుండా నడిపారు హరికృష్ణ. ఇంట్లో డ్రైవర్లు ఉన్నా స్వయంగా తానే కారు నడపడం హరికృష్ణకు బాగా ఇష్టం. అదే ఈరోజు ప్రమాదానికి కారణమైందని అంటున్నారు. 

డ్రైవింగ్ లో ఆయనకు అపార అనుభవం ఉన్నా కొన్ని కొన్నిసార్లు విధిరాతను ఎవరూ తప్పించలేం. వాహనం అతివేగంలో దూసుకుపోవడంతో ప్రమాదం జరిగింది. హరికృష్ణ నడుపుతున్న ఫార్చ్యూనర్ కారు ప్రమాద సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. వాటర్ బాటిల్ కోసం ఆయన వెనక్కు తిరిగారు, ఇంతలో కారు అదుపు తప్పడంతో డివైడర్ ని ఢీకొని 15 మీటర్ల దూరం ఎగిరిపడింది. కారుకి 20 మీటర్ల దూరంలో హరికృష్ణ ఎగిరిపడ్డారు. 

అతివేగంతో పాటు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో హరికృష్ణ మృతిచెందినట్టు పోలీసులు చెబుతున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం ఘటనలో పోలీస్ రికార్డుల ప్రకారం వేరే వ్యక్తి డ్రైవింగ్ చేశాడని ఉన్నా.. ఎన్టీఆరే కారు నడుపుతున్నారని ఓ పుకారు ఉంది. ఇక హరికృష్ణ పెద్దకొడుకు జానకి రామ్ విషయంలో ఆయనే కారు డ్రైవింగ్ చేస్తూ ట్రాక్టర్ ని ఢీకొని ప్రమాదానికి గురై మరణించారు.

తాజాగా హరికృష్ణ కూడా తానే కారు డ్రైవ్ చేస్తూ మృత్యు ఒడికి చేరుకున్నారు. అప్పటి జానకి రామ్ కారు నెంబర్ AP29 BD 2323 అయితే, హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నెంబర్ AP28 BW 2323.

మొత్తమ్మీద హరికృష్ణ కారుకి డ్రైవర్ ఉండి ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. డ్రైవింగ్ ని అమితంగా ఇష్టపడే ఆయన, చివరకు డ్రైవింగ్ చేస్తూ కన్నుమూయడం విధి విచిత్రమే.