పవర్ స్టార్.. పవన్ కల్యాణ్ బిరుదు ఇది. అయితే ఇలా పిలిస్తే పవన్ కు నచ్చేది కాదు. తనను పవర్ స్టార్ అని పిలవొద్దని ఆయన గతంలో పలుమార్లు అభిమానులకు సూచించారు. పోటీచేసిన 2 చోట్ల ఓడిపోయానని, తన చేతిలో పవర్ లేదని, అందుకే తనను పవర్ స్టార్ అని పిలవొద్దని వారించారు.
వేరే వ్యక్తులకు పవర్ ఇచ్చి, తనను పవర్ స్టార్ అని పిలిస్తే అర్థం ఏముందని అభిమానుల్ని గతంలో ప్రశ్నించారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ను నిజంగానే పవర్ స్టార్ అని పిలవొచ్చు. ఎందుకంటే, ఆయన చేతికి నిజమైన ‘పవర్’ వచ్చింది.
పవన్ ఇప్పుడు కేవలం జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన చేతికి మొదటిసారి పవర్ వచ్చింది అక్కడే. ఆ తర్వాత ఆయన ఉప-ముఖమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన పవర్ డబుల్ అయింది.
ఇవి కాకుండా.. పలు మంత్రిత్వ శాఖలు కూడా పవన్ ఆధీనంలోకి వచ్చాయి. అలా పవన్ పవర్ మరింత పెరిగింది. సో.. ఇప్పుడాయన నిజమైన పవర్ స్టార్. కాకపోతే పొలిటికల్ పవర్ స్టార్ అని అనాలేమో.
తన వదిన (చిరంజీవి భార్య) బహుమతిగా ఇచ్చిన పెన్నుతో తొలి ఫైల్ పై సంతకం పెట్టారు పవన్. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించి నిధులు మంజూరు చేసే ఫైల్ పై సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు.