Advertisement


Home > Movies - Movie News
ఎన్టీఆర్‌ 'అరవింద సమేత'కి లీకుల గోల

లీకులు బాబోయ్‌ లీకులు.. మొన్నామధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగబాబుకి సంబంధించిన ఓ స్టిల్‌ లీక్‌ అయ్యింది. దాంతో 'అరవింద సమేత' టీమ్‌ చాలా సీరియస్‌ అయ్యిందనీ, లొకేషన్‌లో ఎక్కడా మొబైల్‌ ఫోన్లకు అనుమతించడంలేదనీ వార్తలొచ్చాయి. నిజానికి, ఈ మధ్య ఏ పెద్ద సినిమాకి అయినాసరే, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. చాలా అంటే చాలా చాలా అన్నమాట. లొకేషన్‌లో ఎవరన్నా ఫోన్‌ పట్టుకుని తిరిగితే చాలు, అనుమానించాల్సిన పరిస్థితి.

'ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌కి అనుమతి లేదు' అనే బోర్డులు సినిమా షూటింగుల్లో కన్పించడం సర్వసాధారణమైపోయింది. అయినాగానీ, లీకులు ఆగడంలేదాయె. 'అజ్ఞాతవాసి' పరాజయం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, 'అరవింద సమేత' కోసం అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకుంటున్నా, లీకుల బెడద తప్పడంలేదు. తాజాగా మరికొన్ని స్టిల్స్‌ లొకేషన్‌ నుంచి లీక్‌ అయ్యాయి. ఈసారి లీక్‌ అయిన ఫొటోల్ని చూస్తే, అది ఓ వీడియోకి సంబంధించిన వ్యవహారంగా కన్పిస్తోంది.

వీడియో ఫుటేజ్‌కి సంబంధించి స్క్రీన్‌ షాట్‌ లీక్‌ అయ్యిందా.? లేదంటే, మొత్తంగా వీడియో లీక్‌ అయిపోయిందా.? అన్న అనుమానాలు ఇప్పుడు 'అరవింద సమేత' టీమ్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా రూపొందుతోంది 'అరవింద సమేత'. ఆగస్ట్‌ 15న ఈ సినిమా టీజర్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, అంతకు ముందే వెలుగు చూసిన లీకుల వ్యవహారం.. చిత్ర యూనిట్‌కి తలనొప్పిగా మారింది.