cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్‌ బయోపిక్‌.. బాలయ్యా తప్పు చేశావయ్యా.?

ఎన్టీఆర్‌ బయోపిక్‌.. బాలయ్యా తప్పు చేశావయ్యా.?

నందమూరి తారకరామారావు.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరిది. సినీ నటుడిగా ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? తెలుగు సినిమా అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేర్లలో నందమూరి తారకరామారావు ముందు వరుసలో వుంటారు. తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా అంతే. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగువారికి రాముడు, కృష్ణుడు ఎలా వుంటాడంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ ఫొటోనే గుర్తుకొస్తుంది.

కానీ, 'ఎన్టీఆర్‌ బయోపిక్‌'లో మొదటిపార్ట్‌ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు' నిరాశపర్చింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలైనా సినిమాని జనం పెద్దగా పట్టించుకోలేదు. పోనీ, సినిమాకి నెగెటివ్‌ రివ్యూలు వచ్చాయా? అంటే అదీ లేదు. రెండు పార్టులుగా ప్లాన్‌ చేసి, తొలుత 'కథానాయకుడు'ని విడుదల చేయడం, ఆ కథానాయకుడులో కావాల్సినంత 'కాన్‌ఫ్లిక్ట్‌' లేకపోవడం, సినిమా పరాజయం పాలవడానికి ప్రధాన కారణమంటూ ఇప్పుడు 'పోస్ట్‌మార్టమ్‌' జరుగుతోంది.

రెండు పార్టులుగా కాకుండా, ఒకేపార్ట్‌లో సినిమా తీసేసి వుంటే బావుండేదంటూ ఇప్పుడు బాలయ్య తీరిగ్గా వాపోతున్నాడా.? అంటే ఔననే సమాచారం 'ఎన్‌టిఆర్‌' టీమ్‌ నుంచి వస్తోంది. నిజానికి, 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' రెండుపార్టులు కాదు, మూడు పార్టులుగా తీసినా.. అందుకు అవసరమైన 'స్టఫ్‌' దొరుకుతుంది.

ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలో వున్న ఎత్తుపల్లాలు అలాంటివి. సినిమా జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. బాలకృష్ణ నటించి, నిర్మించడం, తెరవెనుకాల కథ అంతా టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నడవడం.. ఇవన్నీ 'ఎన్‌టిఆర్‌'పై అంచనాల్ని తగ్గించేశాయి.

తొలుత తేజ దర్శకుడిగా అనుకున్నప్పుడు సినిమా కేవలం సింగిల్‌ పార్ట్‌లోనే ప్లాన్‌ చేశారు. ఆ కథని క్రిష్‌ రాకతో పూర్తిగా మార్చేశారు.. ఆ మార్పుల వెనుక బాలయ్య హస్తం సుస్పష్టం. అవసరం లేని సన్నివేశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, సినిమా లెంగ్త్‌ని పెంచేశారంటూ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి గుసగుసలు గుప్పుమంటున్నాయి.

అయ్యిందేదో అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇది ఓ మహానటుడి బయోపిక్‌.. మహానాయకుడి బయోపిక్‌. ఇంత చప్పగా, ఇంత పేలవంగా తొలిపార్ట్‌ ఉస్సూరుమన్పిస్తే, రేప్పొద్దున్న రెండోపార్ట్‌ పరిస్థితి ఏంటట.? అది ఇంకా పేలవంగా వుండబోతోంది. ఎందుకంటే, 'వెన్నుపోటు' ఎపిసోడ్లు (ఒకటి నాదెండ్ల భాస్కరరావుది, ఇంకోటి నారా చంద్రబాబునాయుడిది) మహానాయకుడులో లేవట.!

ఏదిఏమైనా, 'స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీసి వుండకపోయినా బావుండేదేమో.. సినిమా తీసి, ఎన్టీఆర్‌ ఇమేజ్‌ని తగ్గించేసినట్లయ్యింది..' అన్న విమర్శల్ని బాలకృష్ణ ఎదుర్కోవాల్సి వస్తోందిప్పుడు. పాపం బాలయ్య, 'తప్పు చేశావయ్యా..' అన్న విమర్శల్ని మోయక తప్పడంలేదు.

చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే అన్నట్టుగా బాలయ్య తీసిన, నటించిన ఈ ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆ మహానుభావుడి స్థాయిని తగ్గించేస్తోందనుకోవాలా.? లేకపోతే, సంక్రాంతి సీజన్ అయినా కూడా, జనాలు ఈ సినిమాని పట్టించుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!