cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్‌ బయోపిక్‌: ఒకవైపే చూడు..!

ఎన్టీఆర్‌ బయోపిక్‌: ఒకవైపే చూడు..!

ఒకవైపే చూడు.. రెండోవైపు చూడొద్దు.. తట్టుకోలేవ్‌.. అనేది నందమూరి నటసింహం బాలయ్య చెప్పిన ఒక డైలాగ్‌. బహుశా ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయంలో కూడా ఇదే ఫార్ములానే అనుసరించి ఉండవచ్చు. అయినా ఒక తండ్రి కథను ఆయన కొడుకు చెబితే ఎలా ఉంటుంది? ఏ తండ్రి గురించి అయినా మరెకొడుకు అయినా చాలా పాజిటివ్‌గానే చెప్పుకుంటాడు. అదేరీతిన బాలయ్య కూడా తన తండ్రి గురించి అలాగే చెప్పుకున్నాడు బయోపిక్‌లో. ఎన్టీఆర్‌ను మరేబలహీనత లేనివ్యక్తిగా చిత్రీకరించారు. అయితే తిండి విషయం మాత్రం మినహాయించలేదు. తిండి మాత్రమే ఎన్టీఆర్‌ బలహీనత మరేంకాదు.. అన్నట్టుగా ఎన్టీఆర్‌-కథానాయకుడిని చిత్రీకరించారు!

సావిత్రి బయోపిక్‌ తీస్తే.. ఆమెకు తాగుడు అనే బలహీనతను చూపించారు. తను జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులతో విసిగివేసారిపోయి.. ఆమె తాగుడుకు అలవాటు పడ్డారని, అలా జీవితాన్ని నాశనం చేసుకున్నారని ఆ సినిమాలో చూపించారు. ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సావిత్రి సొంత కూతురు.. ఆ బయోపిక్‌ను స్వాగతించింది. అయితే జెమిని గణేషన్‌ కూతుర్లు మాత్రం ఆ బయోపిక్‌ మీద దుమ్మెత్తిపోశారు. తమ తండ్రి ఇమేజ్‌ను దెబ్బతీశారని.. ఆ సినిమాపై జెమిని కూతుళ్లు విరుచుకుపడ్డారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో సావిత్రి బలహీనత గురించి చూపించారు. ఆమె చెయ్యి పెద్దదని, అపాత్రదానాలు చేసినట్టుగా చూపించారు. నిత్యామీనన్‌ రూపంలో సావిత్రిని చూపింది ఒకే సీన్లో అయినా.. డబ్బు విషయంలో ఆమెకు అటు ఎన్టీఆర్‌ పాత్రతోనూ, ఇటు ఏఎన్నార్‌ పాత్రతోనూ.. క్లాసులు పీకించే సీన్లు పెట్టారు. సావిత్రి కాబట్టి అలా క్లాసులు పీకించగలిగారు. ఆమెది కాని సినిమాలో కూడా ఆమె బలహీనత మీదే ఫోకస్‌ చేశారు. మరి ఎన్టీఆర్‌కు మాత్రం ఎలాంటి బలహీనతలూ ఉండవా?! అనే సందేహం ఒక కామన్‌ ఆడియన్‌కు వస్తే తప్పు ఎవరిది అవుతుంది?

ఎన్టీఆర్‌ గురించి ఈ జనరేషన్‌ యువత మాట్లాడటం సరికాకపోవచ్చు. ఆయన మరో సందేహం లేకుండా గొప్పనటుడే. అందులో కాదని అనడానికి ఏమీలేదు. ఎన్టీఆర్‌కు ధీటైన నటుడు ఇప్పటివరకూ తెలుగునాట రాలేదు. ఈ స్టేట్‌మెంట్‌నూ తప్పుపట్టడానికి వీల్లేదు. అయితే ఎన్టీఆర్‌ గురించి.. ఆయన తరంవారు, ఆయన సమకాలీనులు చేసిన కామెంట్లు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఫస్ట్‌ పార్టులో సినిమా గురించి చూపించారు. ఆయన పొలిటికల్‌ ఎంట్రీని ప్రకటింపజేశారు.

ఇక్కడివరకూ మాట్లాడుకుంటే.. సావిత్రి భోళాతనం గురించి చెప్పుకొచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పిసినారి తనం గురించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది పెద్దడౌట్‌! ఎన్టీఆర్‌ పిసినారి.. అని ఈ కథన రచయిత అనడంలేదు. కొంతమంది పెద్దవాళ్లే ఆ మాటే అన్నారు. మల్లెమాల సుందరరామి రెడ్డి తన ఆటో బయోగ్రఫీలో ఏం రాశాడో ఆ పుస్తకం చదవిన వాళ్లకు  తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్‌ను ఒక పిసినారిగా, అన్నీ తనకే తెలుసు అనే స్వభావం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు మల్లెమాల.

ఒక సినిమా మేకింగ్‌ సందర్భంగా పౌండ్రక వాసుదేవుడి గెటప్‌ విషయంలో ఎన్టీఆర్‌ తనతో వాదనకు దిగినట్టుగా మల్లెమాల పేర్కొన్నాడు. ఆ గెటప్‌ అలానే ఉంటుందని చెప్పినా వినలేదని.. చివరకు ఆయనకు వివరించి చెప్పి అర్థమయ్యేలా చేయాల్సి వచ్చిందని మల్లెమాల పేర్కొన్నాడు. ఇక ఎన్టీఆర్‌ కూతుళ్లలో ఒకరైన భువనేశ్వరి పెళ్లి విషయంలో కూడా తను ఖర్చులు భరించాల్సి వచ్చిందని మల్లెమాల వివరించాడు. మద్రాస్‌లో పెళ్లి జరిగితే... పెళ్లికి హోటళ్లలో గదులు బుక్‌ చేయాలని తనకు చెప్పారని, బహుశా మళ్లీ డబ్బులిస్తారేమో అనుకుంటే.. చివరకు ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడని.. మల్లెమాల వివరించాడు. డబ్బు ఎంత అనేది అక్కడ ప్రధానం కాకపోవచ్చు.

ఎన్టీఆర్‌ మనస్తత్వం ఏమిటో వివరించడానికి అలాంటి ఉదాహరణలను పరిగణనలోకి తీసుకోవచ్చునేమో. ఎన్టీఆర్‌ నాలుగు రోజుల పాటు తను భోజనం చేయకుండా కేవలం రూమ్‌మేట్స్‌కు తన భోజనం టికెట్లు ఇచ్చాడనే.. అసంబద్ధమైన గొప్ప చెప్పుకోవడం కూడా ఎందుకోమరి! ఎన్టీఆర్‌ భోజన ప్రియుడు అని చెబుతూనే.. తను భోజనం చేయకుండా.. తనచుట్టూ ఉన్న ముగ్గురికి తన భోజనం టికెట్లు ఇచ్చాడని చెబితే... ఎన్టీఆర్‌కు కొత్తగా వచ్చే ఖ్యాతి ఏముంది? ఎందుకు మరీ ఇంత సినిమాటిక్‌గా వెళ్లినట్టు?!

ఎన్టీఆర్‌ పిసినారి అని.. ముఖ్యమంత్రి అయ్యాకా.. తన భార్య అనారోగ్య చికిత్స ఖర్చు నిమిత్తం ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్‌తోనే అమెరికాకు తీసుకెళ్లాడని, అలాగే ఆయన అనారోగ్య చికిత్స ఖర్చును కూడా ఆర్థికశాఖే భరించిందని.. నాదెండ్ల భాస్కరరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భాస్కరరావుకూ ఎన్టీఆర్‌ అంటే పడక ఆ విషయాలను బయటకు చెప్పి ఉండవచ్చు. ఇక ఎన్టీఆర్‌కు అంతమంది సంతానం ఉంటే.. వారిలో బాలయ్య నామకరణం ఒకటే చూపించడం కూడా గమనించాల్సిన అంశమే.

బాలయ్య గురించి అక్కడ మాట్లాడుకునే వాళ్ల కామెంట్లు కూడా మరీ లేకిగా లేవా? 'షష్టిపూర్తి అయినా.. ఇష్టాలను తీర్చుకుంటూనే ఉంటాడు.. నిత్యయవ్వనుడు..' అని బాలయ్య గురించి భజన! ఇంతకీ ఈ మాటల అర్థం ఏమిటి? ఇది డబుల్‌ మీనింగ్‌ డైలాగా? లేక ఉన్నది సింగిల్‌ మీనింగేనా? అలాగే బాలయ్య పుట్టగానే అతడు తన నటనా వారసుడు అని ఎన్టీఆర్‌ అనేశాడట! అప్పటికే ఎన్టీఆర్‌కు పదిమంది సంతానం.. అయిన వారెవరి మీదా ఎన్టీఆర్‌కు అలా అనిపించలేదా? వాళ్లంతా పనికిరానివాళ్లు అని అప్పటికే ఎన్టీఆర్‌ ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టా!

ఎంత ఈ సినిమాకు అంతా తనే ఐతే మాత్రం.. బాలయ్య తన గురించి తను అంతలా భజన చేయించుకోవాలా?! తను సినిమా తీస్తున్నప్పుడు.. తన సోదరుల గురించి, వారిపై తండ్రికి ఉన్న మమకారం గురించి చూపించుకోవాలి. ఇదే విషయాన్ని కల్యాణ్‌రామ్‌ ఈ సినిమా విడుదలకు ముందు కూడా చెప్పాడు. తను రూపొందిస్తున్న సినిమాలో తన గురించి చూపించుకుంటే ఏం బావుంటుందని తన బాబాయ్‌ అనుకున్నాడని.. అందుకే ఆయన పాత్రను సినిమాలో అసలు చూపలేదని కల్యాణ్‌రామ్‌ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలో మాత్రం అలాంటి డైలాగులున్నాయి!

ఇక రాయలసీమ కరువు గురించి నిధుల సమీకరణ చేశారు, దివిసీమ ఉప్పెన సమయంలోనూ సినిమా తారలు స్పందించారు. ఒప్పుకుందాం. అయితే దివిసీమ ఉప్పెన సీన్లలో అయితే అంతా రామారావే దగ్గరుండి సహాయకార్యక్రమాలు చేపట్టినట్టుగా చూపించారు. అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎంతోకొంత స్పందిస్తుంది.. అనే విషయాన్ని కూడా చూపలేదు. అంతా రామారావే చేశాడు. అక్కడ చనిపోయి వాళ్ల అంత్యక్రియలు, పునరావాసం.. అంతా రామారావే చూసుకున్నాడు, నాగేశ్వరావు ఆయన వెంట ఉన్నాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రస్తావనే లేదా.. అంతా రామారావే.. అని చెప్పుకోవడం మరీ తీవ్రస్థాయికి చేరిన భజన!

ఇక తిరుపతి వెళ్లిన తెలుగు వాళ్లంతా అట్నుంచే అటే మద్రాస్‌లో రామారావు దర్శనానికి వెళ్లేవారు.. రామారావును దర్శించుకుంటే తప్ప జనాల తిరుమల యాత్ర పూర్తి అయ్యేది కాదు.. అని చాలా సీన్లను పెట్టడం బయోపిక్‌లోని మరో పరాకాష్ట! సినిమా హీరోని చూడటానికి అంతగా వెర్రెత్తే జనం ఉన్నారనే అనుకుందాం. అక్కడకు వెళ్లి వాళ్లు తమ కష్టాలను మొరపెట్టుకునే వాళ్లట.. సినిమా హీరోని అంత వెర్రిగా ఆరాధించే వాళ్లలో ఆ కోణం కూడా ఉంటుందా? వాళ్లందరి కష్టాలూ అలా విని.. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాడన్నట్టుగా చెప్పుకొచ్చారీ సినిమాలో.

ఈతరం ప్రేక్షకులు ఇలాంటి వింటేనే.. నవ్వుకుంటారు, వీటిని తెరపై చూపించి.. ఎన్టీఆర్‌ గొప్పోడని చెప్పుకోవడం ఏమిటో కానీ.. థియేటర్లలో స్క్రీన్లకు హారతులు ఇచ్చే వెర్రి జనాలు తెలుగు వాళ్లలో ఉన్నారని మాత్రం ఇప్పటి వాళ్లకు తెలియజెప్పింది ఎన్టీఆర్‌ బయోపిక్‌! నిజంగా అలా హారతులు ఇచ్చినవారు ఉన్నారో లేదో కానీ.. తెలుగు జనాలను అలాంటి వెర్రివాళ్లుగా చూపించింది ఈ సినిమా! కొన్నిరకాల ఎమోషన్స్‌ను చూపించడంలో ఈ సినిమా మేకర్లు ఎంత విజయవంతం అయ్యారో, ఎన్టీఆర్‌ గొప్ప.. అని చెప్పే ప్రయత్నంలో అంతే ప్రహసనం పాలయ్యారు కూడా.

ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌కు గత ఏడాది వచ్చిన 'మహానటి' ఎంతో మేలు చేసింది. ఆ సినిమాలో ట్రూ లెజెండ్స్‌ను చూపించారు. వాళ్ల ప్రస్తావన ఈ సినిమాలోనూ ఉంటుందని ట్రైలర్‌తో స్పష్టత వచ్చింది. మహానటితో సావిత్రినే కాకుండా.. అనేకమంది మహనీయులను తెరమీద చూసిన అనుభూతి పొందారు ప్రేక్షకులు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కూడా ఆ తరహా అనుభూతిని పొందవచ్చని నాటి సినిమా అభిమానులు, నేటితరం వారు భావించారు. అయితే ఆ ట్రూలెజెండ్స్‌ను తెరపై చూపడం విషయంలో.. ఎన్టీఆర్‌ కన్నా మహానటే ఎక్కువ మార్కులు కొట్టేసింది!

ఎన్టీఆర్‌ కేవలం ఎన్టీఆర్‌ కథలా నిలిస్తే.. మహానటి.. తెలుగు సినిమా స్వర్ణయుగం కథ అనిపించింది! ఇక తొలి పార్ట్‌ సినిమాలో ఎన్టీఆర్‌ వేషాలతోనే సినిమా సగం సమయాన్ని చుట్టేశారు. రెండోపార్టులోనూ కొన్ని వేషాలు అయితే ఉండవచ్చు. వాస్తవాలను పాలిష్‌ చేసే పని ఆ రెండో పార్టులో మరింత ఎక్కువగా ఉండొచ్చు!

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు