cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్‌పై సినిమాలు.. సూపర్‌ స్టార్‌ కృష్ణ దమ్ము!

ఎన్టీఆర్‌పై సినిమాలు.. సూపర్‌ స్టార్‌ కృష్ణ దమ్ము!

ఒకవైపు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో పాత్రలు, పాత్రధారుల ఎంపిక శరవేగంగా జరుగుతూ ఉంది. ఎన్టీఆర్‌ కుమారుడు బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ జీవితం అనే కాయిన్‌కు ఒకేవైపు చూపుతారనే అభిప్రాయం గట్టిగా ఉంది. పక్కరాష్ట్రంలో కూడా పెద్దగా తెలియని ఎన్టీఆర్‌ను 'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ'గా అభివర్ణిస్తారు ఆయనకు కావాల్సిన వాళ్లు. ఎన్టీఆర్‌ మహానటుడే, గొప్పనటుడే, పౌరాణికల విషయంలో ఎన్టీఆర్‌కు సాటివచ్చే నటుడు మరొకరులేరు. అయితే.. 'విశ్వవిఖ్యాత నట సార్వభౌమ' అనే పదానికి మీనింగ్‌ గురించి ఆలోచించినప్పుడే.. ఇదేంటబ్బా? అనిపిస్తుంది.

అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే.. అది కూడా ఆయన తనయుడే తీస్తున్నాడంటే.. అందులో ఏదైనా ఒక్క నెగిటివ్‌ పాయింట్‌ అయినా చూపగలరా? అలాగని అలా చూపలేని జీవితం ఎన్టీఆర్‌ ది? అనగలరా? సినిమా హీరోగా ఎన్టీఆర్‌ జీవితాన్ని పక్కనపెడితే, ఆయన వ్యక్తిగత వ్యవహారాలను పక్కనపెడితే.. ఒక రాజకీయ నేతగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో బోలెడన్ని లోటుపాట్లు ఉండనే ఉంటాయి. అందుకు నిదర్శనం... ఐదేళ్ల పాలన పూర్తిచేసుకున్న తర్వాత ఎన్టీఆర్‌ ఓడిపోవడం.

తమిళనాట ఎంజీఆర్‌ సొంత పార్టీ పెట్టాకా.. ఎన్నికల్లో పోటీచేశాకా.. మళ్లీ ఓటమి అన్నది ఎరగకుండా విజయం సాధించాడు. మరణించేంత వరకూ ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగగలిగాడు. అయితే ఎన్టీఆర్‌ తొలిసారి ఐదేళ్ల టర్మ్‌ను పూర్తి చేసుకున్నాకా ప్రజల తిరస్కరణను ఎదుర్కొన్నారు. ఏ కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తుతూ ఆయన అధికారాన్ని సాధించుకున్నాడో.. మళ్లీ అదే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ ప్రతిపక్షం పాలయ్యాడు. ఆ తర్వాత ఐదేళ్లకు అధికారం అయితే దక్కింది కానీ, అల్లుడి రూపంలో ఎన్టీఆర్‌కు ప్రతిబంధకం ఎదురైంది.

ఇంట్లో వాళ్లంతా కలిసి ఆయనను దించేసి.. పదవీ భ్రష్టుడిని చేశారు. ఇది చరిత్ర. అయితే ఈ చరిత్రను ఎన్టీఆర్‌ బయోపిక్‌లో యథాతథంగా చూపగలరా? ఎన్టీఆర్‌పై చెప్పులు పడిన ఘట్టాన్ని చిత్రీకరించగలరా? ఎన్టీఆర్‌కు విలువల్లేవని కుటుంబీకులు అంతా తీర్మానించేసిన విషయాన్ని ప్రస్తావించగలరా? అవన్నీ ఏమీ ఉండవు. కేవలం ఎన్టీఆర్‌ను వీరుడు, శూరుడు, కారణజన్ముడు అని చూపించడమే తప్ప ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎలాంటి అవాంఛిత సన్నివేశాలూ ఉండవని వేరే చెప్పనక్కర్లేదు.

అందులోనూ.. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసే సన్నివేశాలే ఈ సినిమాలో ఉండవని కూడా అంటున్నారు. అది ఇంకా సేఫ్‌జోన్‌. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ అధికారాన్ని సొంతం చేసుకోవడంతో.. కథను ముగించేస్తారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్‌ జీవితంలో అసలైన ఘట్టాలు ఆ తర్వాతే కదా చోటు చేసుకుంది. ఆయన యోగిగా మారడం, యోగి నుంచి మళ్లీ భోగికావడం.. పెళ్లి చేసుకోవడం..ఇవన్నీ కూడా ఆ తర్వాతే ఉంటాయి.

వాటిని టచ్‌ చేయడం అటు నారా ఫ్యామిలీకి, ఇటు నందమూరి ఫ్యామిలీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. దాన్నంతా అంతా మరిచిపోవాలి అనేది ఈ కుటుంబాల భావన. అందుకే.. వాటిని దాచేసే అవకాశాలున్నాయి. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌లో పాత్రాచిత్రణ విషయంలో కూడా అంతా నాటకీయతే ఉండవచ్చు. ఎన్టీఆర్‌ను దేవుడుగా చేసేందుకు ఈ సినిమా ద్వారా గట్టి ప్రయత్నమే జరుగుతూ ఉందనేది వాస్తవం. అయితే.. ఎన్టీఆర్‌పై సినిమా అంటే అదేదో కొత్తగా వస్తోందని ఒకవర్గం అంటోంది కానీ.. ఎన్టీఆర్‌ బయోపిక్స్‌ ఆల్రెడీ వచ్చేశాయి కదా.

ఒకటా రెండా.. మూడు నాలుగు సినిమాలు ఎన్టీఆర్‌ రాజకీయం, ఆయన చుట్టూ ఉన్నవాళ్ల వ్యవహారాలపై వచ్చాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ ఆ సినిమాల్లో కొన్నింటిని దగ్గరుండి తీయించాడు. రాజకీయంగా ఎన్టీఆర్‌తో విబేధించిన వ్యక్తి కృష్ణ. అందులో సందేహంలేదు. సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారానే కృష్ణ ఎన్టీఆర్‌ను గట్టిగా ఢీకొట్టాడు. ఒకవైపు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చాలా డేర్‌గా సినిమాలు రూపొందించారు.

ఎన్టీఆర్‌ జీవితం గురించి సినిమా అంటూ ఈ మధ్య రామ్‌గోపాల్‌ వర్మ కొంత హడావుడి చేశాడు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అంటూ వర్మ హడావుడి చేశాడు. కానీ.. ఈ బోల్డ్‌నెస్‌తో పోలిస్తే కృష్ణ ధైర్యం కొన్నివేల రెట్లు ఎక్కువ. వర్మ ఉత్తుత్తి ప్రకటన చేస్తే.. అప్పట్లోనే కృష్ణ బలమైన సెటైరిక్‌ సినిమాలు రూపొందించారు. 'నా పిలుపే ప్రభంజనం', 'సాహసమే ఊపిరి', 'మండలాధీశుడు', 'గండిపేట రహస్యం' వంటి సినిమాలు ఎన్టీఆర్‌ తీరుపై ఎక్కుపెట్టిన అస్త్రాలు. ఆయన చుట్టూ ఉండిన వారిపై సంధించిన అస్త్రాలు.

ఎన్టీఆర్‌పై సెటైర్‌ అనగానే.. ఏదో అడ్డగోలుగా తీసిన సినిమాలు ఏమీకావవి. ఎన్టీఆర్‌ తీరుపై పడ్డ బలమైన సెటైర్లు, అంతేగాక కడుపుబ్బా నవ్వుకోవడానికి తగిన మెటీరియల్స్‌. ఎన్టీఆర్‌ మేనరిజమ్స్‌ను అనుకరిస్తూ.. ఆయన పాత్రధారులు చేసిన విన్యాసాలు. వీటిల్లో ఒక సినిమాకు సీనియర్‌ నటుడు ఎం.ప్రభాకర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కాంగ్రెస్‌వాది అయిన ప్రభాకర్‌ రెడ్డి ఎన్టీఆర్‌తో అనేక సినిమాల్లో నటించిన నటుడే. కాంగ్రెస్‌ అధికారంలో లేని సమయంలోనే ఈ సినిమాలన్నీ విడుదల అయ్యాయి. ఇవి ఎన్టీఆర్‌ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పనక్కర్లేదు.

ఈ సినిమాలు వచ్చినప్పుడు.. వీటిని ఆడనివ్వం అంటూ అప్పటి అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రచ్చలు చేసిన సందర్భాలు లేకపోలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఈ తీరును నిరసిస్తూ రోడ్డుకు ఎక్కి ఈ సినిమాలను విడుదల చేయించుకోగలిగారు. ఇక సెన్సార్‌ బోర్డుకు సంబంధించిన సమస్యలూ లేకపోలేదు. అప్పటికి సెన్సార్‌ వ్యవహారాలు పూర్తిగా కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం. దీంతో సీబీఎఫ్సీ దగ్గర నుంచి సులువుగా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రిపై గట్టి సెటైర్లు ఉన్నా.. ఈ సినిమాలకు సెన్సార్‌ అడ్డంకి తప్పడానికి కారణం కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటమే అని అంటారు. అయితే ఈ సినిమాలను ఎన్టీఆర్‌ లైట్‌ తీసుకున్నాడు. వీటిని యాక్సెప్ట్‌ చేశాడు. అది ఆయన గొప్పదనం అనిచెప్పాలి. ఈ సినిమాల్లో ఎన్టీఆర్‌ పాత్రలను చేసిన కోట శ్రీనివాసరావు, థర్టీ ఇయర్స్‌ పృథ్వీ వంటి వారిపై భౌతికదాడులు కూడా జరిగాయట. అయితే వారు ఈ విషయంలో ఎన్టీఆర్‌నే కలిసి తమను కాపాడాలని కోరారని వాళ్లే చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌ నుంచి వారికి అభయం లభించింది.

అయితే ఎన్టీఆర్‌ అయినా తనమీద పడ్డ సెటైర్‌ను యాక్సెప్ట్‌ చేశాడు కానీ.. ఆయన వారసులు మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు నందమూరి, నారా ఫ్యామిలీ కనుసన్నల్లోనే ఎన్టీఆర్‌ బయోపిక్‌ స్క్రిప్ట్‌ రెడీ అయి ఉంటుంది. అంతా గొప్పే.. అన్నట్టుగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఉండవచ్చు. అలాగే చంద్రబాబు భజన కూడా భారీఎత్తున ఉండవచ్చు. చంద్రబాబే ఈ మధ్య చెప్పుకున్నాడు.. ఎన్టీఆర్‌ను తనే రాజకీయాల్లోకి రమ్మన్నాను అని. బహుశా సినిమాలో కూడా అదే విషయాన్ని పెట్టినా పెద్దగా ఆశ్చర్యం అక్కర్లేదు. అధిష్టానం ఆదేశిస్తే మామపై పోటీకి సై అని చంద్రబాబు అప్పట్లో చేసిన ప్రకటననూ ఇందులో చూపించి ఉంటారని అనుకోవడానికి వీల్లేదు.

ఇప్పుడు చంద్రబాబు పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్నాడని, ఇప్పటికే లుక్‌ను కూడా వదిలారు. అయితే ఎన్టీఆర్‌పై వచ్చిన సెటైరిక్‌ సినిమాల్లో చంద్రబాబు ప్రస్తావన ఉంది. ఒక సినిమాలో నటుడు నరసింహరాజు చంద్రబాబు పాత్రను చేశాడు. 'ఇంద్రబాబు' అంటూ ఆ పాత్రకు పేరు పెట్టారు. మరో సినిమా అప్పటి బీభత్సమైన విలన్‌ ప్రదీప్‌ శక్తి చంద్రబాబు పాత్రను చేశాడు. అందులో కూడా 'ఇంద్రబాబు'గానే చూపించారు. ఆ సినిమాల్లో ఇంద్రబాబుకు స్త్రీ లోలత్వాన్ని చూపించారు. అది కూడా తీవ్రస్థాయిలో!

'మండలాధీశుడు', 'గండిపేట రహస్యం' వంటి సినిమాలు వచ్చి దశాబ్దాలు గడిచినా.. అవి చాలాకాలం పాటు వీక్షించడానికి అవకాశం లేకపోయింది. 24గంటల మూవీ ఛానళ్ళు వచ్చినా.. వాటిని ప్రసారం చేయడానికి టీవీ ఛానళ్ళు సాహసించలేదు. సీడీలు, డీవీడీలు కూడా దొరికేవి కావు. అయితే యూట్యూబ్‌ పుణ్యమా అని ఇలాంటి సినిమాలు ధైర్యంగా నెట్లోకి ప్రవేవించాయి. లక్షల కొద్దీ వ్యూస్‌ను పొందుతున్నాయి.