Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ కు మరోసారి ఓటీటీనే దిక్కు!

టాలీవుడ్ కు మరోసారి ఓటీటీనే దిక్కు!

మొదటిసారి కరోనా వచ్చినప్పుడు చాలామందికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓవైపు థియేటర్లు బంద్ అయ్యాయి. తీసిన సినిమాను అట్టిపెట్టుకోవాలా లేక ఓటీటీకి వదిలించుకోవాలో తెలియని డైలమా. చివరికి దిల్ రాజు లాంటి అనుభవం ఉన్న నిర్మాతలు కూడా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఈసారి అలాంటి అనుమానాలు, డైలమాలు లేవు. టాలీవుడ్ కు మరోసారి ఓటీటీనే దిక్కు కాబోతోంది.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లేదు. థియేటర్లు కూడా బంద్ అవ్వవు. మహా అయితే ఆక్యుపెన్సీ కాస్త తగ్గిస్తారేమో. అయినప్పటికీ చాలామంది నిర్మాతలు తమ సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి మొగ్గుచూపడం లేదు. ఈసారి ప్రేక్షకులే స్వీయ నియంత్రణ విధించుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

అవును.. రాబోయే రోజుల్లో థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ సిల్వర్ స్క్రీన్ కు దూరం కాగా.. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కామన్ ఆడియన్స్ కూడా థియేటర్ వైపు వెళ్లడం తగ్గించేస్తున్నాడు. ఈ విషయం గ్రహించిన చాలామంది నిర్మాతలు తెలివిగా తమ సినిమాల్ని వాయిదా వేస్తున్నారు. మరికొంతమంది నిర్మాతలు మాత్రం అయినకాడికి ఓటీటీకి అమ్ముకోవాలని ఫిక్స్ అయ్యారు.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కు చెందిన మధ్యవర్తులు ఇప్పటికే ఇండస్ట్రీలో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిపోయారు. కొన్ని సినిమాల్ని డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఒప్పించేలా చర్చలు ప్రారంభించారు. వీటిలో కొన్ని మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డైరక్ట్ రిలీజ్ కింద వస్తున్నాయని ఏది పడితే ఆ సినిమా తీసుకోవడానికి ఇవి మొగ్గుచూపడం లేదు. అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలకైతే V, నిశ్శబ్దం లాంటి సినిమాలు చాలా పాఠాలు నేర్పించాయి.

సో.. ఈసారి ఈక్వేషన్స్ మారబోతున్నాయి. లెక్కలు తారుమారు కాబోతున్నాయి. ఓ రేంజ్ ఉన్న హీరో సినిమాలకు మాత్రమే ఓటీటీలో గిరాకీ ఉంటోంది. తక్కువ రేటుకు వస్తున్నాయని చిన్న సినిమాలు కొనే పరిస్థితి ఉండదు. మహా అయితే 'పే పెర్ వ్యూ' (చూసిన దానికి డబ్బులు) పద్ధతి కింద మాత్రమే చిన్న సినిమాలు ఓటీటీకి వెళ్తాయి. అయినా తప్పదు, టాలీవుడ్ కు ఇప్పుడు మరోసారి ఓటీటీనే పెద్ద దిక్కుగా మారబోతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?