Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్ర‌త్య‌క్ష సాక్షులే రూపొందించిన వార్ డ్రామా 'ది పియానిస్ట్'

ప్ర‌త్య‌క్ష సాక్షులే రూపొందించిన వార్ డ్రామా 'ది పియానిస్ట్'

రెండో ప్ర‌పంచ యుద్ధ మార‌ణ‌హోమం గురించి హాలీవుడ్ లో ఎన్నో సినిమాలువ‌చ్చాయి. వాటిల్లో బోలెడ‌న్ని క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఆంగ్ల ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు త‌మ సృజ‌న‌ల్లో రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యాన్ని వాడ‌టం చాలా స‌హ‌జంగా జ‌రుగుతూ వ‌స్తోంది గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో. ప్రేమ‌క‌థ‌ల‌కు కూడా రెండో ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యాన్ని అలా ట‌చ్ చేస్తూ ఉంటారు. ' ది నోట్ బుక్' వంటి రొమాంటిక్ డ్రామాలో కూడా కాస్త ఆ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. ఇక పూర్తిగా యుద్ధ నేప‌థ్యం నుంచినే బోలెడ‌న్ని సినిమాల వ‌చ్చాయి, వ‌స్తున్నాయి.

అలాంటి వాట‌న్నింటిలో కూడా 'ది పియానిస్ట్'. ఈ సినిమా అన్ని సెకెండ్ వ‌ర‌ల్డ్ వార్ సినిమాల్లో కెళ్లా ప్ర‌‌త్యేకం. ఎందుకంటే.. రెండో ప్ర‌పంచ యుద్ధ సంఘ‌ట‌న‌ల‌ను చాలా ద‌గ్గ‌ర నుంచి చూసిన ఇద్ద‌రు ఈ సినిమా వెనుక కీల‌క వ్య‌క్తులు. త‌మ జీవితంలో ఎదురైన నాటి అనుభ‌వాల‌ను వారి లో ఒక‌రు గ్రంథ‌స్తం చేయ‌గా, ఆ పుస్త‌కాన్ని సినిమాగా మలిచిన వ్య‌క్తి కూడా ఆ మార‌ణ‌హోమాన్ని అనుభ‌వ‌పూర్వ‌కంగా చూసిన వ్య‌క్తే. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆ హోలోకాస్ట్ లో స‌ర్వాన్నీ కోల్పోయి, త‌ను మాత్రం బ‌య‌ట‌ప‌డిన ఒక వ్య‌క్తి త‌మ వ్య‌థ‌ను పుస్త‌క‌రూపంలో ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌గా, మ‌రో స‌ర్వైవ‌ర్ సినిమా రూపంలో  దానికి విస్తృత ప్ర‌చారాన్ని క‌ల్పించాడు.

వ్లాదిస్లా ష్పీల్మ‌న్.. రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో నాజీల అరాచ‌కానికి త‌న కుటుంబాన్నీ, స‌ర్వాన్నీ కోల్పోయిన ఒక పియానిస్ట్. అత‌డి జీవితంలో ఆ ఐదేళ్ల వ్య‌థ‌లే ఈ సినిమా. రెండో ప్ర‌పంచ వ్య‌థ‌ల గురించి బాధితులే రాసిన పుస్త‌కాల్లో అత్యంత గొప్ప‌దిగా నిలుస్తుంది 'డైరీ ఆఫ్ ఏ యంగ్ గ‌ర్ల్'. తన పుస్త‌కానికి ద‌క్కిన గుర్తింపు గురించి తెలుసుకునే అవ‌కాశం ద‌క్క‌లేదు యాన్ ఫ్రాంక్ కు. ఎందుకంటే త‌న డైరీలు ప్ర‌పంచపు వెలుగును చూడానికి ముందే ఆమె ప్రాణాల‌ను కోల్పోయింది. అయితే వ్లాదీ రాసిన త‌న ఆటోబ‌యోగ్ర‌ఫిక‌ల్ వార్ డ్రామా మాత్రం అత‌డి అవ‌గాహ‌న‌లోనే ప్ర‌చురితం అయ్యింది. ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయ్యింది. అత‌డు చ‌నిపోయిన రెండేళ్ల‌కు సినిమాగా వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించి మ‌రో కీల‌క‌మైన వ్య‌క్తి ద‌ర్శ‌కుడు రోమ‌న్ పొలాన్స్కీ. ఈ ఫ్రెంచి యూధుడు కూడా రెండో ప్ర‌పంచ యుద్ధం స‌ర్వైవ‌ర్ల‌లో ఒక‌రు. నాజీలు యూధులపై సాగించిన దాష్టీకాల‌ను చూసిన వాడు, భ‌రించిన వాడు. వీరి కుటుంబం పోలాండ్ లో నివ‌సిస్తున్న స‌మ‌యంలోనే ఆ దేశాన్ని జ‌ర్మ‌నీ ఆక్ర‌మించింది. పోలాన్స్కీకి ఆరేళ్ల వ‌య‌స‌ప్పుడు అత‌డి తండ్రిని నాజీలు బ‌లవంతంగా ఈడ్చుకెళ్లి క్యాంపుల‌కు త‌ర‌లించారు. ఇత‌డి త‌ల్లిని నాజీలు దారుణంగా హ‌త‌మార్చారు. ఆరేడేళ్ల వ‌య‌సులో త‌న త‌ల్లిదండ్రుల‌ను ఏదాష్టీకంలో అయితే కోల్పోయాడో.. బ‌హుశా ఆ వేధ‌న గురించి వివ‌రించి చెప్ప‌డానికి పొలాన్క్సీకి మించి అర్హ‌త గ‌ల వారు ఉండ‌రేమో.

రెండో ప్ర‌పంచ యుద్ధ వినాశ‌నం నుంచి బ‌య‌ట‌ప‌డిన గొప్ప క్రియేట‌ర్ ల‌లో ఒక‌రు పొలాన్క్సీ. ఇత‌డు తెర‌కెక్కించింది కేవ‌లం ఆ ప్ర‌పంచ యుద్ధ‌పు దారుణాల‌నే కాదు. ప్ర‌పంచసినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన బెస్ట్ హార‌ర్ సినిమాల్లో ఒక‌టిగా పేరున్న 'రోజ్ మెర్రీస్ బేబీ' ద‌ర్శ‌కుడిత‌ను! చిన్న పాటి ర‌క్తం మ‌ర‌క కూడా చూప‌కుండా, దెయ్యాలు, భూతాలంటూ బెద‌ర‌గొట్ట‌కుండా.. ప్రేక్ష‌కుడిని విస్మ‌యానికి గురి చేసే సినిమా 'రోజ్ మెర్రీస్ బేబీ'. హార‌ర్ కాన్సెప్ట్ ల‌ను తెర‌కెక్కించ‌డంలో అందె వేసిన చేయి క‌లిగిన పొలాన్్స‌కీ ద‌ర్శ‌కుడిగా మారిన ద‌శాబ్దాల త‌ర్వాత 'ది  పియానిస్ట్' ను తెర‌కెక్కించాడు. 

ఏ మాత్రం శ్రుతి త‌ప్పినా.. ప‌క్కా డాక్యుమెంట‌రీగా మారే క‌థ ఇది. సినిమా ఆసాంతం ఒకే వ్య‌క్తి అనుభ‌వం. ప్రతి సీన్ లోనూ అత‌డే తెర మీద క‌నిపించాలి. డేట్ల వారీగా, సంవ‌త్స‌రాల వారీగా అత‌డి వ్య‌థ‌ను వివ‌రించే క‌థ. ఇలా చూస్తే ఇదొక డాక్యుమెంట‌రీ. అయితే.. పియానిస్ట్ వ్య‌థ‌ను భావోద్వేగ పూరితంగా వివ‌రించాడు. ఒక ద‌శ‌లో 'ఇంకెంత సేపు.. ' అనే ప్ర‌శ్న ప్రేక్ష‌కుడికి వ‌చ్చినా, తెలుసుకోవాల్సిన చరిత్ర కావ‌డంతో ఈ సినిమా క్లాసిక్ గా మారింది. ఆరేడేళ్ల వ‌య‌సులో త‌ను చూసిన ఘ‌ట‌న‌లు పొలాన్క్సీ చేత ఈ సినిమాను మ‌రింత ప్ర‌భావాత్మ‌కంగా చూపించి ఉండ‌వ‌చ్చు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. వ్లాదిస్లా ష్పీల్మ‌న్ ఒక పొలిష్ పియానిస్ట్. వార్సా రేడియోలో ప‌ని చేస్తూ ఉంటాడు. అప్ప‌టికే రెండో ప్ర‌పంచ యుద్ధం మొద‌లై ఉంటుంది. పోలాండ్ ను ఒక‌వైపు సోవియ‌ట్ సేన‌లు మ‌రోవైపు నాజీ సేన‌లు ఆక్ర‌మిస్తూ ఉంటాయి. వార్సా న‌గ‌రాన్ని ముందుగా చేరుకుంటుంది నాజీ సేన‌. దీంతో అక్క‌డ హిట్ల‌ర్ చ‌ట్టాలు అమ‌లు కావ‌డం ప్రారంభం అవుతుంది. నాజీ సేన‌ల తొలి టార్గెట్ యూధులు. పోలిష్ క్రిస్టియ‌న్ల‌కు కొంత స్వ‌తంత్రాన్ని ఇచ్చే నాజీలు.. యూధుల‌ను మాత్రం బానిస‌లుగా మారుస్తాయి. నాజీ సేన‌లు రావ‌డంతోనే..  యూధులు ప్ర‌త్యేక‌మైన గుర్తులు ధ‌రించి రోడ్ల మీద రావాల‌నే నియామ‌న్ని పెడ‌తాయి. యూధులకు రెస్టారెంట్ల‌కు ప్ర‌వేశం లేద‌ని బోర్డులు పెడ‌తారు. రోడ్ల మీద ఎదురుప‌డే నాజీల‌కు ప్ర‌ణామం చేయాల‌ని, రోడ్డు మీద కూడా యూధులు స్వేచ్ఛ‌గా న‌డిచేందుకు వీల్లేకుండా బోలెడ‌న్ని రూల్స్ పెడ‌తారు. 

వాటిని అత్యంత కిరాత‌కంగా అమ‌లు చేస్తూ ఉంటారు. ప్ర‌శ్నించే, ఆ రూల్స్ ను అతిక్ర‌మించే యూధుల‌పై దారుణమైన దాడిని కొన‌సాగిస్తూ.. హిట్ల‌ర్ నియంతృత్వాన్ని పోలాండ్ లో అమ‌లు చేస్తాయి నాజీ సేన‌లు. అలాగే యూధుల‌కు ఉపాధి లేకుండా చేస్తారు. వారిని అన్ని ఉద్యోగాల నుంచి తొల‌గిస్తారు.

త‌లా ఒక ప‌ని చేసుకుని బ‌తుకుతూ ఉంటుంది వ్లాదీ కుటుంబం. అంద‌రికీ ప‌ని లేకుండా పోతుంది. చేతిలో ఉన్న పొదుపు మొత్తాలు ఖ‌ర్చైపోతాయి. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే బంగాళాదుంప‌ల‌ను తింటూ రోజులు గ‌డుపుతూ  ఉంటారు. బ్రిట‌న్ సేన‌లు రాక‌పోతాయా.. నాజీ ల‌ను త‌ర‌మ‌క‌పోతాయా.. అనే ఆశ‌ల‌తో బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతుంటుంది ఆ కుటుంబం. ఈ ప‌రిస్థితుల్లో.. మ‌రింత క‌ఠిన‌మైన ప‌రిస్థితులు వారికి ఎదుర‌వుతాయి. యూధు కుటుంబాల‌న్నింటినీ తాము ఉన్న చోట నుంచి ఖాళీ చేయిస్తుంది నాజీ సైన్యం. నివాస‌యోగ్యానికి అనుకూలంగా లేని మురికివాడ‌ల త‌ర‌హా కాల‌నీల‌కు వారిని త‌ర‌లిస్తుంది. అక్క‌డ నుంచి వారిని క్యాంపుల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తుంది. ఈ స‌న్నివేశాల‌న్నీ నాడు యూధులు అనుభ‌వించిన అత్యంత దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌డ‌తాయి. వారి నైరాశ్యం, వారు అనుభ‌వించి న‌ర‌కం, చిన్న పిల్లలు, వృద్ధులు, ఆడ‌, మ‌గ అనే తేడాల్లేకుండా.. నాజీ సేన‌లు యూధుల విష‌యంలో ఎంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించాయో ఈ స‌న్నివేశాల్లో క‌ళ్ల‌కు క‌ట్టారు.

పియానిస్ట్ కుటుంబం మొత్తం క్యాంపుల‌కు త‌ర‌లుతుండ‌గా.. వారంద‌రూ కోరుకునేది తామంతా ఒకే క్యాంపులో ఉంటే చాల‌నేది. నాజీ సేన‌ల‌కు స‌రెండ‌ర్ అయిన పోలిష్ పోలీసుల్లో త‌న‌కు తెలిసిన వారి ద్వారా త‌న కుటుంబాన్ని క్యాంపుల‌కు త‌ర‌లించ‌కుండా ప్ర‌య‌త్నాలు చేస్తాడు పియానిస్ట్. అయితే అది సాధ్య ప‌డ‌దు కానీ, క్యాంపుల‌కు యూధుల‌ను రైళ్ల‌లో తీసుకెళ్లే స‌మ‌యంలో ఈ పియానిస్టును మాత్రం వారి నుంచి వేరు చేస్తాడు ఒక పోలీస్.

సుమారు రెండేళ్ల‌కు పైగా పియానిస్ట్ ఎక్క‌డ ఎలా దాక్కొని గ‌డిపాడ‌నే వివ‌రించే సీన్లో క్లైమాక్స్ కు చేరే కొద్దీ కాస్త బోర్ కొడ‌తాయి. అయితే వాస్త‌వంగా అనుభ‌వించి, చూసిన ఈ సినిమా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుల‌కు మాత్రం త‌మ బోటి వారి వ్య‌థ‌ను ప్ర‌పంచానికి అర్థ‌మ‌య్యే చేసే ప్ర‌క్రియను సాగ‌దీసినా ఫ‌ర్వాలేద‌నిపించి ఉండ‌వ‌చ్చు.

క్లైమాక్స్ లో మ‌రో క‌ఠిన‌మైన వాస్త‌వాన్ని కూడా ప్ర‌స్తావించి, గొప్ప ఫీల్ తో సినిమాను ముగించారు. బాంబు దాడుల్లో కూలిన ఇళ్ల మ‌ధ్య‌న ర‌హ‌స్యంగా బ‌తుకుతూ వ‌చ్చిన పియానిస్ట్ ఆఖ‌రికి జ‌ర్మ‌న్ సేన‌ల‌కు దొర‌క‌నే దొరుకుతాడు. ఆ స‌మ‌యంలో ఒక జ‌ర్మ‌న్ ఉన్న‌తాధికారి అత‌డి ప‌ట్ల కాస్త జాలి చూపిస్తాడు. కాస్త తిండి పెట్టి, కొన్నాళ్లు దాచి పెడ‌తాడు. మ‌రోవైపు నాజీ వ్య‌తిరేక సేన‌లు పోలాండ్ కు విముక్తి క‌ల్పిస్తాయి. నాజీ సైన్యాన్ని త‌మ అదుపులోకి తీసుకుంటాయి. అలా పియానిస్ట్ కు కూడా విముక్తి ల‌భిస్తుంది. అత‌డికి యుద్ధం ఆఖ‌రి రోజుల్లో ఆశ్ర‌యం ఇచ్చిన జ‌ర్మన్ సైన్యం ఉన్న‌తాధికారి సోవియ‌ట్ సేన‌ల బంధీగా మార‌తాడు. 

పియానిస్ట్ ఇప్పుడు స్వ‌తంత్రం క‌లిగిన వ్య‌క్తి, నాజీ అధికారి బంధీ! అప్ప‌టికే వార్సా రేడియో స్టేష‌న్లో మ‌ళ్లీ పియానిస్ట్ గా ప్ర‌స్థానం ప్రారంభించిన వ్లాదీకి ఒక వ్య‌క్తి ద్వారా త‌న ప‌రిస్థితిని తెలియ‌జెప్పుతాడు ఆ నాజీ అధికారి. త‌న‌కు చావు త‌ప్ప‌ని క్ష‌ణంలో త‌న‌ను ర‌క్షించిన ఆ జ‌ర్మ‌న్ అధికారి సోవియ‌ట్ సేన‌ల బంధీగా ఉన్నాడ‌ని తెలిసి.. అక్క‌డ‌కు వ‌చ్చిన పియానిస్ట్ కు అత‌డిని రక్షించే అవ‌కాశం ద‌క్క‌దు. అప్ప‌టికే నాజీ సైనికుల‌ను సోవియ‌ట్ సైన్యం తీసుకెళ్లిపోయి ఉంటుంది. సోవియ‌ట్ క్యాంపులోనే జ‌ర్మ‌న్ అధికారి త‌న ప్రాణాల‌ను కోల్పోయాడ‌ని ఆ త‌ర్వాత వాస్త‌వ చ‌రిత్ర చెబుతుంది. యుద్ధం అంటే ఎంత భ‌యంక‌ర‌మైన‌దో, బ‌ల‌వంతుడు-బ‌ల‌హీనుడు అనే తేడాల్లేకుండా యుద్ధం ఎప్పుడు ఎవ‌రినైనా ఎలా బాధితుడిని చేయ‌గ‌ల‌దో చాటి చెబుతూ ఈ సినిమా ముగుస్తుంది.

-జీవ‌న్ రెడ్డి.బి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?