cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

క‌ష్ట‌కాలంలో వ‌దిలేసిన ప‌వ‌న్‌

క‌ష్ట‌కాలంలో వ‌దిలేసిన ప‌వ‌న్‌

క‌ష్ట‌కాలంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌దిలేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్రం సిద్ధం కావ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంది.

బీజేపీపై వ్య‌తిరేక‌త‌, మిత్ర‌ప‌క్ష‌మైన త‌మ‌పై కూడా ప‌డుతోంద‌ని జ‌న‌సేన ఆందోళ‌న చెందుతోంది. ఈ నేప‌థ్యంలో విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ విష‌య‌మై పున‌రాలోచించాల‌ని , కార్మికుల ప్ర‌యోజ‌నాల విష‌య‌మై ఆలోచించాల‌ని ఇటీవ‌ల కేంద్రం పెద్ద‌ల‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ విన్న‌వించారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌ను నిరసిస్తూ ఉద్య‌మ బాట ప‌ట్ట‌డం బీజేపీకి త‌ల‌నొప్పిగా మారింది. అస‌లే ఏపీలో ఒక్క‌శాతం లోపు ఓటు బ్యాంకు క‌లిగిన బీజేపీ, 2024 అధికార‌మే ల‌క్ష్యంగా బ‌ల‌ప‌డాల‌ని ప్రణాళిక‌లు ర‌చిస్తున్న స‌మ‌యంలో, విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఆ పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు నినాదంతో సాధించుకున్న ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కార్పొరేట్ సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్టాల‌నే ఆలోచ‌న‌పై స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో ఏపీలో బీజేపీ ఒంట‌రి అయ్యింది. త‌మ‌పై వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఎక్క‌డ చూపుతుందోన‌నే భ‌యంతో బీజేపీకి జ‌న‌సేన దూరం దూరంగా ఉంటోంది.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్  మాట‌లు వింటే... ఆ పార్టీ దీన‌స్థితిని తెలుసుకోవ‌చ్చు. 

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రధాన పోటీదారు అవుతుందన్న భయంతో వైసీపీ, టీడీపీ విశాఖలో డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మార్పిళ్లు, ఆలయాలపై దాడుల గురించి ప్రశ్నించకూడదనే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమను ఏకాకిని చేసేందుకు కుట్రపన్నాయని వారు మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌రణ అంశం తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అస‌లు బీజేపీతో త‌మ‌కెలాంటి సంబంధం లేన‌ట్టు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మొద‌లుకుని ఆ పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని జ‌న‌సేన నాయ‌కులు త‌ప్పు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంతో తాము ఒంట‌రి అయ్యామ‌నే ఆవేద‌న బీజేపీ నేత‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అస‌లే తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో బీజేపీ రాష్ట్ర నేత‌ల వైఖ‌రిపై జ‌న‌సేనాని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ తెర‌పైకి రావ‌డంతో బీజేపీని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన అంట‌రాని పార్టీగా చూడ‌డం అన్నిటికీ మించిన కీల‌క అంశంగా చెప్పొచ్చు.

 


×