పవన్ కళ్యాణ్ గారు! నిద్రపోతున్నారా?

అయ్యా పవన్ కళ్యాణ్ గారు! మీరు సుప్రసిద్ధ నటులు. సినిమాకి 50 కోట్లు జీతం పుచ్చుకునే స్థాయి తమది. పైగా మీరిప్పుడు రాజకీయనాయకులు. ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు. ఇన్ని క్వాలిఫికేన్స్ ఉన్న మీరు…

అయ్యా పవన్ కళ్యాణ్ గారు! మీరు సుప్రసిద్ధ నటులు. సినిమాకి 50 కోట్లు జీతం పుచ్చుకునే స్థాయి తమది. పైగా మీరిప్పుడు రాజకీయనాయకులు. ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు. ఇన్ని క్వాలిఫికేన్స్ ఉన్న మీరు ఆ.ప్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్స్ విషయంలో కటువుగా వ్యవహరిస్తుంటే మీరు నోరు విప్పరేం? కొంపదీసి నిద్రపోతున్నారా?

ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్స్ కి థియేటర్స్ నడపడం అసాధ్యం అంటున్నారు ఎగ్జిబిటర్స్. ఈ దెబ్బకి థియేటర్ బిజినెస్ కుప్పకూలి ఓటీటీల మీదే చిత్రపరిశ్రమ ఆధారపడవలసి వస్తుంది. దాని వల్ల బడ్జెట్లు పడిపోతాయి. తమరి రెమ్యునరేషన్ కూడా పడుతుంది. పైగా ఓటీటీలని అస్సలు నమ్మలేం. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన సామెత లెక్కన త్వరలో ఎంత పోటీ ఉన్నా ఓటీటీలు ఇప్పుడు చెల్లిస్తున్నంత చెల్లించని పరిస్థితి నెలకొనవచ్చు. చచ్చినోడి పెళ్లికే వచ్చిందే కట్నం లాగ జనాన్ని మెప్పించిన సినిమా తీసినా ఓటీటీ హక్కుల అమ్మకం ద్వారా వచ్చే సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి రావొచ్చు. అదే థియేటర్ అయితే కలెక్షన్స్ రూపంలో కథ వేరేగా ఉంటుంది. ఎగ్జిబిటర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, టెక్నీషియన్స్, నటీనటులు ఇలా అందరికీ మరిన్ని మంచి అవకాశాలు దొరుకుతాయి. 

ఇవన్నీ మీకు అరటిపండు ఒలిచి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలియక కాదు. ఎందుకులే అని నోరు విప్పకుండా మీరు కూర్చోవడం మాత్రం అస్సలు బాలేదు. సినిమా రంగానికి చెందిన వారు దీని మీద గొడవ చేయకపోవడానికి ఏవో భయాలుండొచ్చు. మీకేం పోయింది? మీరు రాజకీయాల్లో ఉన్నారు? పైగా సినిమా రంగానికి చెందిన వ్యక్తి…మీరు నోరు చేసుకోకపోతే ఎలా? ఎవరి తరపున దేని కోసం పోరడడానికి రాజకీయాల్లోకొచ్చారు మీరు? ముందు మీకు ఇన్నాళ్లూ అన్నం పెట్టిన , పెడుతున్న సినిమా హాల్స్ గురించి పోరాడండి. 

ఎప్పటికైనా ప్రభుత్వం దిగిరాక తప్పదు. కాస్త ఎగ్జిబిటర్స్ కి ఊపిరాడేలా నిర్ణయం తీసుకోకా తప్పదు. ఇప్పుడే మీరు పోరాటం మొదలుపెడితే వచ్చే ఫలితాన్ని మీ ఖాతాలోనే వేసుకోవచ్చు. ఈ మాత్రం సలహా చెప్పేవారు కూడా మీ పక్కన లేరా?

ఇంత మౌనమైతే ఎలా పవన్ గారు? మీరు ఉద్యమం మొదలుపెడితే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్సంతా మీ వెంట నడుస్తారు. మీ పోరాటానికి వెన్నుదన్నవుతారు. సినిమా హాల్ ని బతికించే ప్రయత్నం చేయండి. కనీసం ఈ ఒక్కసరైనా సరైన ఉద్యమం చేసి నాయకుడనిపించుకోండి. 

“సినిమాపై ప్రభుత్వ పెత్తనం సరికాదు” అనే టైటిల్ తో రెండ్రోజుల క్రితం ఇదే వెబ్సైటులో “పేరు చెప్పి ప్రభుత్వానికి శత్రువుకాలేని ఒక నిర్మాత” గారి ఆర్టికల్ చదివాను. అలాంటి వారే ఎక్కువమంది ఉన్నారు. ఎవరైనా నాయకుడు ముందుకొచ్చి ఉద్యమం మొదలుపెడితే ఆ నిర్మాతకి కూడా పేరు చెప్పుకునే ధైర్యం వస్తుంది. ప్రస్తుతానికి నాది కూడా ఆ నిర్మాత గారి పరిస్థితే. 

పేరు చెప్పుకోవడానికి భయపడే ఒక ఆంధ్రా ఎగ్జిబిటర్