Advertisement


Home > Movies - Movie News
పవన్ బండారం బైటపెట్టిన రేణుదేశాయ్

రేణుదేశాయ్ నోరు విప్పింది. ఇన్నాళ్లూ భర్త పవన్ తో విడాకులు తీసుకోడానికి గల కారణాలను ఎక్కడా, ఎప్పుడూ బయటపెట్టని రేణు, తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో బరస్ట్ అయింది. 11 ఏళ్ళు కాపురం చేసిన భర్త, భార్యకు తెలియకుండా వేరొకరితో సంబంధం పెట్టుకొని ఆమెకు బిడ్డను కంటే.... భార్య పరిస్థితి ఏమిటి...? అదే తన పరిస్థితి అని కుండబద్దలు కొట్టింది. 

ఆ స్థితిలో ఏ భార్య అయినా ఏం చేస్తుంది, ఒకవేళ మీరే అదే స్థితిలో ఉంటే మీకు నా బాధ తెలుస్తుందని అంది రేణు. పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ విడాకుల తర్వాత ఎవరూ పవన్ ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. కనీసం రేణు దేశాయ్ కి మద్దతుగా కూడా ఎవరూ మాట్లాడలేదు, ఎందుకంటే విడాకులకు గల కారణం బైటకు రాలేదు. 

ఇద్దరూ పరస్పర అంగీకారంతో డైవోర్స్ తీసుకుని ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. బిడ్డలిద్దరూ రేణు దగ్గరే పెరుగుతున్నారు, అప్పుడప్పుడూ పవన్ దగ్గరకు వచ్చి వెళ్తుంటారు. దీంతో పబ్లిక్ కి కూడా ఇదో కుటుంబ సమస్యగా కాకుండా కుటుంబంలో జరిగిన సంఘటనగా మాత్రమే గుర్తుంది. అయితే ఆ విడాకుల వెంటనే పవన్ మరో వివాహం చేసుకోవడం, అప్పటికే వారిద్దరికీ ఓ బిడ్డ ఉండటం మాత్రం కాస్త సంచలనం కలిగించింది. కానీ రేణుదేశాయ్ అప్పుడు కూడా నోరెత్తలేదు. 

అయితే ఇటీవల రేణు తనకి కూడా తోడు కావాలని కోరుకుంది. బిడ్డల అంగీకారం తోటే ఆమె వివాహానికి సిద్ధమైంది, నిశ్చితార్ధం జరిగింది. రేణుతో విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకున్నా సైలెంట్ గా ఉన్న వారంతా.. రేణు పెళ్లి చేసుకోబోతోందని తెలిసే సరికి షాక్ అయ్యారు. రేణుదేశాయ్ ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండాలని అనుకున్నారేమో.. సోషల్ మీడియాలో ఆమె నిర్ణయాన్ని తప్పుబడుతూ పోస్టింగ్ లు మొదలుపెట్టారు. ఇటీవల ఈ టార్చర్ బాగా పెరిగే సరికి రేణు దేశాయ్ సోషల్ మీడియా నుంచి బైటకి వచ్చేసింది. ఇప్పుడిలా ఓ ఇంటర్వ్యూలో మాత్రం విడాకులకు కారణం పవన్ కల్యాణ్ అని ప్రకటించి సంచలనం సృష్టించింది. 

అవును వివాహ బంధంలో ఉండి కూడా భార్యకి తెలియకుండా భర్త మరో మహిళతో బిడ్డను కంటే, ఆ భార్య ఏంచేయాలి, మొగుడ్ని వెనకేసుకుని రావాలా. ఆయన చేసిన పనిని మెచ్చుకుని సవతిని, వారికి పుట్టిన బిడ్డని ఇంటికి తెచ్చుకోవాలా. పౌరుషం ఉన్న మహిళ కాబట్టే మొగుడు చేసిన పనిని నిలదీసింది. తనతో కలసి ఉండటానికి వీల్లేదని చెప్పింది. విడాకులు తీసుకుని దూరంగా ఉంది. ఇప్పుడు తనకి, తన బిడ్డలకి తోడు కావాలి కాబట్టి మరో వివాహానికి సిద్ధపడింది. ఇప్పుడు చెప్పండి రేణు దేశాయ్ చేసిన పనిలో తప్పుందా? పవన్ కల్యాణ్ ని మీరు సమర్థిస్తారా..?