‘మా’ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను మించి వివాదం నడుస్తోంది. 900 ఓట్లున్న ‘మా’ సంస్థకు అధ్యక్షుడితో సహా ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలో చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శలను వింటుంటే రాజకీయ పార్టీలే ఎంతో నయమనిపించేలా ఉన్నాయి.
తాజాగా మంచు ప్యానల్‌పై ప్రధాన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేయడంతో పాటు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల తీరుపై ఆవేదనతో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
గెలుపు కోసం ఇంత దిగజారుతారా? అని ఆయన నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం సరికొత్త పరిణామంగా చెప్పొచ్చు.
ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్ ఉల్లంఘిస్తోందని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని ఆయన చెప్పారు. ఈ మేరకు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని మంచు విష్ణు అంటున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణపైనే సమస్య తలెత్తినట్టైంది. ఇదిలా ఉండగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు అనంతరం ప్యానల్ సభ్యులతో కలిసి ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు.
క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజు గారి 500 రూపాయలను కూడా మంచు ప్యానల్ కట్టిందన్నారు. అలాగే మహేశ్ బాబు తండ్రి, సీనియర్ హీరో ఘట్టమనేని కృష్ణ, శరత్‌బాబు, పరుచూరి బ్రదర్స్, చెన్నైలో ఉంటున్న శారద, లక్ష్మి తదితరుల డబ్బును కూడా మంచు ప్యానల్‌కు చెందిన వాళ్లే చెల్లించారన్నారు.
నిన్న సాయంత్రం మంచు విష్ణు తరపున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరపున రూ.28 వేలు కట్టారని పత్రాలతో సహా ప్రకాశ్‌రాజ్ చూపారు. తనకు మిత్రుడైన శరత్‌బాబును 500 రూపాయల డబ్బు చెల్లింపుపై ఫోన్ చేసి అడిగానని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. తాను మోహన్‌బాబుకు పంపుతానని ఆయన అన్నారని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. 500 రూపాయలను ‘మా’కు చెల్లించలేరా? మోహన్‌బాబుకు పంపడం ఏంటి అని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించడం చర్చకు దారి తీస్తోంది.
60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులన్నారు. కానీ ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్ సంతకాలు సేకరిస్తోందన్నారు. ఇలా డబ్బు చెల్లించి, సంతకాలు చేయించుకుని పోస్టల్ బ్యాలెట్లలో తమకు అనుకూలంగా ఓట్లు గుద్దుకుని పోస్టు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
ఇదేనా ఎన్నికలు నిర్వహించే తీరని ఆయన నిలదీశారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా? ఇలా గెలుస్తారా?మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై సినీ పెద్లలు కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, నాగార్జున సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.