‘మా’ రగడ కొనసాగుతూనే ఉంది. ‘మా’ అధ్యక్ష బరిలో నిలిచి ఓటమి పాలైన ప్రకాశ్‌రాజ్ ఇవాళ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్ దౌర్జన్యాల్ని ప్రజానీకానికి చూపాలనే పట్టుదల ఆయనలో రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. మరోవైపు ఎన్నికల నాటి సీసీటీవీ పుటేజీ వందశాతం తీసుకోవాలని, తమకెలాంటి అభ్యంతరం లేదని మంచు విష్ణు ధీమాగా చెప్పారు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు మరో నటుడు, తన ప్యానల్ సభ్యుడు బెనర్జీతో కలిసి ప్రకాశ్‌రాజ్ వెళ్లారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద మీడియాతో ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. ఎన్నికల రోజు మంచు విష్ణు ప్యానల్ దౌర్జన్యానికి పాల్పడిందని తాను నమ్ముతున్నానన్నారు. అందుకే సీసీటీవీ పుటేజీ అడిగామని చెప్పుకొచ్చారు. ఇందుకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నిరాకరించారన్నారు.
నిబంధనల సాకుతో కోర్టుకు వెళ్లాలని ఎన్నికల అధికారి సూచించారన్నారు. తమకు ప్రత్యర్థి మంచు విష్ణుతో ఎలాంటి సమస్య లేదన్నారు. సీసీటీవీ పుటేజీ తీసుకోవాలని ఆయన చెబుతున్నారన్నారు. కానీ తమ సమస్యల్లా ఎన్నికల అధికారితోనే అని ప్రకాశ్‌రాజ్ తేల్చి చెప్పారు.
పారదర్శకంగా ఎన్నికలు జరపలేదని మరోసారి ఆరోపించారు. తమ ఫిర్యాదును ఎన్నికల అధికారి ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లు ప్రకాశ్‌రాజ్ చెప్పారు.