బాస్‌ను జిమ్‌లో క‌లిశా…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న‌ ప్రకాశ్‌రాజ్ తాజా ట్వీట్ టాలీవుడ్‌లో చ‌ర్చ‌కు తెరలేపింది. జెండా ఎగ‌రేస్తామంటూ ఇటీవ‌ల ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రోక్షంగా చెప్పిన…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న‌ ప్రకాశ్‌రాజ్ తాజా ట్వీట్ టాలీవుడ్‌లో చ‌ర్చ‌కు తెరలేపింది. జెండా ఎగ‌రేస్తామంటూ ఇటీవ‌ల ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రోక్షంగా చెప్పిన ప్ర‌కాశ్‌రాజ్‌… “మా” ఎన్ని క‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఉద‌యం మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన ఫొటోను షేర్ చేయ‌డాన్ని నెటిజ‌న్లు ఉద‌హ‌రిస్తున్నారు.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసింది. దీంతో మెగా అభిమానులైన న‌టీన‌టులు ప్ర‌కాశ్‌రాజ్‌కు అండ‌గా నిలుస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌యం చిరంజీవి ఇంటికి ప్ర‌కాశ్‌రాజ్ వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

తద్వారా మా ఎన్నిక‌ల్లో చిరంజీవి మ‌ద్ద‌తు త‌న‌కే అన్న సంకేతాల్ని మరోమారు టాలీవుడ్‌లో బ‌లంగా పంపేందుకు ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌య‌త్నించార‌ని చెబుతున్నారు. చిరంజీవిని క‌లిసిన అనంత‌రం ప్ర‌కాశ్‌రాజ్ ట్వీట్ ఆ విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిందంటున్నారు.

‘ఈ రోజు ఉదయం బాస్‌ని జిమ్‌లో కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అంటూ ఆయన రాసుకొచ్చారు. త్వ‌ర‌లో చిరంజీవి నేతృత్వంలో సినీ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ విష‌యాన్ని ప్ర‌కాశ్‌రాజ్ గుర్తు చేశారు.