Advertisement


Home > Movies - Movie News
ప్రీ రిలీజ్ ఫంక్షన్... ప్రత్యేక అతిథి అతడే..

ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుందంటే కచ్చితంగా ప్రత్యేక అతిథుల సందడి ఉంటుంది. పైగా మెగా హీరోలకు సంబంధించిన ఈవెంట్ అంటే కచ్చితంగా స్టార్ ఎట్రాక్షన్ ఉండాల్సిందే. కానీ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం ఈ సందడి కనిపించదట. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాత్రమే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాడట. మరికొన్ని గంటల్లో అట్టహాసంగా జరగనున్న ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథులు ఎవర్నీ ఆహ్వానించలేదని తెలుస్తోంది.

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అతిథుల్ని ఆహ్వానించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. అభిమానులకు పవన్ కల్యాణ్ ఉంటే చాలు. అందుకే పెద్దగా హంగు-ఆర్భాటాలు ఏమీ లేకుండా కానిచ్చేస్తున్నారు. పవన్ క్లోజ్ ఫ్రెండ్స్ అలీ, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులు మాత్రం ఈ వేడుకకు హాజరవుతున్నారు.

పవన్ పిలిస్తే చిరంజీవి లేదా రామ్ చరణ్ లో ఎవరో ఒకరు వస్తారు. ఇద్దరూ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారు. కానీ పవన్ నుంచి వాళ్లకు ఎలాంటి ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. పవన్ పరిశ్రమకొచ్చి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కు భారీ సన్మానం చేయాలని ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. స్పెషల్ ఈవెంట్ కాబట్టి చిరంజీవి లాంటి పెద్దమనిషిని ఆహ్వానిస్తే బాగుండేది. మరి ఈ ఫంక్షన్ కు చిరంజీవి వస్తున్నారా లేదా తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.