కెరీర్ లో తనకు ఎక్కువగా ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పుకొచ్చింది ప్రియమణి. కాస్టింగ్ కౌచ్ పై గతంలోనే స్పందించిన ఈ సీనియర్ హీరోయిన్, ఇప్పుడు బాడీ షేమింగ్ పై రియాక్ట్ అయింది. బాడీ షేమింగ్ తో పాటు తన స్కిన్ టోన్ కు సంబంధించి కెరీర్ లో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నట్టు తెలిపింది.
“చాలామంది నన్ను నల్లగా, డార్క్ గా ఉన్నానని విమర్శించేవారు. నా ముఖం తెల్లగా ఉందని, కాళ్లు ఎందుకు నల్లగా ఉన్నాయంటూ చాలామంది నా ఫొటోలు చూసి కామెంట్ చేసేవారు. నేను నల్లగా ఉంటే ప్రాబ్లమ్ ఏంటి? నేను తెల్లగా ఉన్నానని ఎప్పుడూ చెప్పలేదు కదా. నాది ఛామనఛాయ శరీరం. ఒకవేళ నేను నల్లగా ఉన్నప్పటికీ సమస్య ఏంటి? వ్యక్తుల్ని బ్లాక్/వైట్ అని పిలవడం నాకు ఇష్టం ఉండదు. నలుపులో కూడా అందం దాగి ఉంటుంది.”
కృష్ణుడు కూడా నల్లగానే ఉంటాడని, కానీ అందగాడని అంటోంది ప్రియమణి. ఇక తన బరువుపై కూడా చాలామంది కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. తను బరువు పెరిగినా, బరువు తగ్గినా ట్రోలింగ్ చేశారని బాధపడింది.
“ఒక టైమ్ లో నేను 65 కిలోల వరకు బరువు పెరిగాను. ఆ టైమ్ లో నేను పెద్దదానిలా కనిపించేదాన్ని. ఆ టైమ్ లో చాలామంది నన్ను లావుగా ఉన్నావని అనేవారు. ఇప్పుడేమో రివర్స్ లో అంటున్నారు. ఎందుకింత సన్నగా మారిపోయావని అడుగుతున్నారు. అంటే నేను బరువుగా ఉంటే లేదా సన్నగా ఉంటేనే నచ్చుతానా?”
ఫ్యామిలీ మేన్ సీజన్-2తో మరోసారి లైమ్ లైట్లోకొచ్చిన ప్రియమణి.. ఓటీటీ వచ్చిన తర్వాత నటీనటులకు అవకాశాలు పెరిగాయని అంటోంది. సీజన్-2లో తన పాత్రపై స్పందిస్తూ.. ఆ క్యారెక్టర్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో రాబోయ రోజుల్లో చూస్తారంటూ ఊరిస్తోంది. పరోక్షంగా సీజన్-3 ఉందనే విషయాన్ని చెప్పింది.