రాజమౌళి ఓ బ్రాండ్. ఆర్ఆర్ఆర్ ఓ మల్టీ స్టారర్. రాజమౌళి లాంటి వాళ్లు ఓ మాట చెబితే దాని మీద నిల్చోవాలి. వారానికి, నెలకు ఓ మాట మార్చకూడదు. ఆయన బ్రాండింగ్ కు, ఆర్ఆర్ఆర్ లో వున్న స్టార్ కాస్ట్ కు డేట్ కోసం తనుకులాడడం ఏమిటి? సంక్రాంతి, సమ్మర్, ఇలా పీక్ సీజన్ కోసం వెదుకులాడడం అంటే తమ సినిమా మీద, తమ స్టామినా మీద, తమ స్టార్ కాస్ట్ మీద తమకు నమ్మకం లేదా?
ఫలానా డేట్ అని ఓసారి, కాదు ఇదీ డేట్ అని ఇంకోసారి, కాదు కాదు తరువాత చెబుతాం అని మరోసారి ఇలా డేట్ లు మార్చుకుంటూ పోతే మిగిలిన సినిమాల పరిస్థితి ఏమిటి? తమ సినిమా తమ ఇష్టం. తమ డేట్ వేస్తే చచ్చినట్లు వాళ్లే తప్పుకుంటారు అనే ధీమానా? మేం ఆ డేట్ కు వస్తాం తప్పుకోండి అనేలా హుకుం జారీ చేయడం ఏమిటి?
ఇవీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు. పైకి ఎవ్వరూ గట్టిగా మాట్లాడకున్నా, వారిలో వారు చెప్పుకుంటున్న మాటలు. రాజమౌళికి ఈ సారి గట్టిగా ఝలక్ ఇవ్వాల్సిందే. సంక్రాంతి అంటే రెండు భారీ సినిమాలు వున్నా ఓకె. అందువల్ల ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వచ్చినా కూడా మరో భారీ సినిమా వేసి, సత్తా చాటాల్సిందే. అప్పుడు కానీ రాజమౌళికి కాస్త తెలిసిరాదు అంటూ కామెంట్లు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.
వివిధ సినిమాలు డేట్ లు ప్రకటిస్తున్నా, పైకి ఏమీ చెప్పకుండా, కేవలం తన కొడుకు చేతనో, నిర్మాత చేతనో ఫోన్ లు చేయించడం, లోపాయకారీగా డేట్ చక్కబెట్టాలని అనుకోవడంం చాలా మంది నిర్మాతలను మండిస్తోంది. ప్రభాస్ రాధేశ్వామ్ కు రాజమౌళి అడ్డం పడుతున్నారని తెలిసి ఫ్యాన్స్ కు కోపంగా వున్నారు.
పవన్ సినిమాను పక్కకు నెట్టాలని చూస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఎలాగైనా సంక్రాంతి బరిలోకి దింపాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం సైలంట్ గా వున్నారు. ఎందుకంటే తమ హీరో తరువాత సినిమా డైరక్టర్ రాజమౌళే కదా అని.
మొత్తం మీద ఇండస్ట్రీలో జనం ఇప్పుడు రాజమౌళి మీద గరం గరంగా వున్నారన్నది వాస్తవం.