స్టార్ హీరోల మంచితనం గురించి, వారి ఔన్నత్యం గురించి మీడియాలో రకరకాల విషయాలు ప్రచారానికి నోచుకుంటూ ఉంటాయి. అభిమానులు అయితే తాము అభిమానించే హీరోల గురించి ఒక రేంజ్ ప్రచారాలు చేస్తూ ఉంటారు.
వాటిల్లో చాలా వరకూ ఆధారాలు లేని ఔన్నత్యపు ప్రచారాలే! అదేస్టార్ హీరోల గురించి వచ్చే కొన్ని రకాల వార్తలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. అలాంటిదే సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి!
చెన్నైలోని తమకు సంబంధించిన రాఘవేంద్ర కల్యాణమండపానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ను కట్టడానికి నిరాకరిస్తూ రజనీకాంత్ కోర్టుకు ఎక్కారు. కోడంబాకంలోని ఈ మ్యారేజ్ హాల్ ను అద్దెకు ఇస్తూ క్యాష్ చేసుకుంటూ వచ్చింది రజనీకాంత్ ఫ్యామిలీ.
అందుకు సంబంధించి ప్రతి ఆరు నెలలకూ ఒకసారి ప్రాపర్టీ ట్యాక్స్ లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రజనీకాంత్ మాత్రమే కాదు.. దేశంలో అంతా చెల్లించేదే! రెసిడెన్షియల్ భవనాలకు ఒక రకమైన ట్యాక్సు, కమర్షియల్ భవంతులకు మరో రకమైన ట్యాక్సును అంతా కడుతూనే ఉంటాం.
అయితే రజనీకాంత్ ఆ పన్నును కట్టడానికి నిరాకరిస్తున్నారు. ఆ పన్నును రద్దు చేయాలంటూ ఆయన కోర్టుకు ఎక్కారు. ఇంతకీ ఎందుకు కట్టరు? అంటే.. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి తమ మ్యారేజ్ హాల్ ఖాళీగా ఉందట. అందులో ఎలాంటి వేడుకలూ జరగలేదట. దీంతో తమకు ఎలాంటి ఆదాయం లేదట. అందుకని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టరట! ఇదీ కథ!
కరోనా కారణంగా అంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆఖరికి రోజుకు నాలుగైదు వందల కూలి పొందే జనాల ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. వలస కార్మికుల కష్టాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే అన్ని పన్నులూ యథారీతిన కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఎవరికీ ఎలాంటి మినహాయింపులను ఇవ్వడం లేదు.
అలాంటింది ఒక కమర్షియల్ మ్యారేజ్ హాల్ ను నడిపే రజనీకాంత్ కుటుంబం అందుకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ను కట్టడానికి నిరాకరించడం ఎంత వరకూ సబబో మరి! ఈ విషయం కోర్టు తేలుస్తుంది కానీ, రజనీసార్ అంటే అపరదానకర్ణుడు, గుప్తదానాలు, నిరాడంబరత వంటి మాటలకు పర్యాయపదం అనే ఒక ఇమేజ్ ఉంది. మరలాంటి వ్యక్తి పేరుతో.. ఇలాంటి పరిస్థితుల్లో.. తమ ప్రాపర్టీ మీద ట్యాక్స్ కట్టడానికి నిరాకరిస్తూ కోర్టుకు ఎక్కడం ఏమిటో మరి!