రజనీకాంత్ సినిమాలకు తెలుగునాట ఎంత కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ పాత సినిమాలు టీవీలో ప్రసారం అయినా రిమోట్ బటన్ కు పని ఆగుతుంది. నరసింహా, ముత్తు, అరుణాచలం, భాషా.. వంటి సినిమాలు ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. యూట్యూబ్ లో ఈ సినిమాల సీన్లకు వీక్షణల సంఖ్య భారీగా ఉంటుంది. రజనీ సినిమాలు అంటే.. చంద్రముఖి, నరసింహా, అరుణాచలం, ముత్తు, రోబో.. వంటివి అని తెలుగు ప్రేక్షకులు మనసులో ఫిక్సయిపోయారు.
అయితే.. ఈ మధ్యకాలంలో వచ్చిన రజనీ సినిమాలు ఏవీ .. పై స్థాయిలో తెలుగు వాళ్లను మెప్పించలేదనేది పచ్చి నిజం. ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.. అనేది లెక్కే కాదు. లింగా, కబాలి, పేట, దర్బార్.. వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను వీసవెత్తు కూడా ఆకట్టుకోలేదు. అంతే కాదు.. ఆ సినిమాల పరంపర దెబ్బకు రజనీ లేటెస్ట్ సినిమా అన్నాత్తేను తెలుగునాట పట్టించుకున్న నాథుడు లేడు. తెలుగు అనువాద రైట్స్ ను కూడా తక్కువ రేటుకే అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి.
చంద్రముఖి సమయంలోనే.. రజనీ సినిమా తెలుగు వెర్షన్లు పదుల కోట్ల ధర పలికితే, ఇప్పుడు మళ్లీ అంతకన్నా తక్కువ స్థాయి పడిపోయింది రజనీ కాంత్ మార్కెట్. రజనీని గత కొన్నేళ్లుగా తెర మీద చూపిన దర్శకుల ఫెయిల్యూర్ వల్లనే ఈ పరిస్థితి అని వేరే చెప్పనక్కర్లేదు. అన్నాత్తే తర్వాత రజనీ సినిమా ఏదైనా తెలుగు వైపుకు వస్తే.. శివకార్తికేయన్ సినిమా స్థాయి తెలుగు లో వచ్చినంత ఓపెనింగ్స్ కూడా వచ్చేలా లేవు!
మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా దర్శకుడి గురించి రజనీ ఇచ్చిన స్టేట్ మెంట్లు, పొగుడుతున్న పొగడ్తలు వింటే… తెలుగు ప్రేక్షకులు దాదాపు నివ్వెర పోవాల్సిన పరిస్థితి! దర్శకుడు శివను రజనీకాంత్ ఆకాశానికి ఎత్తేశారు. తనకు హిట్ ఇస్తానని మాట ఇచ్చి, శివ హిట్ ఇచ్చాడంటూ రజనీ కాంత్ భావోద్వేగ భరితం అయిపోవడం సగటు ప్రేక్షకుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ సినిమా తమిళ వెర్షన్ కు ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా అంటే.. తమిళ రివ్యూయర్లు కూడా కడిగేశారు. హిందూ పత్రికలో అయితే.. రజనీకాంత్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చదని, వారు కూడా ఇంతకన్నా మెరుగైన సినిమాలో రజనీని చూసేందుకు అర్హులని ఘాటైన వ్యాఖ్య చేశారు. ఈ మధ్య రజనీ సినిమాల్లో వేటికీ రానంత దారుణమైన రేటింగ్ ఈ సినిమాకే వచ్చింది! ఒకటీ, ఒకటిన్నర రేటింగ్.. అంటే అంతకన్నా చిన్నబుచ్చడానికి ఏమీ మిగల్లేదు. మరి ఈ రెస్పాన్స్ కూ రజనీ రియాక్షన్ కూ వీసవెత్తు సంబంధం లేదు! కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారు. వాటి లోగుట్టు ఎవరికి తెలుసు?
ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు శివను రజనీ కాంత్ ఆ రేంజ్ లో ప్రశంసిచండాన్ని గమనిస్తే.. మరి సుందర్ .సి, సురేష్ కృష్ణ, కేఎస్ రవికుమార్, శంకర్ లను రజనీ ఇంకెలా పొగడాలబ్బా! డిజాస్టర్ అనిపించిన దర్శకుడిని రజనీ పొగుడుతున్న తీరును చూస్తుంటే వచ్చే అనుమానం ఇది!