cloudfront

Advertisement


Home > Movies - Movie News

రాళ్లపల్లి కన్నుమూత

రాళ్లపల్లి కన్నుమూత

తెలుగుతెరపై అత్యుత్తమ నటుల్లో ఒకరైన రాళ్లపల్లి కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని మోతీనగర్ లో ఉంటున్న రాళ్లపల్లి, కొన్నాళ్లుగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. రాళ్లపల్లి మనల్ని వీడి వెళ్లిపోయారు.

పరిపూర్ణ నటుడికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాళ్లపల్లి. కామెడీ, విలనీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం మాత్రమే రాళ్లపల్లికి తెలుసు. అన్వేషణ సినిమాలో విలన్ గా కనిపించినా, లేడీస్ టైలర్, శ్రీవారికి ప్రేమలేఖ, ఏప్రిల్ 1 విడుదల లాంటి ఎన్నో సినిమాల్లో కామెడీ చేసినా అన్ని పాత్రల్ని ఆదరించారు ప్రేక్షకులు. బహుశా విలనీ చేసిన తర్వాత కూడా కామెడీ చేసి మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్టు రాళ్లపల్లి మాత్రమే కావొచ్చు. 

1955 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు రాళ్లపల్లి. ఆ టైమ్ లో అందర్లానే రాళ్లపల్లికి కూడా నాటకాలపై ధ్యాస ఎక్కువైంది. కాకపోతే కేవలం నాటకాల్ని చూసి ఆనందించి వదిలేయలేదు. దానిపై అవగాహన పెంచుకున్నారు. రాయడం, దర్శకత్వం వహించడం, నటించడం లాంటి ఎన్నో రంగాల్లో అనుభవం సంపాదించారు. అలా తన కెరీర్ లో 8వేలకు పైగా నాటకాల్లో నటించారు రాళ్లపల్లి. ఎన్ని సినిమాలు చేసినా నాటకంలో నటించకపోతే రాళ్లపల్లికి తృప్తి ఉండేది కాదు. అందుకే ఆయన జీవితంలో నాటకం ఓ భాగమైంది.

1973లో వెండితెరకు పరిచయమయ్యారు రాళ్లపల్లి. అప్పటికే నాటకాల్లో నటించిన అనుభవం ఉండడంతో సినిమా రంగంలో రాణించడం నల్లేరుపై నడకలా మారింది. చిల్లర దేవుళ్లు, చలిచీమలు, అభిలాష, శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన రాళ్లపల్లి.. చాలా తక్కువ కాలంలోనే దర్శకుల నటుడిగా మారిపోయారు. చివరికి వంశీ, జంధ్యాల లాంటి నటులు రాళ్లపల్లి లేకుండా సినిమా చేయలేని పరిస్థితికి వచ్చేశారు. 

అలా తన కెరీర్ లో 850కి పైగా సినిమాల్లో నటించారు రాళ్లపల్లి. 3 దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. అయితే లెక్కలేనన్ని సినిమాలు చేసినా, నాటక రంగానికి దూరమయ్యాననే బాధ మాత్రం ఆయన్ను వెంటాడుతూ ఉండేది. వరుసగా 10 సినిమాలు చేసినప్పటికీ, ఒక్క నాటకంలోనైనా నటించాలనే కోరిక ఆయనకు ఉండేది. అందుకే ఒక దశలో సినిమాల కంటే ఎక్కువగా నాటకాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. 

ప్రస్తుతం పరిశ్రమలో నటులు, రచయితలుగా కొనసాగుతున్న తణికెళ్ల భరణి లాంటి ఎఁతోమంది ప్రముఖులకు రాళ్లపల్లి గురుతుల్యులు. సినీ పరిశ్రమ నుంచి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేని నటుల్లో రాళ్లపల్లి ఒకరు. ఎన్ని మంచి పాత్రలు వేసినా, ఎంత కష్టపడినా ఇండస్ట్రీ తనను బి-కేటగిరీ నటుడిగానే చూసేదని ఓ సందర్భంలో చెప్పుకున్నారాయన. పరిశ్రమ గుర్తించకపోయినా రాళ్లపల్లిని ప్రజలు గుర్తించారు. ఆయన సినిమాలు, అందులో పాత్రలు కలకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.