చాలా మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. తొలి సినిమాకే వెనుతిరిగే తారలు చాలామంది. అందాల సుందరి యుక్తి తరేజా కూడా అలానే వెనక్కి వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, ఆమె నటించిన రంగబలి రిజల్ట్ అలాంటిది.
నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది యుక్తీ తరేజా. అయితే ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. దీంతో యుక్తిని పట్టించుకునేవాడు లేడు. సోషల్ మీడియాలో ఆమె అందాలు అడవి కాచిన వెన్నెలగా మారాయి.
ఇక ఆమె దుకాణం సర్దేస్తుందని అంతా అనుకుంటున్న టైమ్ లో, మరో సినిమాతో మెరవబోతోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి కొత్త సినిమాలో యుక్తీ తరేజాను తీసుకున్నారు. ఈ రోజు సినిమా టైటిల్ ప్రకటించారు.
ఈ మూవీకి కేజేక్యూ అనే టైటిల్ పెట్టారు. కింగ్-జాకీ-క్వీన్ అని దీనర్థం. పేకాటలో కనిపించే 3 ప్రధానమైన ఈ పేర్లను ఈ సినిమాకు ఎందుకు పెట్టారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈరోజు టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
రెండు తుపాకులు, గులాబీలతో ఈ మూవీ టైటిల్‌ను ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ కూడా స్టయిలిష్ గా ఉంది. కెకె ఈ సినిమాకు దర్శకుడు కాగా.. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిన్న సినిమాతోనైనా యుక్తీ తరేజా మెరుస్తుందేమో చూడాలి.