హీరోయిన్లపై వేధింపులు పెరిగి పోయాయి. చచ్చి సాధించేదేమీ లేదని ఎవరెన్ని చెబుతున్నా కొందరి ఆలోచనా ధోరణిలో మార్పు రాలేదు. చావులోనే పరిష్కారం, ప్రశాంతత ఉన్నాయని నమ్ముతున్నారు. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి రాణీ చటర్జీ తాను వేధింపులు తాళలేకున్నానని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
సోషల్ మీడియా వేదికగా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన వేధింపులకు కారణమైన వ్యక్తి ఎవరో కూడా వెల్లడించింది.
“ఫేస్‌బుక్‌లో ధనంజయ్ సింగ్ అనే వ్యక్తి నాపై వేధింపులకు పాల్పడుతున్నాడు. లావుగా ఉన్నావు, ముసలిదానా.. అంటూ నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఇవే కాదు, మాటల్లో చెప్పలేని, రాయడానికి వీలు కాని అసభ్య పదజాలాన్ని వాడుతున్నాడు. కొన్నేళ్లుగా పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. నేనేదైనా అఘాయిత్యం చేసుకుంటే ధనుంజయ్ సింగే కారణం” అని పేర్కొంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై పోలీసులను ఈ పోస్ట్‌కు ట్యాగ్ చేసింది. అయితే సైబర్ పోలీసుల వాదన మరోలా ఉంది. ధనుంజయ్ చేసిన పోస్టుల్లో ఏ ఒక్క నటి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడంతో తామేమీ చేయలేమని సైబర్ పోలీసులు చేతులెత్తేశారు.
కానీ ధనుంజయ్ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు తన గురించేనంటూ సదరు నటి, వాటిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేయడం గమనార్హం. చివరికి తనకు ఆత్మహత్యే గతి అని భోజ్‌పురి నటి రాణీ చటర్జీ పోస్ట్ పెట్టడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఈ కథకు ముగింపు ఎలా పలుకుతారో కాలమే జవాబు చెప్పాలి.