Advertisement


Home > Movies - Movie News
రెడ్ స్టార్ కన్నుమూత

ప్రముఖ సినీనటుడు, విప్లవ చిత్రాల నాయకుడు మాదాల రంగారావు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, వారం రోజుల కిందట హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూనే ఈరోజు ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు.

విప్లవ సినిమాలతో రెడ్ స్టార్ అనిపించుకున్నారు మాదాల రంగారావు. నవతరం పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ప్రజల్ని చైతన్యవంతం చేసేలా విప్లవ చిత్రాల్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలు తీస్తున్న ఆర్.నారాయణమూర్తికి స్ఫూర్తిగా నిలిచారు మాదాల రంగారావు. 

1980ల్లో ప్రేమకథలు నడుస్తున్న సీజన్ అది. తన టాలెంట్ తో కావాలంటే మాదాల రంగారావు కూడా ప్రేమకథలు తీయొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టి కమర్షియల్ సినిమాలు కూడా నిర్మించొచ్చు. కానీ వామపక్ష భావజాలం ఉన్న మాదాల రంగారావు మాత్రం ప్రజల్ని చైతన్యవంతం చేయాలనుకున్నారు. అందుకే ట్రెండ్ కు విరుద్ధంగా.. ఎర్రమల్లెలు సినిమా తీసి సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

స్వరాజ్యం, ఎర్రసూర్యుడు, ఎర్రపావురాలు, బలిపీఠం, నవోదయం, ప్రజాశక్తి.. ఇలా ఎన్నో విప్లవ సినిమాలు తీశారు మాదాల రంగారావు. 1980లో తీసిన యువతరం కదిలింది అనే చిత్రానికి బంగారు నంది పురష్కారాన్ని కూడా అందుకున్నారు.