Advertisement


Home > Movies - Movie News
రేణుదేశాయ్‌పై ఆగని 'దాడి'

పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌పై 'దాడి' కొనసాగుతూనే వుంది. నా నుంచి విడాకులు తీసుకోకుండా, ఇంకో మహిళతో సంబంధం పెట్టుకుని, ఆమె బిడ్డకు తండ్రి అయితే.. అతనితో ఎలా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తారు.? అంటూ రేణు దేశాయ్‌ తాజాగా పవన్‌కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కి గురైన సంగతి తెల్సిందే.

పవన్‌ - రేణు విడిపోవడానికి కారణమేంటి.? అన్న అనుమానాలకు రేణు ఇంటర్వ్యూ స్పష్టమైన సమాధానమిచ్చేసింది. 

ఇంకేముంది, మరోమారు.. సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పేరుతో కొందరు చెలరేగిపోయారు. మళ్ళీ బూతుల ప్రవాహం షురూ అయ్యింది.

గతంలో ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్‌, 'మేమిద్దరం విడిపోయాక, అన్నా లెజ్‌నెవాను పెళ్ళాడిన పవన్‌కళ్యాణ్‌, ఆమె ద్వారా ఇంకోసారి తండ్రి అయ్యారని తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడాను. ఆమెతో కూడా మాట్లాడి విషెస్‌ తెలిపాను. ఇప్పటికీ మా ఇద్దరి మధ్యా స్నేహం అలాగే వుంది' అని చెప్పింది.

ఆ వీడియో ఇప్పుడు వెలికి తీస్తున్నారు పవన్‌ అభిమానుల పేరుతో కొందరు. ఆ ఇంటర్వ్యూకీ, రేణుదేశాయ్‌ తాజా ఇంటర్వ్యూకీ స్పష్టమైన తేడా కన్పిస్తోంది. 

అయితే, పవన్‌కళ్యాణ్‌తో టెర్మ్స్‌ బాగున్నప్పుడు రేణుదేశాయ్‌ మాట్లాడిన మాటలకీ, ఇప్పటి మాటలకీ ఆ మాత్రం తేడా వుండడం సహజమే. పైగా, రేణుదేశాయ్‌ ఇప్పుడు ఇంకో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోంది.. మరో వ్యక్తికి భార్య కాబోతోంది. ఈ నేపథ్యంలో, పవన్‌తో విడిపోవడానికి సంబంధించి కారణాల్ని ఇప్పుడు బయటపెట్టిందనుకోవాలేమో. కాబోయే భర్త ఒత్తిడి కావొచ్చు, అతని కుటుంబ ఒత్తిడి కావచ్చు.. చాలా విషయాలపై రేణుదేశాయ్‌ క్లారిటీ ఇచ్చిందన్నది మెజార్టీ వాదన.

మరోపక్క, ఆమెతో కొందరు బలవంతంగా ఈ ఇంటర్వ్యూ చేయించి, పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా ఇరకాటంలో పడేయ్యాలనుకున్నారన్నది మరికొందరి అభిప్రాయం. 

మొత్తమ్మీద, రేణు తన వెర్షన్‌ని రెండుసార్లు, రెండు విధాలుగా చెప్పింది. మరి, ఈ విషయమై గందరగోళం తగ్గాలంటే, పవన్‌కళ్యాణ్‌ పెదవి విప్పాలి. కానీ, ఆయన ఆ పని చేయడుగాక చేయడు.

రేణుదేశాయ్‌ ఇంకో పెళ్ళికి సిద్ధమవడంతో 'విషెస్‌' అందజేయడం ద్వారా, అభిమానులకు పంపాలనుకున్న మెసేజ్‌ని పవన్‌ పంపాడు. కానీ, పవన్‌ అభిమానులు మాత్రం, రేణు ఇంటర్వ్యూతో బాగా హర్ట్ అయిపోయారు.. అందుకే తాజాగా ఇంకోసారి ఆమెపై బూతుల దండకం అందుకుంటున్నారు.

ఈ బూతుల దండకం నేపథ్యంలో రేణు నుంచి ఇంకో 'స్పందన' వస్తుందా.? వస్తే, అది ఇంకెలాంటి వివాదాలకు తెరలేపుతుంది.? వేచి చూడాల్సిందే.