రేణూ దేశాయ్ …పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి. ఆత్మాభిమానం, సొంత ఐడెంటిటీ మెండుగా ఉన్న మహిళ. ముఖ్యంగా సామాజిక అంశాలపై తనవైన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో ఆమెకు ఆమె సాటి.
ఆమె మాట్లాడినా, మాట్లాడకపోయినా వార్తే. అందుకే ప్రతిదీ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. సంస్కారానికి, సభ్యతకు మారుపేరైన రేణూదేశాయ్ తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. లైవ్‌లో వెలబుచ్చిన సంచలన అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సంగతులేంటో తెలుసుకుందాం పదండి.
ముఖ్యంగా ప్రేమ, అది విఫలమైతే మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆమె ఆవిష్కరించారు. ప్రేమ ఎంతో మధురమైందని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రేమలో ఫెయిల్ అయితే , ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమని రేణూ చెప్పారు.
అయితే ప్రేమే జీవితం కాదని, అది లేందే బతుకు లేదనే భావనను మనసులోకి రానివ్వద్దని కోరారు. ప్రేమ ఫెయిల్యూర్ అయినప్పుడు కలిగే బాధ నుంచి బయటపడడానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని రేణూ తేల్చి చెప్పారు. అలా ఆలోచించడం సరైంది కాదన్నారు.
ప్రతి ఒక్కరికి వారి జీవితం, ప్రాణం ఎంతో విలువైనవన్నారు. వీటి కంటే ఏవీ కూడా ఏ మనిషికీ ఎక్కువ కాదని రేణూ తెలిపారు. సహజంగా ప్రేమ విఫలమైతే ఎంతో బాధ కలుగుతుందనే విషయం తనకు బాగా తెలుసన్నారు. మనం ప్రేమించే మనిషి మనతో పాటు లేడని, మనల్ని మోసం చేశాడనే ఆలోచనలు మనసుకు చాలా కష్టం కలిగిస్తాయన్నారు.
ఆ బాధ నుంచి బయటపడడం అసాధ్యమేమీ కాదన్నారు. మనసును ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలన్నారు. ఇలాంటి సందర్భాల్లో కౌన్సిలింగ్ తీసుకోవడంతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితుల సాయంతో మళ్లీ మునుపటి జీవితాన్ని ప్రారంభించవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తన లైఫ్ ఫిలాసఫీని ఆమె నెటిజన్లకు వివరించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకేలా జీవించాలనేది తన ఆలోచనగా చెప్పారు. బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం, సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం లాంటివి తన జీవితంలో ఉండకూడదని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదే జీవన పాఠంగా అనుసరించాలని గట్టిగా నిశ్చయించుకున్నట్టు రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.
కాగా ప్రేమ విఫలం కావడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం తదితర అంశాలు తన జీవితంలో ఎదురైన అనుభవాలుగా నెటిజన్లు కామెంట్స్ పెడుతుండడం గమనార్హం. తాజాగా రేణూ వెల్లడించిన అభిప్రాయాలు గుచ్చుకోవాల్సిన వాళ్లకే సూటిగా గుచ్చుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.