సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం రిపబ్లిక్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రచారం కూడా మొదలైంది. ఓవైపు పాటల విడుదల కార్యక్రమం, మరోవైపు ఇంటర్వ్యూలు కూడా మొదలయ్యాయి. అయితే అంతలోనే సాయితేజ్ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో రిపబ్లిక్ మూవీ విడుదలపై అనుమానాలు ముసురుకున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ఓ సరికొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కలెక్టర్లకు థ్యాంక్స్ చెబుతూ వినూత్నంగా ఓ కార్యక్రమం అనుకున్నారు. సాయితేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఇప్పుడు అన్ని రకాల ప్రచార కార్యక్రమాల్ని ఆపేశారు. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయితేజ్ సేఫ్ గానే ఉన్నప్పటికీ.. ఎన్ని రోజుల్లో కాలు బయటపెట్టి మీడియా ముందుకొస్తాడనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
తాజాగా సాయితేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన వైద్యులు.. ఆయన త్వరగా కోలుకుంటున్నట్టు తెలిపారు. కాలర్ బోన్ శస్త్రచికిత్స నుంచి కూడా ఆయన తొందరగా రికవర్ అవుతున్నట్టు తెలిపారు. అయినప్పటికీ డిశ్చార్జ్ చేసిన తర్వాత కనీసం 2 వారాలు రెస్ట్ తీసుకోమని చెబుతారు. కాబట్టి రిపబ్లిక్ సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
సినిమా ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. కానీ హీరో సాయిధరమ్ తేజ్ తో ప్రచారం చేయకుండా సినిమాను విడుదల చేయలేరు. పైగా ఓ వైపు హీరోకు యాక్సిడెంట్ అయినప్పుడు, మరోవైపు సినిమాను రిలీజ్ చేయడం నైతికంగా కరెక్ట్ కాదు. అందుకే తమ సినిమా అక్టోబర్ 1కి రావడం లేదంటూ మేకర్స్ ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు. కాకపోతే అధికారిక ప్రకటన ఇంకా రాలేదంతే.