cloudfront

Advertisement


Home > Movies - Movie News

నన్ను చంపితే, సినిమా యూట్యూబ్ లోకి - ఆర్జీవీ

నన్ను చంపితే, సినిమా యూట్యూబ్ లోకి - ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ... ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతటి మొండిఘటం లేరు అంటే అతిశయోక్తి కాదేమో? ఎవరికైనా ఎక్కడో ఓ పాయింట్ లో భయం అనేది వుంటుంది. ఆర్జీవీని మొత్తం ఒకటికి పదిసార్లు స్కాన్ చేసినా అలాంటి భయం నాట్..నాట్..వన్ పర్సంట్ కూడా కనిపించదు.

ఎవర్ని అయినా ఇసుమెత్తు సంకోచం లేకుండా టార్గెట్ చేయగలరు. ఏ విషయం మీదనైనా కుండ బద్దలు కొట్టగలరు. తను అనుకున్నది చేసేయడం తప్ప, ముందు వెనుకలు వుండవు. తనను ఎగ్జయిట్ మెంట్ కు గురి చేసే సబ్జెక్ట్ దొరికితే, వెంటనే సినిమా ఇలా స్టార్ట్ చేసి, అలా తీసి వదిలేయాల్సిందే.అలాంటి ఆర్జీవీ ఇప్పుడు టేకప్ చేసిన సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. తెలుగునాట తీవ్ర ప్రకంపనాలకు కారణమవుతున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో 'గ్రేట్ఆంధ్ర' ఆర్జీవీతో కాస్సేపు మాట్లాడింది. ఆ ఇంటర్వూ విశేషాలు సంక్షిప్తంగా మీ కోసం.

నమస్కారం వర్మగారూ.. సంచలనాల మీద సంచలనాలు. ప్రతిసారీ ఏదో ఒక సంచలనం సృష్టించడం ఫిల్మ్ మేకర్లలో మీకే సాధ్యమేమో?

ఇప్పుడు సంచలనం అనేదానికి అర్థం అంటే..నా వరకు నాకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఎగ్జయిటింగ్ గా, ఛాలెంజింగ్ గా వుండాలి. లేకపోతే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ కలగదు. మనం చేసే పనుల మీద మన ప్రవృత్తి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నా వరకు, నా సినిమాలకు కూడా ఇదే అప్లయి అవుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సబ్జెక్ట్ మీద నేను ముందుగా ఆసక్తి కలిగి లేను. ఆ టైమ్ లో అంటే ఆ కాలంలో నేను రంగీలా షూటింగ్ లో ముంబాయిలో వున్నాను. ఫస్ట్ టైమ్ ఈ సబ్జెక్ట్ నాకు బాలయ్య గారితో బయోపిక్ మీద డిస్కస్ చేసినపుడు ఫోకస్ దీనిమీదకు వచ్చింది. అప్పుడు దాంట్లో గ్రేట్ మెటీరియల్ వుంది అనిపించింది. 

సినిమాలోకి వచ్చేముందు ఓ క్వశ్చను. మీ ఫాలోవర్లు మిమ్మల్ని డేర్ డెవిల్ అని, వాడు మగాడ్రా అని అనడం గమనించారా. అవి చూసి మరింతగా అలాగే వుండాలని మీకు అనిపిస్తుందా?

డేర్ డెవిల్ అనేది నాలో లేదు. కానీ, నాకు ఓ పౌరుడిగా నా హక్కులు ఏమిటి? అన్న దాని మీద నాకు సంపూర్ణ అవగాహన వుంది కనుక ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నాను అంతే. నేనేం హెర్క్యులస్, ఏదైనా చేయగలను అన్నది వాస్తవం కాదు. అంతకన్నా ఏమీ కాదు. నిజానికి మనిషి ఎవరేం చేస్తారో? అన్న భయంలో బతుకుతుంటాడు. ఏవరైనా ఏమైనా చేస్తారా? అన్నదానికి చేస్తారు  అన్నది తేడా వుంది. కానీ లైఫ్ లో ఎగ్జయిట్ మెంట్ కావాలంటే ఇలాగా వుండాల్సిందే.

మీరు అన్నది నిజమే. కానీ ఫిల్మ్ మేకర్ గా రాయలసీమ ఫ్యాక్షనిజం, విజయవాడ రౌడీయిజం, టాలీవుడ్ లో ఓ ఐకానిక్ ఫ్యామిలీలోకి తొంగిచూడడం వంటి వాటికి భయం అక్కరలేదు కానీ, ధైర్యం అయితే కావాలి కదా?

అవసరం లేదు. సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందాక, తెల్లారి లేస్తే, ఎవరో ఒకరు, ఎవరో ఒకర్ని కామెంట్ చేస్తూనే వుంటారు. టార్గెట్ చేస్తూనే వుంటారు. విషయం ఏదైనా కావచ్చు. 

అసలు బయోపిక్ కు ఏం కావాలి మీ దృష్టిలో.

బయోపిక్ అనేదానికి ఓ బలమైన కాన్ ఫ్లిక్ పాయింట్ వుండాలి. ఎన్టీఆర్ మొత్తం జీవితం దాదాపు స్ట్రయిట్ లైన్ లా, ఈవెంట్ లెస్ గా వెళ్లింది. ఎప్పుడయితే లక్ష్మీపార్వతి ఎంటర్ అయిందో అప్పుడు వుంది అసలు సంగతి. 

బాలయ్యగారు మిమ్మల్ని బయోపిక్ కోసం సంప్రదించినపుడు ఈ పాయింట్లు చెప్పారా? 

ఆయన వచ్చినపుడు అసలు తొలిసారి ఈ స్టోరీ మీద కాన్సన్ ట్రేట్ చేసాను. అప్పుడు ఓ ఫిల్మ్ మేకర్ గా నాకు ఇందులో చాలా విషయం వుందనిపించింది. అప్పుడు దాని మీద దృష్టి పెట్టాను.

బాలయ్య మీకు బయోపిక్ బాధ్యతలు అప్పగించి వుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ వుండేది కాదు అనే పాయింట్ వినిపిస్తుంటుంది. మీరే మంటారు?

ఇక్కడ టూ పాయింట్స్ వున్నాయి. ఒకటి నిజం. ఇంకో నిజం ఏమిటంటే, ఈ యాస్పెక్ట్ లేకపోతే తీసేవాడిని కాదు. బాలయ్య నిర్మాత కూడా. ఆయన ఈ ఎపిసోడ్ వద్దు అని వుండేవారు. అప్పుడు నేను తీసి వుండేవాడిని కాదు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండుభాగాలు చూసారా? ఎలా అనిపించింది.

ఏదో కూర్చుని, అప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పుకున్నట్లు కనిపించింది. రామారావు చేతులు కట్టుకుని వేషాలు అడిగారు అనే విధంగా చూపిస్తే చూడలేం. అలా చిరంజీవిని, ఎఎన్నార్ ను చూడగలం కానీ రామారావును కాదు. ఎందుకంటే ఆయన పుట్టడమే రాముడిగా, కృష్ణుడిగా పుట్టాడు అనిపిస్తుంది చూస్తుంటే. అందువల్ల సినిమాలో బిలీవబుల్ ఫ్యాక్టర్ తక్కువ వుంటుంది. అది నాకు పెద్దగా నచ్చలేదు. నేను అయితే రెండు భాగాలు కలిపి మొత్తం అరగంటకో, గంటకో కుదించి, ఈ లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను కీలకంగా జోడించి వుండేవాడిని. 

సోషల్ మీడియాలో వినిపించే మరో ప్రశ్న. అసలు వేరేవాళ్ల ఫ్యామిలీలోకి తొంగిచూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అన్నది?

పబ్లిక్ డొమైన్ లో వున్న పీపుల్ లేదా ఫ్యామిలీల గురించే డిస్కషన్ చేస్తుంటాం. హిస్టరీలో చూడండి అదే వుంటుంది. బిగ్ ఫ్యామిలీల్లోకి చూడకూడదు అంటే హిస్టరీ అనేదే వుండదు. ఎన్టీఆర్ అనే  పేరు రాజకీయాలు, సినిమాలను అపారంగా ప్రభావితం చేసిన పేరు. ఆ ఫ్యామిలీలోకి చూడకుంటే ఆయన హిస్టరీ అనేది వుండదు.

లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు అది అందరికీ తెలుసు. కానీ ఆమెను ఇంట్లో ఎలా ట్రీట్ చేసారు అన్నది మీకు ఎలా తెలుసు.

ఇది మంచి క్వశ్చను. ఇక్కడ ఫోర్ పాయింట్స్ వున్నాయి. ట్రూత్ అనేది వినడానికి కానీ మరెందుకైనా కానీ నమ్మబుల్ గా వుండాలి. నమ్మబుల్ గా ఎప్పుడు వుంటుంది. మీకు ఆల్రెడీ రఫ్ గా కొంత తెలుసు. ఇప్పుడు నాకు సోర్సెస్ ఎలా వుంటాయి. అప్పుడు నేను లేను. ఇప్పుడు వున్నవారు నిజం చెప్పొచ్చు. చెప్పకపోవచ్చు. అప్పటికి ఇప్పటికి వారి వారి అభిప్రాయాలు మారి వుండొచ్చు. ఫర్ వున్నవాళ్ల, అగైనిస్ట్ వున్నవాళ్లు నిజం చెబుతారని నమ్మకం లేదు. లేదా విషయాన్ని మార్చొచ్చు. కల్పించవచ్చు.

అందుకే నేను చాలా న్యూట్రల్ పర్సన్స్ ను కలిసారు. ఇలా 20, 30 న్యూట్రల్ సోర్స్ ల నుంచి సమాచారం తీసుకున్నా. దాదాపు ఓ పోలీస్ ఇన్ వెస్టిగేషన్ మాదిరిగా. ఓ విషయం చూద్దాం. ఎన్టీఆర్ ను కుటుంబం మొత్తం ఒంటరిగా వదిలేసింది అన్నది పాయింట్. ఇది నిజమెలా అనుకోవాలి. ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా బిజీ పర్సన్. చుట్టూ ఎందరో జనాలు ఎప్పుడూ వుంటారు. అలాంటపుడు లక్ష్మీపార్వతి అనే మనిషి ఆయన దగ్గరకు ఎలా రాగలిగింది? వచ్చినా ఒకటి రెండు నిమషాలకు మించి కలిసే అవకాశం లేదు. కానీ కలిసింది. దగ్గరయింది అంటే, ఎన్టీఆర్ దగ్గర ఎవరూ లేకుండా ఒంటరిగా వుండి వుండాలి. అదీ లాజికల్ పాయింట్ అన్నమాట.

సరే, ఆ విషయం అలా వుంచితే ఈ సినిమాకు కావచ్చు, లేదా ఇంతకు ముందు చెసిన సినిమాల విషయంలో కావచ్చు, మీరు ఓ ఫిల్మ్ మేకర్ పరిథి దాటి సోషల్ మీడియా ద్వారా పర్సనల్ అటాక్ చేసే స్థాయికి మీరు వెళ్లడాన్ని సినిమా ప్రమోషన్ లో పార్ట్ అనుకోవాలా? అదివేరుగా, ఇది వేరుగా చూడాలా?

నేను ప్రతిదాని మీదా ట్వీట్ చేస్తుంటారు. అయితే ఏదైనా పని చేస్తున్నపుడు ఆ పని మీద ఎక్కువ ట్వీట్ లు వేస్తుంటారు. ఆ విధంగా సినిమాలు చేస్తున్నపుడు ఆ సినిమాలకు రిలేటెడ్ గా ఎక్కువ ట్వీట్ లు వేస్తుంటాను. అంతే.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ సాంగ్ వదిలినపుడు ఒరిజినల్ ఫోటోలు వాడడంలో మీ ఉద్దేశం ఏమిటి?

మొదటి నుంచీ నేను ఏదీ దాయలేదు. వెన్నుపోటు అన్నది అందరికీ తెలిసింది. అన్ని మాధ్యమాల్లో వచ్చింది. సరే, అది ఎందుకు జరిగింది? అన్నదాంట్లో ఎవరి వెర్షన్ వాళ్లకు వుంటుంది. కానీ వెన్నుపోటు అన్నది వాస్తవం. ఇన్ టెన్షన్ వేరై వుండొచ్చు. డిబేట్ వుండొచ్చు. అంతే కానీ జరిగింది కాదు అని ఎవ్వరూ ఈ రోజుకు ఎవ్వరూ ఖండించలేదు. పైగా నేను పబ్లిక్ డొమైన్ లో వున్న ఫొటోలే తీసి అక్కడ పెట్టాను. పైగా ఇవన్నింటికి రామారావుగారి విడియోలు బోలెడు వున్నాయి.

ఇవన్నీ మీకు సపోర్టింగ్ పాయింట్లా? రేపటి లీగల్ బ్యాటిల్ లో?

ఇక్కడ టూ థింగ్స్. మూడు రకాలుగా సినిమా మీదకు రావడానికి చాన్స్ వుంది. ఒకటి నన్ను బెదిరించడం. టీవీ రౌడీలు వంటి వారు. రెండోది ఎవర్నన్నా తక్కువగా చూపించడం. నా ఇంటర్ పిటేషన్ నేను ఇస్తున్నాను. రాజకీయ నాయకులు విపరీతంగా విమర్శించుకుంటూ వుంటారు. నేను కానీ నా సినిమా కానీ దానికన్నా ఎక్కువ ఏం చెబుతుంది. వాళ్లు డైరక్ట్ గా మాట్లాడుతున్నారు కదా? ఇక లా అండ్ ఆర్డర్ సమస్య. ఇది వంగవీటి టైమ్ నుంచి వింటున్నాను. పద్మావతి తదితర సినిమాల విషయంలో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఈవిషయంలో గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లో నాదెండ్ల భాస్కరరావు ను విలన్ గా చూపించారు. మరి ఎలా వచ్చింది సినిమా బయటకు. ఆయన ఆపలేకపోయారు కదా? అంతకు మించి నావెనుక ఆర్మీ లేదు. నేనేం అంత బలవంతుడి కాదు.

నందమూరి ఫ్యామిలీ నుంచి లీగల్ బ్యాటిల్ ఏమన్నా వస్తుందని మీరు ఊహిస్తున్నారా?

లీగల్ బ్యాటిల్ అనేది ఎవరైనా చేయొచ్చు. కానీ నేను ముందే చెప్పాను కదా? విషయాలు అన్నీ. అన్నింటిని చూసుకోకుండా సినిమా తీయడానికి దిగుతానా?

లీగల్ బ్యాటిల్ సంగతి అలా వుంచండి. ఆంధ్రలో వున్న ఫ్రభుత్వానికి మీరు విలన్ గా చూపించబోతున్న నాయకుడు సిఎమ్ గా వున్నారు. ఒకవేళ అక్కడ సినిమాపై బ్యాన్ అనే అస్త్రం వాడితే మీరు ఏం చేయగలరు.

ఇక్కడ సిఎమ్ అంటే అన్నింటికీ అతీతం కాదు. ఏం చేసినా లీగల్ ప్రాసెస్ లో వెళ్లాలి. వాటన్నింటి మీద నాకు అవగాహన వుంది. అన్నీ స్టడీ చేసే దిగాను రంగంలోకి.

అంటే మీ ఆయుధాలు అన్నీ రెడీ చేసుకునే రంగంలోకి దిగారన్నమాట.

ఆయుధాలేం లేదు. నాకు వున్నది కేవలం రాజ్యంగం మాత్రమే.

ఈ సినిమా కోసం లైవ్ పాత్రలు అన్నింటినీ కలిసారా?

లేదు. కేవలం పుస్తకాలు చదివాను. లక్ష్మీపార్వతిని మామూలుగా జస్ట్ కలిసాను కానీ విషయ సేకరణ కోసం కాదు. ఎవర్ని కలిసినా నిజాలు చెబుతారన్న నమ్మకం లేదు.

బాలయ్యగారితో మీకు పరిచయం, సాన్నిహిత్యం వుంది కదా? ఆయన ఈ సినిమా గురించి మీతో ఏమీ అనలేదా?

లేదు. ఆయన బయోపిక్ లో బిజీగా వున్నారు. పైగా ఆయన నాకు తెలిసి, నా సినిమాను సీరియస్ గా తీసుకుని వుండరు.

ఇన్ని హిస్టరీలు, ఇంతమంది చరిత్రలు మీరు తవ్వి తీస్తున్నారు. మరి భవిష్యత్ చరిత్రలో ఆర్జీవీ జనాల దృష్టిలో ఎలా మిగలబోతున్నారు.

అది ఎవరికి వారి ఎనలికల్ పవర్ మీద ఆధారపడి వుంటుంది. నేను ఎవర్నీ పట్టించుకోను. ఎవరి పెర్ సెప్షన్ వారిది. నేను మొదటి నుంచీ వెస్ట్రన్ ఫిలాసఫీ ఫ్రభావితం మీద పెరిగాను.

అసలు మీరు ఫ్యామిలీ బంధాలు వుండి వుంటే ఇలా మొండిగా తయారై వుండేవారా?

కచ్చితంగా లేదు. ఎప్పుడైతే మీరు దేవుడ్ని,విలువల్ని, ఫ్యామిలీ వాల్యూస్ ను వదిలేస్తేనే ఫ్రీడమ్ వస్తుంది లేదూ అంటే బావిలో కప్పలే.

దేవుడి సంగతి అలా వుంచండి, విలువలు వదిలేయడం అంటే..

విలవలు అంటే రకరకాలు. అవి కూడా కాలాన్ని బట్టి మారుతుంటాయి. అందువల్ల విలువలు స్థిరంగా వుంటాయని అంటే నేను ఒప్పుకోను.

మరి మీరు విలువలు వదిలేసి, తిరిగి చంద్రబాబు నాయుడో, ఎన్టీఆర్ ఇంట్లో వాళ్లో ఆయన పట్ల విలువలు వదిలేసారు అని అనడం ఎంత వరకు సమంజసం?

నేను అలా అనలేదు. అనటం లేదు. ఏ మనిషి ఏ పని చేసినా పరిస్థితుల ప్రాబల్యం వల్ల చేస్తాడు. దాని వల్ల లాభం లేదా పరిస్థితి లేదా అజెండా అని వుంటుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ బోర్డర్ లో వుంటుంది.

ఈ సినిమాలో విలన్ ఎవరు?

ఇది హీరో విలన్ సినిమా కాదు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య రిలేషన్ మీద సినిమా

ఈ సినిమా ఎటువంటి అడ్డంకులు లేకుండా బయటకు వస్తుందని మీరు నూటికి నూరుపాళ్లు నమ్మకంతో వున్నారా?

బయటకు రాకుండా అయితే ఆపలేరు. చూడండి. ఒకటి నన్ను ఎవరైనా చంపేయాలి. అయినా దానికి కూడా ఓ మార్గం ఆలోచించి వుంచాను. ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూ ట్యూబ్ లో పెట్టాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవరూ ఆపేయలేరు.

-విఎస్ఎన్ మూర్తి