తన క్లైంట్ రియా చక్రబర్తి ఎలాంటి ముందస్తు బెయిల్ కూ అప్లై చేయలేదని ప్రకటించారు ఆమె లాయర్. ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీకి తోడు.. ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రియాను విచారిస్తూ ఉంది. తాజాగా ఎన్సీబీ విచారణకు హాజరైంది రియా.
ఈ సందర్భంగా ఆమె చుట్టూ మీడియా ప్రతినిధులు మూగిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఉత్తరాదిన రియా చక్రబర్తి వార్తలు మీడియాకు టీఆర్పీలను తెచ్చిపెడుతున్నట్టుగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఏమిటో ఆ ఫొటో చాటి చెబుతూ ఉంది.
ఇక ఎన్సీబీ విచారణలో రియా ఏం చెప్పిందనే అంశం గురించి కూడా అక్కడి మీడియా తన కథనాలను ఇస్తోంది. సుశాంత్ కు డ్రగ్స్ ను సమకూర్చిపెట్టినట్టుగా రియా ఒప్పుకుందని ఆమెకు వ్యతిరేక కథనాలను ఇవ్వడమే పనిగా పెట్టుకున్న టైమ్స్ నౌ, టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాలు ఉటంకిస్తున్నాయి. తను డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసినట్టుగా రియా ఒప్పేసుకుందని, అయితే తను డ్రగ్స్ తీసుకోలేదని ఆమె ఎన్సీబీ ముందు చెప్పిందని ఆ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
రియా చక్రబర్తిని కూడా అరెస్టు చేస్తారని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఇప్పటికే రియా సోదరుడిని అరెస్టు చేశారని, తమ కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఉత్తరాది మీడియా కూడా ఈ వ్యవహారంలో భలే తమాషాగా వ్యవహరిస్తోంది. మొదటేమో నెపొటిజం మీద చర్చ పెట్టింది, ఆ తర్వాత రియా చక్రబర్తి-ఆదిత్య ఠాక్రే అంటూ రెచ్చిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు అక్కడి మీడియా డ్రగ్స్ పై పోరాటం చేస్తోంది! ఇంతకు ముందు మీడియా చేసిన ఆరోపణలు అడ్రస్ లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు డ్రగ్స్ లో రియాను దోషిని చేసేసి.. ఎలాగోలా తన ఇగోను ఉత్తరాది మీడియా చల్లార్చుకుంటోంది!