Advertisement


Home > Movies - Movie News
సల్మాన్‌ఖాన్‌ నిజంగానే 'ట్యూబ్‌లైట్‌'

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌, పెళ్ళి విషయంలోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ తనను తాను 'ట్యూబ్‌లైట్‌'గా అభివర్ణించుకుంటున్నాడు. ఇన్నేళ్ళ జీవితంలో ఎంతోమందిని ప్రేమించాడట ఈ బాలీవుడ్‌ కండల వీరుడు. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. సల్మాన్‌ఖాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌.. అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే, అందులో చాలామంది అందాల భామల పేర్లు తెరపైకొస్తాయి. సంగీతా బిజిలానీ నుంచి కత్రినాకైఫ్‌ దాకా.. బోల్డంతమంది గర్ల్‌ఫ్రెండ్స్‌ వున్నారు సల్మాన్‌ఖాన్‌కి. ఆ లిస్టే చాంతాడంత వుంటుంది. 

ప్రేమ సరే, పెళ్ళి మాటేమిటి.? అని ప్రశ్నిస్తే, 'ట్యూబ్‌లైట్‌ని కదా.. అందుకే, ఆ వెలుగు వచ్చేదాకా ఆగలేదు.. నాకు చాలామంది దూరమయ్యింది అలాగే..' అని సెలవిచ్చాడు సల్మాన్‌ఖాన్‌. ఇక, స్టార్‌డమ్‌ విషయంలోనూ తనది 'ట్యూబ్‌లైట్‌' మెంటాలిటీయేనట. స్టార్‌డమ్‌ గురించి ఎప్పుడూ ఆలోచించలేదనీ, తాను స్టార్‌ననే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోననీ సల్మాన్‌ఖాన్‌ చెప్పుకొచ్చాడు. 

వసూళ్ళ విషయంలోనూ సల్మాన్‌ఖాన్‌ తనను తాను 'ట్యూబ్‌లైట్‌'తో పోల్చేసుకున్నాడు. తన సినిమా మంచి వసూళ్ళు సాధిస్తే, నిర్మాత హ్యాపీగా వుంటాడనీ, అంతకు మించి తానెప్పుడూ వాటి గురించి లెక్కలేసుకోలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదంతా సల్మాన్‌ఖాన్‌ తన తదుపరి సినిమా 'ట్యూబ్‌లైట్‌' కోసం ప్రచారంలా వుంది కదూ.! ఏమాటకామాటే చెప్పుకోవాలి ప్రేమ విషయంలో, పెళ్ళి విషయంలో సల్మాన్‌ఖాన్‌ 'ట్యూబ్‌లైటే'.! స్టార్‌డమ్‌ విషయంలో మాత్రం అలా కాకపోవచ్చు. ఎందుకంటే, ఆ స్టార్‌డమ్‌ని మ్యాగ్జిమం ఉపయోగించేసుకుంటుంటాడు సల్మాన్‌ఖాన్‌.