cloudfront

Advertisement


Home > Movies - Movie News

భరత్‌కి కూడా సేమ్‌ సిట్యువేషన్‌

భరత్‌కి కూడా సేమ్‌ సిట్యువేషన్‌

'భరత్‌ అనే నేను' చిత్రం మరో వారంలో విడుదలకి సిద్ధంగా వుండగా అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం ఆసక్తికరంగా అనిపిస్తూ వుండడంతో ఈసారి మిస్‌ఫైర్‌కి ఛాన్సే లేదనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టే ప్రతి విషయం ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' టైమ్‌ పరిస్థితిని తిరిగి గుర్తు చేస్తోంది.

'శ్రీమంతుడు' చిత్రానికి ముందు కూడా మహేష్‌ వరుసగా రెండు భారీ పరాజయాలు చవిచూసి వున్నాడు. అలాగే ఆ చిత్రం విడుదలకి ముందు 'బాహుబలి' లాంటి భారీ విజయం వచ్చి వెళ్లింది. 'బ్రహ్మూత్సవం', 'స్పైడర్‌'తో తీవ్రంగా నిరాశ పరిచిన మహేష్‌కి ఇప్పుడు 'రంగస్థలం'లాంటి ఘన విజయం తర్వాత బాక్సాఫీస్‌ హాట్‌ హాట్‌గా కొత్త రికార్డులతో ఎదురు చూస్తోంది.

హైప్‌కి తగ్గట్టు డీసెంట్‌ సినిమా అందిస్తే చాలు... 'భరత్‌ అనే నేను' ఈజీగా రికార్డులని తిరగరాసేస్తుంది. మహేష్‌ ముఖ్యమంత్రి పాత్ర చేయడమే ఈ చిత్రానికి పెద్ద యుఎస్‌పిగా మారింది. విడుదలకి ముందు కనిపిస్తోన్న సూచనలన్నీ శ్రీమంతుడు విజయాన్ని రిపీట్‌ చేస్తాయనే నమ్మకం కలిగిస్తోన్న నేపథ్యంలో భరత్‌ అనే నేను ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందనేది ప్రస్తుతం టాలీవుడ్‌ ట్రేడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.