cloudfront

Advertisement


Home > Movies - Movie News

దారుణం.. హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ

దారుణం.. హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ

రానురాను మనిషి విచక్షణ కోల్పోతున్నాడేమో అనిపిస్తోంది. ఏది మంచి, ఏది చెడు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా నందమూరి హరికృష్ణ మృతి సందర్భంగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏకంగా హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన దారుణమైన ఘటన వెలుగుచూసింది.

పైన చూస్తున్న ఫొటోలో ఉన్నది హరికృష్ణ పార్థివదేహం. హరికృష్ణ కన్నుమూసిన తర్వాత అక్కడి హాస్పిటల్ సిబ్బంది ఇలా భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగి అమానుషంగా ప్రవర్తించారు. అలా తీసిన సెల్ఫీ కాస్తా, అలా అలా చేతులు మారి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హరికృష్ణ కన్నుమూశారనే విషయాన్ని హాస్పిటల్ వర్గాలు ధృవీకరించిన తర్వాత, కుటుంబ సభ్యులకు పార్థివదేహాన్ని అప్పగించే ప్రాసెస్ లో భాగంగా ఈ సిబ్బంది ఇలా సెల్ఫీ దిగారు. ఆ సమయంలో స్పాట్ లో డాక్టర్ లేరు. ఇప్పుడీ సెల్ఫీపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.

హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు తీసిన విజువల్స్ కొన్నింటినీ టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి. వాటిపై మొన్నంతా తీవ్ర దుమారం చెలరేగింది. అలాంటి సన్నివేశాల్ని ప్రసారం చేయకూడదని, కాస్తయినా మానవత్వం కలిగి ఉండాలంటూ సోషల్ మీడియీలో సదరు ఛానెల్స్ పై ప్రజలు దుమ్మెత్తిపోశారు. అదే అతి అనుకుంటే.. ఈ సెల్ఫీ మరింత దారుణం.

అలా అని ఇదేదో మార్ఫింగ్ చేసిన ఫొటో కాదు. దురదృష్టవశాత్తూ దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు పాల్పడిన ఫొటోలో ఉన్న సిబ్బందిపై చర్యలైతే తప్పవు. వాళ్లను తక్షణం ఉద్యోగాల నుంచి తొలిగించడం గ్యారెంటీ. కానీ అంతకంటే ముందు మనిషి విచక్షణ మరీ ఇంతలా దిగజారిపోయిందనేది బాధాకరమైన విషయం.