Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెన్సిబుల్, హ్యూమ‌ర‌స్ డ్రామా 'ది డెవిల్ వేర్స్ ప్రాదా'

సెన్సిబుల్, హ్యూమ‌ర‌స్ డ్రామా 'ది డెవిల్ వేర్స్ ప్రాదా'

'ది డెవిల్ వేర్స్ ప్రాదా'.. ప్రాదా అనేది ఒక ప్ర‌ముఖ ఇటాలియ‌న్ లగ్జ‌రీ ఫ్యాష‌న్ బ్రాండ్. డెవిల్ క‌థ‌లోని ఒక ప్ర‌ధాన పాత్ర‌!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ ఎదుర‌య్యే అనుభ‌వాల‌ను సినిమాగా రూపొందిస్తే, వీక్ష‌కుడు అనేక సార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌న‌ను తాను త‌రచి చూసుకుంటే.. ఒక సినిమా స‌క్సెస్ కు అంత‌క‌న్నా కావాల్సింది ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంటి ఒక అరుదైన సినిమా 'ది డెవిల్ వేర్స్ ప్రాదా'. న‌యాత‌రం యువ‌తీయువ‌కుల జీవితం మీద ఒక ఎన‌ర్జిటిక్ సెటైర్, అదే స‌మ‌యంలో మ‌న‌కు తెలియ‌ని ఫ్యాష‌న్ సామ్రాజ్యంపై ఈ సినిమా మ‌రింత బ‌లమైన సెటైర్ గా నిలుస్తుంది.

ఒక అమ్మాయి, ఆమె బాస్ ప్ర‌ధాన పాత్ర‌లుగా క‌నిపించినా ఇది అంద‌రికీ వ‌ర్తించే సినిమా. నిజ జీవిత అనుభ‌వాల నుంచి పుట్టిన క‌థ కావ‌డంతో, అనేక మంది త‌మ తీరును త‌ర‌చి చూసుకునేలా ఉంటుంది. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలోని ఒక బాస్ తీరును చూపించినా, అలాంటి బాస్ లు అంద‌రికీ, అన్ని రంగాల్లోనూ ఉండ‌నే ఉంటారు! త‌మ ద‌గ్గ‌ర ప‌ని చేసే ఉద్యోగుల‌కు విచిత్ర‌మైన ప‌రీక్ష‌లు పెడుతూ వారు శాడిస్టిక్ ప్ల‌జ‌ర్ పొందే టైపు!

ఆమె పేరు మిరండా ప్రీస్ల్టీ.  ఆ పేరే అమెరిక‌న్ ఫ్యాష‌న్ రంగంలో సంచ‌ల‌నం. ఆమె 'ర‌న్ వే' అనే ఒక ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్. డిజైన‌ర్లు,  మోడ‌ళ్లు, వ‌స్త్ర త‌యారీ సంస్థ‌లకు మిరండా అంటే ఎన‌లేని క్రేజ్. ఆ లీడింగ్ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ అంటే భ‌య‌మూ, భ‌క్తి!  ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలోని వ్య‌క్తులు ఆమె పేరు చెబితేనే విన‌య‌, విధేయ‌త‌ల‌ను క‌న‌బ‌రుస్తారు. త‌న ప‌నితీరుతో ఇండ‌స్ట్రీలో అలాంటి ఇమేజ్ ను సంపాదించుకుని ఉంటుంది మిరండా.

త‌న వ‌ర‌కూ మిరండా ఒక ప‌ర్ఫెక్ష‌నిస్టు. వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా ప‌క్క‌న పెట్టి.. త‌న వృత్తిలో అద్భుతాలు సాధించిన వ్య‌క్తి ఆమె. ఆమె పేరు చెబితే ఏ ప‌ని అయినా సులువుగా జ‌రుగుతుంది. ఆమె ద‌గ్గ‌ర ప‌ని చేస్తే జాబ్ మార్కెట్లో ఆ త‌ర్వాత బోలెడ‌న్ని అవ‌కాశాలు వ‌ల‌చి వ‌స్తాయి! అయితే ఆమె ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డానికి ఒకే ఒక ప్రాబ్ల‌మ్, ఆ ప్రాబ్ల‌మ్ ఆమే!

క‌థ‌లో మ‌రో ప్ర‌ధాన పాత్ర ఒక యంగ్ గ్రాడ్యుయేట్. ఎన్నో బిగ్ డ్రీమ్స్ ఆమెకు. త‌న పేరు ఆండీ. జ‌ర్న‌లిజంలో ప‌ని చేయాలి, ర‌చ‌యిత కావాలి అనేవి ఆమె డ్రీమ్స్. అదే స‌మ‌యంలో త‌న వ్య‌క్తిగ‌త జీవితం ప‌ట్ల కూడా ఆమె బోలెడంత ల‌వ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ల‌వ‌ర్ కూడా ఆమె జీవితంలో ఒక ప్ర‌ధాన భాగం. వారి ప‌ట్ల బాధ్య‌తాయుతంగా, వారితో ఎంతో ప్రేమ‌పూర్వ‌కంగా జీవించే యువ‌తి ఆండీ.

అలాంటి ఆండీకి అనుకోకుండా.. మిరండా ప్రీస్ల్టీ ద‌గ్గ‌ర ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తుంది. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో పేరెన్నిక గ‌న్న ర‌న్ వే మ్యాగ‌జైన్ లో ప‌ని చేసే జాబ్ ద‌క్కుతుంది! అది కూడా మిరండా అసిస్టెంట్ గా!

ఆ జాబ్ లోకి చేరాగానే ఆండీ జీవితం మారిపోతుంది. ఉరుకులూ, ప‌రుగులూ.. ఆమె డైలీ రొటీన్ లు అవుతాయి. ప‌ని రాక్ష‌సి అయిన మిరండా త‌న అసిస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఆ ఆట‌లో బంతిలా త‌యార‌వుతుంది ఆండీ ప‌రిస్థితి.

ఉద‌యాన్నే మిరండా ఆఫీసుకు వ‌చ్చే స‌మ‌యానికి ఆమెకు అవ‌స‌ర‌మైనవ‌న్నీ స‌మ‌కూర్చి పెట్ట‌డం, ఆమె బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యానికి కోటు రెడీ చేయ‌డంతో స‌హా.. బోలెడ‌న్ని ప‌నులు. ఆఫీసు ప‌నుల‌తో పాటు త‌న కుటుంబానికి సంబంధించిన ప‌నుల‌ను కూడా అసిస్టెంట్స్ తో చేయించుకునే మిరండాకు.. అతి త్వ‌ర‌లోనే ఆండీ న‌చ్చుతుంది. ఆ న‌చ్చ‌డంతో మ‌రిన్ని బాధ్య‌త‌లు అండీ మీద ప‌డ‌తాయి!

స‌గంస‌గం స‌మాచారం ఇచ్చి అసిస్టెంట్ కు ప‌నులు అప్ప‌గించే త‌త్వం మిరండాది. త‌న పిల్ల‌ల‌కు కొత్త‌గా వ‌చ్చిన హ్యారీపోట‌ర్ న‌వ‌ల తెచ్చివ్వ‌మ‌ని ఆండీకి ఆర్డ‌ర్ లాంటి రిక్వెస్ట్ జారీ చేస్తుంది ఆ లేడీ బాస్. త‌నకు ఇద్ద‌రు పిల్ల‌ల‌ని,  వారు బుక్ క‌వ‌ర్ కూడా త‌మ‌కు న‌చ్చే క‌ల‌ర్ లో ఉండాల‌ని కోరుకుంటార‌ని మిరండా మొద‌ట చెప్ప‌దు! అయితే బాస్ తీరును అర్థం చేసుకుని, ఆమె పిల్ల‌ల అభిరుచి మేర‌కే అన్ని ఏర్పాట్లూ చేసి ఘ‌టికురాలు అనిపించుకుంటుంది ఆండీ!

అక్క‌డ నుంచి బాస్- అసిస్టెంట్ మ‌ధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా సాగుతుంది సినిమా. త‌న ప‌నిలో బాస్ ఎంత రాక్ష‌సో, బాస్ చెప్పిన ప‌నిని ఆమె అంచ‌నాల‌కు మిన్నగా నెర‌వేర్చ‌డంలో అసిస్టెంట్ త‌న స‌త్తా చూపిస్తుంది. మిరండా దగ్గ‌ర ఎలాంటి వారు అయినా కొంత కాలం కూడా ప‌ని చేయ‌లేరు. త‌న ఉద్యోగుల‌ను ఫైర్ చేయ‌డంలో మిరండాకు ఇండ‌స్ట్రీలోనే పేరుంది! అలాంటి వ్య‌క్తి ద‌గ్గ‌ర ఆమెను మెప్పిస్తూ, ఆమెకు న‌మ్మ‌క‌మైన అసిస్టెంట్ గా మారుతుంది ఆండీ. మిరండా త‌న మీద ఆధార‌ప‌డేలా చేసుకుంటుంది. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో ఆమె అలా పై చేయి సాధిస్తుంది.

ఇలా బాస్ ను మెప్పించే ప‌నిలో సాగుతున్న ఆండీకి వ్య‌క్తిగ‌త జీవితంలో ఆనందం దూరం అవుతుంది! త‌న ల‌వ‌ర్ తో కాసేపు గ‌డిపే అవ‌కాశం దొర‌క‌దు, ఆమె త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని అత‌డు దూరం అవుతాడు.  త‌న ప్రాణంగా చూసుకునే స్నేహితురాలి మీద ఇప్పుడు ఆండీ శ్ర‌ద్ధ చూప‌లేదు. అంత వ‌ర‌కూ త‌న వాళ్ల‌తో ఎంతో ఎమోష‌న‌ల్ గా ఉండిన ఆండీ, త‌న బాస్ ను మెప్పించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని త‌న వాళ్ల‌తో మెటీరియ‌లిక్ గా మారిపోతుంది!

ఆండీ ప‌ని తీరును మెచ్చుకునే మిరండా, ఎలాంటి కాంప్లిమెంట్లూ ఇవ్వ‌దు కానీ, ఆమెను పారిస్ ఫ్యాష‌న్ వీక్ కు తీసుకెళ్తుంది. మిరండా అసిస్టెంట్స్ చాలా మంది ఆ అవ‌కాశాన్ని ఆశిస్తూ ఉంటారు.  చాలా కాలంగా మిరండా పెట్టే టార్చ‌ర్ నంతా భ‌రించే చాలా మందికి ద‌క్క‌ని అవ‌కాశం ఆండీకి ద‌క్కుతుంది! మిగ‌తా వాళ్లు కుళ్ల‌కుంటారు, వారి ఎమోష‌న్స్ ను ప‌ట్టించుకోని స్థితికి చేరుతుంది ఆండీ. త‌న బాస్ ను మెప్పించే క్ర‌మంలో స‌గ‌టు మ‌నుషులు ద్వేషించే ఆమెలానే త‌యారు అవుతూ ఉంటుంది ఆండీ!

త‌న జీవితంలో ఒక‌సారైనా చూడాల‌నుకున్న పారిస్ లో ఆండీకి తన పాత ఎమోష‌న్స్ అన్నీ గుర్తుకు వ‌స్తాయి. వృత్తి జీవితాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకుని త‌ను ఏం మిస్ అవుతున్న‌ట్లో ఒక లీల‌గా గుర్తుకు వ‌స్తుంది.  అంత వ‌ర‌కూ త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోని బాధ‌ల‌ను ఎప్పుడూ చెప్ప‌ని అంశాల‌ను కూడా మిరండా పారిస్ లో తొలి సారి ప్ర‌స్తావిస్తుంది. త‌న మూడో భ‌ర్త కూడా విడాకుల నోటీసు పంపించిన విష‌యాన్ని చెప్పి అసిస్టెంట్ వ‌ద్ద క‌న్నీరు పెడుతుంది ఆ బాస్!

దీంతో ఆండీకి త‌ల‌తిరిగిపోతుంది. పైకి ఎంతో గంభీరంగా, త‌న రంగంలోని విజ‌యాల‌కు చిరునామాగా, స‌మాజంలో ఎంతో గౌర‌వాన్ని పొందే మిరండా ప్రీస్ల్టీ వ్య‌క్తిగ‌త జీవితంలో ఉన్న శూన్యాన్ని అర్థం చేసుకుంటుంది ఆండీ. ఆమె దారిలో త‌ను కూడా న‌డుస్తున్న విష‌యాన్ని ఆండీ అర్థం చేసుకుంటుంది. అది జీవితం కాద‌ని గ్ర‌హిస్తుంది.

మిరండా ప్రీస్ల్టీ పారిస్ టూర్ ను అక్క‌డి ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో త‌న రాజీనామాను ప్ర‌క‌టించి, న్యూయార్క్ కు వెనుదిరుగుతుంది ఆండీ! ఫ్యాష‌న్ వ‌ర్గాల్లో ఆండీ తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. మిరండా వ‌ద్ద అసిస్టెంట్ల‌ను ఆమె ఫైర్ చేయ‌డమే త‌ప్ప‌, ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ ఆమె వ‌ద్ద త‌మ‌కు తాము ప‌ని మానేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి ఉండ‌రు. అలాంటి నేప‌థ్యంలో.. ఆండీ గురించి ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను ఇస్తుంది.

ఆండీ న్యూయార్క్ లోని ఒక ప‌బ్లిషింగ్ సంస్థ‌లో ఉద్యోగం కోసం అప్లికేష‌న్ పెట్టుకుంటుంది. త‌నకు దూర‌మైన ప్రియుడిని క‌లిసి క్ష‌మాప‌ణ‌లు చెబుతుంది, అత‌డికి తిరిగి చేరువ‌వుతుంది. ఆండీ గురించి రెఫ‌రెన్స్ కోసం ఆ ప‌బ్లిషింగ్ సంస్థ 'ర‌న్ వే' ఎడిట‌ర్ మిరండాకు కాల్ చేయ‌గా, ఆండీని ఉద్యోగంలోకి తీసుకుంటే నువ్వొక మూర్ఖుడివి అవుతావ‌ని అంటూ ఆండీ గురించి నెగిటివ్ కాండాక్ట్ స‌ర్టిఫికెట్ ఇస్తుంది.

మిరండా తీరు తెలిసిన ఆ ప‌బ్లిషింగ్ సంస్థ చీఫ్ ఆండీని ఉద్యోగంలోకి తీసుకుంటాడు.  ర‌న్ వే ఆఫీసు బ‌య‌ట మిరండా మునుప‌టి గాంభీర్యంతోనే కారులో వెళ్తుండ‌గా, ఆండీ ఆమెను త‌న చూపుల‌తోనే ప‌ల‌క‌రిస్తుంది. వాటిని ప‌ట్టించుకోకుండా.. ముందుకు సాగిపోతుంది మిరండా కారు. ఆండీ స్థానంలో నియ‌మితం అయిన‌ మిరండా కొత్త అసిస్టెంట్.. ఉరుకులుప‌రుగుల మీద వెళ్తుండ‌గా సినిమా ముగుస్తుంది!

సెన్సిబుల్ సినిమా, ఆండీగా అన్నా హాథవే.. ప్రేక్ష‌కుల‌ను త‌న ప్రేమ‌లో ప‌డేస్తుంది. మిరండా ప్రీస్ట్లీ పాత్ర‌ను అద్భుతంగా పోషించి ఆస్కార్ అవార్డును కూడా పొందింది మెరియిల్ స్ట్రీప్. వాస్త‌వానికి ఈ క‌థ‌ను రాసింది ఒక ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ కోసం ప‌ని చేసిన ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్ట్. ఆమె న‌వ‌ల‌గా దీన్ని రాయ‌గా, ఆ సోల్ ఏ మాత్రం మిస్ కాకుండా.. అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు ద‌ర్శ‌కుడు ఫ్రాంకెల్.

వోగ్ మ్యాగ‌జైన్ లో ప‌ని చేసిన లారెన్ వీస్బ‌ర్గ‌ర్ 'ది డెవిల్ వేర్స్ ప్రాదా' న‌వ‌ల‌ను రాశారు. త‌న స్వానుభ‌వాల‌నే ఆమె ఈ క‌థ‌లో చాలా వ‌ర‌కూ జొప్పించి ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు ఉన్నాయి. ప్ర‌ముఖ రచ‌యిత‌లు ఎవ‌రైనా ఇలా ఒక రంగంలోని వ్య‌క్తుల గురించి న‌వ‌ల రాస్తే.. అందులో స్ట‌డీ చేసిన నాట‌కీయ‌త ఉంటుంది. అయితే ఆ రంగంలో అనుభ‌వం ఉండటంతో.. స‌హ‌జ‌త్వంతో కూడిన డ్రామాను అద్భుతంగా పండించింది ర‌చ‌యిత్రి.

-జీవ‌న్ రెడ్డి.బి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?