cloudfront

Advertisement


Home > Movies - Movie News

డైరెక్టర్ శంకర్ వర్సెస్ కమేడియన్, ఫైట్‌!

డైరెక్టర్ శంకర్ వర్సెస్ కమేడియన్, ఫైట్‌!

తమిళ దర్శకుడు శంకర్, స్టార్ కమేడియన్ వడివేలుల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఒక సినిమా విషయంలో కొన్ని నెలలుగా వీరి మధ్యన యుద్ధం మొదలైంది. ఇప్పుడు అది పతాక స్థాయికి వెళ్లింది. ఇప్పటికే వీరి మధ్యన నడిగర్ సంఘం పంచాయితీ చేసినా.. ఇది ఒక కొలిక్కి రాకపోవడం విశేషం. ఇదంతా సూపర్ హిట్ సినిమా ‘హింసించే రాజు 23వ పులికేశి’కి సీక్వెల్ వెర్షన్ విషయంలో మొదలైంది.

దాదాపు దశాబ్దం కిందట వచ్చిన సినిమా 23వ పులికేశి. అది తమిళనాట బ్రహ్మాండమైన విజయం సాధించింది. సాదాసీదా కామెడీ సినిమానే అయినా, అప్పట్లో వడివేలుకు ఉన్న ఊపుతో తమిళంలో అది పెద్ద హిట్ అయ్యింది. తెలుగులోకి డబ్ చేశారు కానీ, ఇక్కడ ఆ పప్పులు ఉడకలేదు. ఆ తర్వాత వడివేలు ఫామ్ కోల్పోయాడు. ఆ తర్వాత సొంతంగా నిర్మాతగా మారి ఇలాంటి సినిమానే ఒకటి చేశాడు. అది కూడా ఫెయిల్.

అయితే ఫామ్ లో లేని వడివేలుతో నాటి సినిమాకు సీక్వెల్ ను ప్రతిపాదించాడు శంకర్. 23వ పులికేశిని రూపొందించిన చింబుదేవన్ తోనే 24వ పులికేశికి రూపకల్పన చేయించాడు. ఈ సినిమా రెండేళ్ల కిందటే అనౌన్స్ అయ్యింది. అక్కడ నుంచి పంచాయితే. ఈ సినిమాకు తను మొదట్లో డేట్స్ ఇచ్చిన మాట వాస్తవమే అని, 2016జూన్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి, 2016చివర కళ్లా పూర్తి చేస్తామని తనకు శంకర్ చెప్పాడని, అందుకే తను ఒప్పుకున్నాను అని, అయితే ఈ సినిమాను అనుకున్నట్టుగా ప్రారంభించలేకపోయారని వడివేలు అంటున్నాడు.

తను ఇచ్చిన డేట్స్ లో ఈ సినిమాను మొదలుపెట్టి పూర్తి చేయలేకపోయారని, ఆ రోజులు గడిచిపోయాకా.. తనపై ఫిర్యాదు చేశారని వడివేలు అంటున్నాడు. అయితే ఈ సినిమాపై తాము రెండున్నర కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేశామని, వడివేలు తప్పుకుంటే నష్టపోతామని, ఆ డబ్బు అతడే కట్టించాలని శంకర్ అండ్ కో అంటోంది. ఈ మేరకు సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ మధ్య సంఘం పంచాయితీ చేసి, కాంప్రమైజ్ చేసింది. వడివేలు కూడా 24వ పులికేశి చేస్తానని హామీ ఇచ్చాడన్నారు.

అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు కథ మళ్లీ అడ్డం తిరిగింది. వడివేలు మళ్లీ మొండికేశాడు. తన పాత వాదనతోనే ఈ సినిమాను చేసేది లేదని అంటున్నాడు. శంకర్, చింబుదేవన్ లకు తను డేట్స్ కేటాయించాను అని, సినిమాను తీయలేదని, దాని వల్ల తనకే నష్టం కలిగిందని అంటున్నాడతను. దీంతో కథ మళ్లీ మొదటకు వచ్చింది. అయినా.. ఇంత అరిచి గీ పెడుతున్న వడివేలుతో సినిమా తీసి కూడా శంకర్, చింబులు సాధించేది ఏమిటో!