గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘శివం భజే’. ఈ సినిమా టీజర్ ను బయటకు వదిలారు. అప్సర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా ఉన్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
సినిమాలో హీరో అశ్విన్ కి ఏదో మానసిక సమస్య ఉన్నట్టు బ్రహ్మాజీ, హైపర్ ఆది లతో చెప్పడం, ఇన్వెస్టిగేషన్ లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీన వంటి పలువురు నటులు నిమగ్నమై ఉండడం, అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నిటి వెనక దైవం ఉనికి ఉందని తెలియజేయడం, హీరో రౌద్ర రూపంలో రౌడీలను శూలంతో ఎత్తి పడేయడం… అన్నిటినీ మించి చివరగా అదిరిపోయే సీజీ విజువల్స్ లో దాచిన శివుడి దర్శనం, దానికి వికాస్ బడిస బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి టీజర్ ను ఆసక్తి కరంగా మార్చాయి.
టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”వైవిధ్యమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామన్నారు. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, ” ‘శివం భజే’ టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించిన తమ సినిమా టీజర్ కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు. పాటలు, ట్రైలర్, విడుదల తేదీ త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, ‘శివం భజే’ టీజర్ కి వచ్చిన స్పందనకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా సస్పెన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు డివోషన్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం” అన్నారు.